న్యూఢిల్లీ : దేశరాజధానిలోని జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) యూనిర్సిటీ వద్ద మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకున్నది. వర్సిటీ ఐదో నెంబర్‌ గేటు వద్ద ఒకసారి, ఒకటో నెంబర్‌ గేటు వద్ద ఇంకోసారి గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు, విద్యార్థులు తెలిపారు. జామియా వర్సిటీ ముందు విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, స్థానికులు సీఏఏకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్న సమయంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని చెప్పారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసుల దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కాగా, నాలుగురోజుల వ్యవధిలో జామియాలో రెండు సార్లు, షాహీన్‌బాగ్‌లో ఒకసారి కాల్పులు జరగడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.

గుర్తు తెలియని ఇద్దరు దుండగులు స్కూటీపై వచ్చి గాల్లో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. వర్సిటీ ఐదో నెంబర్‌ గేటు వద్ద ఒకసారి, ఒకటో నెంబర్‌ గేటు వద్ద కాల్పుల శబ్దం వినిపించినట్టు వివరించారు. ” ఎరుపు రంగు స్కూటీపై ఇద్దరు దుండగులు వచ్చారు. వారిలో ఒకరు ఎరుపు రంగు జాకెట్‌ ధరించారు. కాల్పుల శబ్దం వినబడగానే వారిని పట్టుకునేందుకు మేము ప్రయత్నించాం. కానీ, వారు అక్కడ నుంచి పారిపోయారు” అని వారు చెప్పారు. ఈ ఘటన అనంతరం వర్సిటీ బయట విద్యార్థులు, స్థానికులు వందలాదిగా గుమిగూడారు. విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 30 నిమిషాల అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు బుల్లెట్‌ షెల్స్‌ కోసం వెతికారు. అయితే తమకు అలాంటిదేమీ లభించలేదని పోలీసులు తెలపడం సర్వత్రా అనుమానాలను రేకెత్తిస్తున్నది.

ఢిల్లీ పోలీసులు వ్యతిరేకంగా విద్యార్థుల ధర్నా
కాగా, ఢిల్లీ పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జామియా నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట కూడా విద్యార్థులు నిరసనకు దిగారు. అయితే దుండగులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. కాగా, ఆ ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఏసీపీ జగదీశ్‌ యాదవ్‌ తెలిపారు. ఘటనపై దర్యాప్తును కొనసాగిస్తున్నామనీ, నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు మాత్రం పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు.

శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుత పద్దతిలో నిరసనలు చేస్తున్న షాహీన్‌బాగ్‌, జామియా నిరసనకారులపై దుండగుల వరుస కాల్పుల ఘటనలు ఆందోళనను కలిగిస్తున్నాయి. నిరసనకారులపై ఉద్దేశపూర్వకంగానే కాల్పులకు తెగబడుతూ.. వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి కొన్ని హిందూత్వ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. గతనెల 30న రాజ్‌ఘాట్‌కు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న జామియా విద్యార్థులపై పోలీసులు చూస్తుండగానే ఒక దుండగుడు కాల్పులు జరపగా.. ఓ విద్యార్థి గాయపడిన విషయం తెలిసిందే. అలాగే దాదాపు 50 రోజుల నుంచి షాహీన్‌బాగ్‌లో నిరసనలు చేస్తున్నవారిపై గత శనివారం మరొక వ్యక్తి సైతం కాల్పులకు తెగబడిన విషయం విదితమే.

ఢిల్లీ కాల్పుల ఘటనల నేపథ్యంలో డీసీపీ చిన్మరుబిశ్వాల్‌ను తొలగించిన ఈసీ షాహీన్‌బాగ్‌, జామియా విశ్వ విద్యాలయ ప్రాంతంలో కాల్పుల ఘటనల నేపథ్యంంలో ఢిల్లీ(ఆగేయ) డీసీపీ చిన్మరుబిశ్వాల్‌ను పదవీ బాధ్యతల నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. ఈ రెండు ప్రాంతాలు బిశ్వాల్‌ పరిధిలో ఉన్నాయి. బిశ్వాల్‌ స్థానంలో సీనియర్‌ అధికారి కుమార్‌ జ్ఞానేశ్‌కు బాధ్యతలు అప్పజెబుతున్నట్టు కమిషన్‌ తెలిపింది.
గురువారం జామియా మిలియా విశ్వవిద్యాలయ సమీపంలో రాజ్‌ఘాట్‌వైపు వెళ్తున్న ర్యాలీపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వర్సిటీకి చెందిన ఓ విద్యార్థి గాయపడ్డారు. ఆ తర్వాత రెండు రోజులకే(శనివారం) షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో మరో ఘటన జరిగింది. సీఏఏకు వ్యతిరేకంగా నిరంతర ఆందోళన ఈ ప్రాంతంలో జరుగుతున్న విషయం తెలిసిందే.

Courtesy Nava Telangana