విప్లవోద్యమ పక్ష పత్రిక  సంపాదకుడిగా సేవలు

హైదరాబాద్‌ సిటీ : తొలితరం విప్లవోద్యమ పక్ష పత్రిక ‘‘పిలుపు’’ సంపాదకుడిగా, పౌర హక్కుల సంఘం నాయకుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన మాడభూషి రంగనాథం (72) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రంగనాథం స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పుట్టకొండ గ్రామం. తల్లిదండ్రులు మణెమ్మ, గోవిందాచార్యులు. రంగనాథం సతీమణి విజయలక్ష్మి (ప్రసిద్ధ కవి జ్వాలాముఖి చెల్లెలు), పిల్లలు ఉజ్వల, వికాస్‌, స్రవంతి. శ్రీకాకుళ విప్లవోద్యమం స్ఫూర్తితో కళాశాల  దశలోనే రంగనాథం కమ్యూనిస్టు రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు.

ఆంధ్ర వర్సిటీలో పీయూసీ అనంతరం హైదరాబాద్‌ వచ్చారు. కొండపల్లి సీతారామయ్య పిలుపు మేరకు ఎంటీ ఖాన్‌ ప్రచురణకర్తగా ప్రారంభమైన ‘పిలుపు’ సంపాదకుడి బాధ్యతలు చేపట్టారు.. సికింద్రాబాద్‌ కుట్ర కేసులో భాగంగా రాజద్రోహం అభియోగం కింద రంగనాథం సుమారు ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించారు. పౌరహక్కుల సంఘం వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడిగానూ పనిచేశారు. 1975లో తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు వ్యతిరేకంగా నిరసన సభలో పాల్గొన్నందుకు మహాకవి శ్రీశ్రీతోపాటు  అరెస్టయ్యారు. ఎమర్జెన్సీలోనూ కొద్దిరోజులు జైలుశిక్ష అనుభవించారు. 1981 వరకు పౌరహక్కుల సంఘం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తుది వరకు విప్లవోద్యమానికి సానుభూతిపరుడిగా కొనసాగారు. రంగనాథం భౌతిక కాయాన్ని బంధుమిత్రుల సందర్శనార్థం కార్ఖానా, కాకాగూడ ప్రియ కాలనీలోని స్వగృహంలో ఉంచారు. వీక్షణం సంపాదకుడు వేణుగోపాల్‌, వరవరరావు సహచరి హేమలత నివాళులర్పించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Courtesy Andhrajyothi