జామియా, ఏఎంయూలో వికలాంగులపైనా దాడులు
లైబ్రరీలో చదువుకుంటున్నా వదలని పోలీసులు
విచక్షణారహితంగా బాదిన ఖాకీలు
అతివాద విద్యార్థి సంఘాల దాడులతో క్యాంపస్‌లు వీడుతున్న విద్యార్థులు

నాకు కండ్లు సరిగా కనబడవ్‌ సార్‌… నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను. ఈ నిరసనలతో నాకేం సంబంధం లేదుఅని వేడుకుంటున్నా ఆ పోలీసులు వినలేదు. నువ్‌ అంధుడివైతే ఇక్కడేం పని..? నేను నీ కండ్లు పూర్తిగా తొలగించడానికే ఇక్కడికొచ్చానుఅంటూ దయ లేని ఆ ఖాకీ కర్కశంగా దాడి చేస్తుంటే.. ఉన్న కొద్దిపాటి చూపునూ కోల్పోయాడో విద్యార్థి. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ (జేఎంఐ)లో గతేడాది డిసెంబర్‌లో క్యాంపస్‌లోకి ఖాకీలు చొరబడి.. సాధారణ విద్యార్థులనే కాదు..! వికలాంగులైన విద్యార్థులను గొడ్డును బాదినట్టు బాదారు. ఈ విధ్వంస ఘటనతో పలువురు వికలాంగులకు మరిన్ని గాయాలవ్వగా.. సాధారణ విద్యార్థులు వికలాంగులయ్యేదాకా పోలీసులు వారిని విడిచిపెట్టలేదు.

న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో అతివాద విద్యార్థి సంఘాల గ్రూపులు, పోలీసుల దాడులు పెరిగిపోయాయనేది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) నుంచి మొదలుకుని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ), జేఎంఐతో పాటు దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీలలోనూ విద్యార్థులపై దాడులు పెరిగిపోయాయి. అయితే ఈ దాడుల్లో సాధారణ విద్యార్థులతో పాటు వికలాంగ విద్యార్థులు కూడా బాధితులవుతున్నారు. వికలాంగులనీ చూడకుండా ముసుగు గుండాలు దాడి చేస్తుంటే.. కాపాడాల్సిన పోలీసులు సైతం అదే రీతిన వ్యవహరిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో జేఎంఐలోకి చొరబడిన ఖాకీలు.. వికలాంగులైన విద్యార్థులనూ వదల్లేదు. దొరికినోళ్లను దొరికినట్టు గొడ్డును బాదినట్టు బాదడంతో ఇప్పటికే కండ్లు కనబడక, కాళ్లు విరిగిన విద్యార్థులు మరింతగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాయపడిన వికలాంగ విద్యార్థులను ఓ ప్రముఖ ఆంగ్ల వెబ్‌ ఛానెల్‌ కలిసి వారి అభిప్రాయాలను సేకరించింది. ఈ సందర్భంగా చాలామంది విద్యార్థులు తామేం తప్పు చేశామని తమను కొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

లైబ్రరీలోకి చొరబడి..
సీఏఏ, ఎన్నార్సీ నిరసనలతో సంబంధం లేని విద్యార్థులను సైతం పోలీసులు వదల్లేదు. లైబ్రరీలో చదుకుంటున్నవారిని దొరకబట్టి మరీ వారి కర్కశం చూపించారని జామియాలో ఎంబీఏ చదువుతున్న అర్సలన్‌ తారిఖ్‌ అన్నాడు. తారిఖ్‌కు కండ్లు పాక్షికంగా కనబడవు. అతడు డిసెంబర్‌ 15 నాటి ఘటనను వివరిస్తూ… ‘ఆ రోజు సాయంత్రం 5.30 గంటలకు బయట బాంబులు పేలిన శబ్దాలు వినబడ్డాయి. అప్పుడు నేను లైబ్రరీలో చదువుకుంటున్నాను. బయట ఏదో గొడవ జరుగుతుంది, నాకేం కాదని అనుకున్నాను. కానీ, పోలీసులు లైబ్రరీ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చారు. వచ్చిందే తడువుగా తమ చేతికందిన విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. నా దగ్గరకు వచ్చి ముందు నా తల మీద బాదారు. ఆ పై నా వీపు, కాళ్లు మీద బలంగా తన్నుతూ ఈడ్చుకెళ్లారు. దాంతో నాకు కండ్లు మసకలు బారినట్టు అన్పిస్తుండగానే ఓ పోలీసు వచ్చి నా కండ్ల మీద బలంగా కొట్టడంతో నేను పెట్టుకున్న కండ్లద్దాలు పగిలాయి. నాకు కండ్లు సరిగా కనబడవనీ, చదువుకోవడానికే ఇక్కడకు వచ్చాచని పోలీసులను వేడుకున్నాను. దానికి ఆ పోలీసు.. నేను వచ్చింది నీ కండ్లను పూర్తిగా తీసెయ్యడానికే అంటూ బదులిస్తూ రాడ్‌తో బలంగా నా నెత్తి మీద కొట్టాడు’ అని తెలిపాడు.

జేఎంఐలో ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ చదువుతున్న మహ్మద్‌ మిన్హాజుద్దీన్‌ పోలీసుల ఘటన తర్వాత భయంతో కోమాలోకి వెళ్లాడని అతడి మిత్రులు చెప్పారు. ఈ ఘటన తర్వాత అతడు ఇంటికెళ్లాడనీ, ఇలా ఇంటికెళ్లిన వాళ్లు చాలామంది ఉన్నారని జేఎంఐలో మాస్‌ మీడియా చదువుతున్న జూహెబ్‌ అహ్మద్‌ ఖాన్‌ అన్నాడు. అంధుడైన జూహేద్‌ దీనిపై స్పందిస్తూ… ‘పోలీసుల క్రూర హింసతో చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు. నేను పుట్టుకతోనే అంధుడిని. నాకేం జ్ఞాపకాలు లేవు. గాయాలైన చాలామందిలో వికలాంగులూ ఉన్నారు. వారితో పాటు పోలీసుల కర్కశానికి సాధారణ విద్యార్థులూ వికలాంగులయ్యారు. వారికి ఇది మరో జీవితం. వారంతా భవిష్యత్‌ తలుచుకుని భయాందోళనలో బతుకుతున్నారు. గాయపడిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ చాలా అవసరం’ అని వివరించాడు.

గ్రెనైడ్స్‌ పేల్చి… గదుల్లోకి దూరి..!
ఏఎంయూలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్న తాజీమ్‌ది మరో కథ. అతడు వికలాంగుడు కాదు. కానీ ఏఎంయూలో పోలీసుల క్రూర చర్య కారణంగా అతడు తన చేతులు కోల్పోయాడు. తాజీమ్‌ నిరసనకారుడు కాదు.. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లోనూ పాల్గొనలేదు. కానీ, అవి జరుగుతున్న ప్రదేశానికి వంద మీటర్ల దూరంలో తన స్నేహితుడి కోసం ఎదురుచూస్తున్నాడు. కొద్ది నిమిషాల్లోనే పోలీసులు విసిరిన గ్రెనైడ్‌ బాంబ్‌ అతడి పక్కనే పడింది. దీంతో భయంభయంగా అక్కడినుంచి పరుగెత్తిన తాజీమ్‌.. దగ్గర్లో ఉన్న గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. ఇంతలో గది తలుపులు పగులగొట్టుకుని అందులోకి చొరబడిన రక్షకభటులు.. తాజీమ్‌తో పాటు అక్కడ దాక్కున్న మరికొంతమంది విద్యార్థులపై తమ ప్రతాపం చూపించారు. వీరిని కొడుతూనే.. వేరే గదుల్లో దాక్కున్న విద్యార్థులను బయటకు తీసుకొచ్చి మరీ సుమారు అరగంట పాటు లాఠీలు, రాడ్లు విరిగేదాకా బాదారు.

ఇదే విషయమై తాజీమ్‌ స్పందిస్తూ… ”ఐదుగురు పోలీసులు పదినిమిషాల పాటు మమ్మల్ని గొడ్డును బాదినట్టు బాదారు. కొట్టేప్పుడు సీసీ కెమెరాలు బంద్‌ చేశారు. నా కాలర్‌ పట్టుకుని ఈడ్చుకుంటూ జీపులో పడేశారు. నన్ను అనరాని మాటలతో దూషిస్తూ.. పాకిస్థాన్‌కు వెళ్లిపొమ్మన్నారు. ఆ సమయంలో.. ‘నేను వారికి విద్యార్థి గానే కాదు… కనీసం భారతీయుడిగానూ కనిపించలేదు” అని ఆవేదన వ్యక్తం చేశాడు.

భావాలను ఆమోదించకుంటే దాడి చేస్తున్నారు : షేక్‌ మహ్మద్‌ కైశ్‌, జేఎన్‌యూ
జేఎన్‌యూ చాలాకాలంగా వామపక్ష, ప్రజాతంత్ర రాజకీయ భావజాలానికి వేదికగా ఉంది. కానీ కొత్తగా వచ్చే విద్యార్థుల్లో కొంత మంది రైట్‌ వింగ్‌కు చెందిన వారొస్తున్నారు. వారు తమ సిద్ధాం తాలను, భావాలను ఆమోదించకుంటే మాపై దాడులకు పాల్ప డుతున్నారు. సీఏఏ, ఎన్నార్సీకి మేం వ్యతిరేక వైఖరి తీసుకుంటే వారికి నచ్చక వికలాంగులమనీ చూడకుండా మాపై దాడులు చేశారు. మేం శారీరకంగా వైకల్యంతో బాధపడుతుంటే వారు మానసిక వైకల్యంలో ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. నేను మొట్టమొదట బడికి వెళ్లింది భారతీయుడిగా.. ముస్లింగా కాదు.

Courtesy Nava Telangana