• ఇంకా కొందరికి అందని పరిహారం..
  • ఆందోళనలో మేడిపల్లి, నానక్‌నగర్‌ రైతులు..
  • కొనసాగుతున్న నిరసనలు

నగర శివార్లలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాలుష్యరహిత ఫార్మాసిటీ కోసం చేస్తున్న భూసేకరణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భూములు సేకరించినా కొందరి రైతులకు ఇంకా పరిహారం అందలేదు. దాంతో వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కందుకూరు, యాచారం, కడ్తాల్‌ మండలాల్లో ఫార్మాసిటీ కోసం భూసేకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ భూసేకరణ ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. తగిన పరిహారం ఇవ్వకుండానే ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుందంటూ రైతులు ఆరోపిస్తున్నారు.ఫార్మాసిటీ కోసం 19,333 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకు 9,400 ఎకరాలు సేకరించారు. అయితే జాతీయ పెట్టుబడి, తయారీ ప్రాంతం (ఎన్‌ఐఎమ్‌జెడ్‌) హోదా దక్కాలంటే కనీసం 12 వేల ఎకరాల భూమి అందుబాటు లో ఉండాలి. దీంతో భూసేకరణను ముమ్మరం చేశారు.

యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్‌, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లోని అసైన్డ్‌ భూములను ఫార్మా కంపెనీల కోసం రైతుల నుంచి సేకరించారు. దాంతో ఏళ్ల తరబడిగా వీటిపైనే ఆధారపడిన రైతులు.. ఇప్పుడు భూములు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.తమకు పరిహారం ఇచ్చి ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదెకరాల భూమి ఇస్తే.. రెండెకరాలకు, రెండెకరాలు ఇచ్చిన వారికి అర ఎకరం భూమికి పరిహారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూసేకరణలో.. పైరవీకారులు బాగా జేబులు నింపుకున్నారని ఆరోపిస్తున్నారు.

భూసేకరణ జరిగే గ్రామాలతో సంబంధం లే ని వారు కూడా భారీగా సొమ్ము చేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలానే భూసేకరణలో అక్రమాలు జరగడంతో ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది. దీనిపై విచారించిన అధికారులు కొంత డబ్బును రికవరీ చేశారు. అయితే, తాజాగా మరికొందరు తమకు ఇంకా పరిహారం అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాచారం మండలం నానక్‌నగర్‌, మేడిపల్లికి చెందిన రైతులు న్యాయం చేయాలంటూ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. కందుకూరు మండలం ముచ్చెర్లలోనూ గతంలో అక్రమాలు జరిగాయి. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యవహారంలో అప్పటి ఎమ్మార్వోను ప్రభుత్వం బదిలీ చేసినా.. కొందరికి ఇంకా న్యాయం జరగలేదు.

కొనసాగుతున్న నిరసనలు 
కొందరు తమకు పరిహారం పూర్తిగా అందలేదని విమర్శిసుంటే.. మరికొందరు అసలు భూసేకరణే వద్దంటూ అడ్డుకుంటున్నారు. తాజాగా యాచారం మండలం తాడిపర్తిలో ప్రజాభిపాయ్ర సేకరణకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దాంతో వారు వెనుదిరిగారు.

పూర్తి పరిహారమిచ్చి ఆదుకోవాలి
నాకు 13 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. ఇది భూదాన్‌ భూమి. ఇప్పటి వరకూ ఒక్క పైసా ఇవ్వలేదు. అధికారులకు ఫిర్యాదు చేస్తే.. కలెక్టర్‌ను కలవాలని చెబుతున్నారు. భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఆ ఆధారం పోయింది. మాకు పరిహరం ఇచ్చి ఆదుకోవాలి.
సంగం బుచ్చయ్య, రైతు మేడిపల్లి

భూమి తీసుకుని పరిహారం ఇవ్వట్లేదు
నాకు మూడెకరాల పదిగుంటలు భూమి ఉంది. ఇందులో ఇంకా రెండెకరాల భూమికి పరిహారం అందలేదు. మా భూమికి 45 జీవో ప్రకారం కాకుండా 2013 జీవో ప్రకారం పరిహారం ఇవ్వాలి. మాకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్‌, జేసీ, ప్రజాప్రతినిధులు ఇలా ఎవరికి చెప్పినా.. మా బాధ పట్టించుకోవట్లేదు. ఇంత అన్యాయం ఎప్పుడూ చూడలేదు.
కొప్పు రవి, నానక్‌నగర్‌ రైతు

కొంత ఇచ్చి మిగిలింది ఎందుకియ్యరు?
39 సర్వే నెంబర్‌లో నాకున్న మూడెకరాల భూమి తీసుకుండ్రు. ఇంత దాక చిల్లిగవ్వ ఇయ్యలేదు. ఎలక్షన్లప్పుడు మీ పైసలు ఇప్పించి ఆదుకుంటమని చానా మంది నాయకులు చెప్పిండ్రు, భూమి చుట్టు కంచె వేసిండ్రు. ఉన్న ఆదారం పోయింది. ఎలా బతకాలో తెలియడం లేదు.
గొట్టె రాముల్లమ్మ, కుర్మిద్ద మహిళా రైతు

(Courtacy Andhrajyothi)