డిసెంబరు 25, 2019 నుంచి జూన్‌ 23, 2020 మధ్య ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు 37 శాతం పడిపోయాయి. డిసెంబరు చివరి నుండి ఏప్రిల్‌ నెల మధ్య రోజుల నాటికి ఈ తగ్గుదల 60 శాతం ఉంది. ఆ తర్వాత కొంత పెరిగింది. ఏదేమైనా, చమురు ధరలు చాలా నాటకీయంగా పడిపోయాయి. అయితే, ఇదే కాలంలో మన దేశంలో మాత్రం పెట్రోలు, డీజిల్‌ ధరలు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో ఎప్పటికన్నా ఇప్పుడు వీటి ధరలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి పెట్రోలు కన్నా డీజిల్‌ ధర మరీ వేగంగా పెరిగింది. ఇప్పుడీ రెండింటి ధరల మధ్య వ్యత్యాసం లేకుండా పోయింది.

మరింత ఎక్కువ ఆదాయాన్ని రాబట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై పన్ను రేటు పెంచుకుంటూ పోవడమే ఈ పెట్రో ధరల పెరుగుదలకు కారణం. ప్రస్తుతం మనమంతా కోవిడ్‌-19 మహమ్మారితో నానా అవస్థలూ పడుతున్నాం. శ్రామిక ప్రజల ఆదాయ వనరులన్నీ హరించుకు పోతున్నాయి. ఇటువంటి సమయంలో పన్ను రేటు పెంచి ఎక్కువ ఆదాయాన్ని రాబట్టుకోడానికి ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులను ఎంచుకోవడం ఎంతమాత్రమూ మానవత్వం అనిపించుకోదు. అంతే కాదు. ఇలా పెంచడం అర్థంలేనిది. ఇప్పటికే తక్కువగా ఉన్న ప్రజల కొనుగోలుశక్తి దీనివలన మరింత పడిపోతుంది. దాంతో సరుకుల అమ్మకాలు తగ్గిపోతాయి. అప్పుడా సరుకులను ఉత్పత్తి చేసే రంగాలలో ఉపాధి అవకాశాలు మరింత తగ్గిపోతాయి. అదనపు ఆదాయం కోసం ఇంకే పద్ధతిని అనుసరించినా అది ఈ పెట్రో పన్నుల పెంపు కలిగించేటంతటి నష్టాన్ని కలిగించదు.

పెట్రోలు, డీజిల్‌-ఈ రెండింటినీ ఎక్కువగా ఉపయోగించేది ధనిక వర్గాలేనని, అందుచేత వీటిపై పన్నులను పెంచడం అదనపు ఆదాయానికి ఒక సులువైన మార్గమని, ఇందువలన పేదలపై ఎటువంటి భారమూ పడబోదని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. ఇది పూర్తిగా తప్పుడు వాదన. పేదలు ఎక్కువగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును ఉపయోగిస్తారు. ఆ విధంగా వారు పెట్రో ఉత్పత్తులను పరోక్షంగా అతి ఎక్కువగా వాడే వినియోగదారులు. అంతేగాక వారు నిత్యం వాడే సరుకుల రవాణా చార్జీలు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. వాస్తవానికి పెట్రోలు కన్నా డీజిల్‌ ధర పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి, పేదలపై భారం ఎక్కుగా పడుతుంది. పరోక్ష పన్నుల అధ్యయన కమిటీ (ఇన్‌డైరెక్ట్‌ టాక్సేషన్‌ ఎంక్వైరీ కమిటీ) నివేదిక సరుకుల రవాణా చార్జీల పెరుగుదల వలన శ్రామిక వర్గ ప్రజల జీవన ప్రమాణాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని పేర్కొంది. పెట్రో ధరల వల్ల మాత్రమే కాదు, ఆఖరుకు టైర్లు, ట్యూబుల ధరలు పెరిగినా ఆ ప్రభావం పేదలపై భారంగా మారుతుందని ఆ నివేదిక తెలిపింది.

నిజానికి ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్రతీ సరుకుతోనూ చమురు సంబంధం కలిగివుంది. ఏ సరుకును ఉత్పత్తి చేసినా, ఆఖరుకు అది వ్యవసాయంలోనైనా సరే, ఏదో ఒక దశలో డీజిల్‌ గాని, పెట్రోలు గాని వినియోగించకుండా ఆ సరుకు తయారుకాదు. ఆ విధంగా చమురు ఒక సార్వత్రిక మాధ్యమం. అటువంటి సార్వత్రిక మాధ్యమంపై పన్ను పెంచి ఆదాయాన్ని పెంచుకోవాలనుకోవడం అత్యంత తిరోగమన చర్య.
ఏ ఇతర సరుకు మీదనైనా వేసే పన్ను కలిగించే భారం కన్నా పెట్రో ఉత్పత్తులపై వేసే పన్ను భారం తట్టుకోవడం దుర్భరం. సార్వత్రిక మాధ్యమంగా లేని ఏ ఇతర సరుకుపైన అయినా ప్రత్యక్షంగాకాని, చివరకు పరోక్షంగా కాని పన్ను వేస్తే దాని ప్రభావం ఇతర సరుకుల ధరల మీద ఏ విధంగానూ పడదు (ఆ సరుకు మరో సరుకు ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్ధం కాకుండా ఉంటే). ఒకవేళ అది ఏ ఇతర సరుకు తయారీలోనో ఉపయోగించే పదార్ధం అయితే అప్పుడు కూడా ఆ పరిమితమైన మేరకే ఈ పెంచిన పన్ను ప్రభావం ఉంటుంది. అదే సార్వత్రిక మాధ్యమం అయితే మాత్రం దానిపై పెంచే పన్ను ప్రభావం అన్ని వస్తువుల ధరలపైనా పడుతుంది. ముఖ్యంగా నిరుపేదలు ఉపయోగించే ఆహార ధాన్యాల ధరలపైన పడుతుంది.

బొగ్గు, చమురు, విద్యుత్తు-ఈ మూడూ అతి ముఖ్యమైన సార్వత్రిక మాధ్యమాలు. ఆర్థిక వ్యవస్థలో ప్రతీ సరుకు ఉత్పత్తిలోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇవి అవసరమౌతాయి. ప్రజలపై ధరల భారం పడకుండా ఉండాలనుకునే ఏ ప్రభుత్వమైనా ఈ మూడింటి ధరలనూ పెంచకుండా ఉండేందుకే ప్రయత్నిస్తుంది. కాని మన బిజెపి ప్రభుత్వం మాత్రం అటువంటిది కాదు.

దీనికి హృదయమూ లేదు, తెలివీ లేదు. ప్రజా ప్రయోజనాలరీత్యా ఎవరినుంచైనా వారికి చెందిన ఆస్థిని స్వాధీనం చేసుకునేటప్పుడు ఆ వ్యక్తికి లేదా వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించాలని భారత రాజ్యాంగం ఆదేశిస్తున్నది. అలా స్వాధీనం చేసుకునే ఆస్థి ఆ వ్యక్తికి ఒక ఆదాయ వనరు గనుక దానికి బదులు పరిహారం చెల్లించాలి. కాని ఈ బిజెపి ప్రభుత్వం హఠాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించి శ్రామిక ప్రజల ఆదాయ వనరును వారికి దూరం చేసింది. కాని అందుకు బదులు చెల్లించవలసిన నష్టపరిహారాన్ని మాత్రం చెల్లించలేదు. ప్రపంచంలో దాదాపు ప్రతీ ఇతర దేశంలోనూ లాక్‌డౌన్‌ కాలంలో జీతాలను కోల్పోయిన కార్మికులకు నగదు రూపంలో పరిహారం చెల్లించారు ఒక్క మన ప్రభుత్వం తప్ప. ఇది చాలదన్నట్లు ఈ కాలంలోనే ఒక సార్వత్రిక మాధ్యమంపై పన్ను పెంచి అదనపు ఆదాయాన్ని గుంజుకుంటోంది. ఈ అదనపు ఆదాయంలో అత్యధిక భాగం వచ్చేది శ్రామిక ప్రజలనుంచే.

ఇది ప్రజా వ్యతిరేకమైన చర్య మాత్రమే కాదు, చాలా తెలివితక్కువ చర్య కూడా. ఈ ప్రభుత్వం తనకు వచ్చే ఆదాయంకన్నా ఎక్కువ ఖర్చు పెడుతోంది. దానివలన ద్రవ్యలోటు పెరుగుతోంది. ఈ పెరుగుతున్న ద్రవ్యలోటును తగ్గించుకోడానికి ఇప్పుడు ఈ పెట్రో పన్ను పెంచుతోంది. ఇలా ద్రవ్యలోటును తగ్గించుకోవడానికి అదనంగా ఒక 100 రూపాయలను ఆదాయంగా సమకూర్చుకోవాలనుకుంటే రెండు రకాల పద్ధతులను అనుసరించవచ్చు. మొదటిది-ఆదాయం బట్టి పన్ను పెంచడం. రెండవది-ఇలా ఒక సార్వత్రిక మాధ్యమం మీద పన్ను పెంచడం.

మొదటి పద్ధతిలో పేదలు ఎటువంటి ఆదాయపు పన్నునూ చెల్లించరు గనుక మొత్తం 100 రూపాయలూ సమాజంలోని సంపన్న వర్గాల నుండే వస్తాయి. ఈ తరగతులు తమ ఆదాయాల్లో కొంత భాగాన్ని పొదుపు చేస్తాయి. కనుక అలా పొదుపుకు మళ్ళించే సొమ్ము నుంచి కొంత భాగాన్ని ప్రభుత్వం తన ఆదాయంగా మలచుకోగలుగుతుంది. సంపన్నుల ఆదాయంలో ప్రతీ 100 రూపాయలకూ 20 పొదుపు చేస్తారనుకుందాం. అప్పుడు ఈ 100 రూపాయల లోనూ అలా పొదుపుకు మళ్ళించే సొమ్ము నుంచి 20 రూపాయలు పన్ను రూపం లోకి మారుతాయి. తక్కిన 80 రూపాయలూ ఆ సంపన్నవర్గాలు సరుకుల కొనుగోలుకు బదులు పన్ను కింద కడతారన్నమాట. అప్పుడు వారి వినిమయం 80 రూపాయల మేరకు తగ్గుతుంది. ద్రవ్యలోటును తగ్గించడానికి వసూలు చేసిన ప్రతీ 100 రూపాయలకూ వినిమయం తగ్గేది 80 రూపాయలు ఉంటుంది.

అదే ఒక సార్వత్రిక మాధ్యమంపై పన్ను వేసి ప్రభుత్వం ఈ 100 రూపాయలనూ అదనంగా సమకూర్చు కుందనుకుందాం. అప్పుడు సంపన్నులతోబాటు పేదలూ ఈ పన్ను చెల్లిస్తారు. మొత్తం 100 లో పేదలు చెల్లించేది 50, సంపన్నులు చెల్లించేది తక్కిన 50 అనుకుందాం. పేదలు చెల్లించే ప్రతీ 50 రూపాయలకూ వినిమయం 50 రూపాయలు తగ్గుతుంది. తక్కిన 50 లో సంపన్నుల పొదుపునుంచి చెల్లించేది 10, వినిమయం నుంచి పన్నుకు మళ్ళించేది 40 అవుతుంది. అప్పుడు తగ్గే వినిమయం మొత్తం 90 రూపాయలు (పేదలది 50, సంపన్నులది 40). ప్రభుత్వానికి ప్రతీ 100 రూపాయల పన్ను ఆదాయంతో ద్రవ్య లోటు 100 తగ్గితే వినిమయం 90 తగ్గుతుంది. అంటే సంపన్నులకే పరిమితమై వేసే పన్ను వలన వినిమయం తగ్గేది తక్కువ ఉంటుంది. అదే సార్వత్రిక మాధ్యమం మీద వేస్తే వినిమయం ఎక్కువ తగ్గుతుంది. అంటే మాంద్యం ఎక్కువ అవుతుంది.

ద్రవ్యలోటును పూడ్చడానికి ఉత్తమ మార్గం సంపదపై పన్ను వేయడం. ఈ పన్ను భారం బాగా ధనవంతులపై మాత్రమే పడుతుంది. వారి వద్ద ఉండే సంపద నుంచి, అంటే వారి పొదుపు మొత్తం నుంచి వారీ సంపద పన్ను చెల్లిస్తారు. అందువలన వారు పెట్టే ఖర్చు ఏమీ తగ్గదు. విని మయం తగ్గకుండానే ద్రవ్యలోటు తగ్గుతుంది. దానివలన మాంద్యం తగ్గుతుంది.

ఒకవేళ ఎవరిపైనా ఎటువంటి అదనపు పన్నునూ విధించలేదనుకుందాం. అప్పుడు ద్రవ్యలోటు పెరుగుతుంది. అప్పుడు ప్రజల కొనుగోలుశక్తిలో ఏమార్పూ ఉండదు. ఉపాధి కూడా ఏమీ తగ్గదు. ఉన్నది కొన సాగుతుంది. అయితే అప్పుడు ద్రవ్యలోటును పూడ్చడానికి ప్రభుత్వం మార్కెట్‌ నుంచి అప్పులు తేవాల్సి వుంటుంది. ప్రభుత్వ బాండ్ల రూపంలో వచ్చే ఈ అప్పులన్నీ ప్రైవేట్‌ రంగం నుంచే వస్తాయి. ఆ అప్పులపై వడ్డీలూ ప్రైవేట్‌ రంగానికే చెల్లించాలి. ఆ విధంగా సంపన్నులు- పేదల మధ్య తారతమ్యం ఇంకా పెరుగుతుంది. కాబట్టి సంపద పన్ను విధించడమే ఉత్తమమైన మార్గం. దానివలన సమాజంలో అసమానతలూ పెరగవు. సమాజం మొత్తంమీద వినిమయమూ తగ్గదు. ఎవరిపైనా అదనపు పన్ను వేయకుండా ద్రవ్యలోటును పెంచితే వినిమయం యథాతథంగా ఉంటుంది కాని ధనిక-పేద అంతరాలు పెరుగుతాయి. ఆదాయాలపై పన్ను పెంచితే అసమానతలు పెరగవు కాని వినిమయం తగ్గుతుంది. అదే చమురు వంటి సార్వత్రిక మాధ్యమం మీద పన్ను పెంచితే మొత్తం సమాజపు వినిమయమే తగ్గి, దానివలన ఉపాధీ తగ్గుతుంది. అందుచేత సంపద పన్ను పెంచడమే ఉత్తమ మార్గం. అది కూడదనుకుంటే ఇంకేదైనా పద్ధతిలో ప్రత్యక్ష పన్ను పెంచాలే తప్ప చమురు వంటి సార్వత్రిక మాధ్యమాన్ని ఎంచుకోకూడదు. ఇది అదనపు ఆదాయాన్ని సమకూర్చే మార్గాలన్నింటిలోకీ అత్యంత హానికరమైన పర్యవసానాలను కలిగిస్తుంది. అందువలన ఉత్పత్తీ తగ్గుతుంది, ఉపాధీ తగ్గుతుంది.

– ప్రభాత్‌ పట్నాయక్‌
(స్వేచ్ఛానుసరణ)

Courtesy Prajasakti