ఫైలుపై సీఎం కేసీఆర్‌ సంతకం!
9 వర్సిటీల ఏర్పాటుకు అనుమతి
జాబితాలో టెక్‌ మహీంద్ర, ఎస్‌ఆర్‌,
మల్లారెడ్డి, గురునానక్‌, శ్రీనిధి, నిప్‌మర్‌,
అనురాగ్‌, ఎంఎన్‌ఆర్‌, వాక్సన్‌ వర్సిటీలు
రాడ్‌క్లిఫ్‌, అమిటీ వర్సిటీలకు స్థల సమస్య
ఎంఎన్‌ఆర్‌ది వైద్య విశ్వవిద్యాలయం
మల్లారెడ్డిది మహిళా వర్సిటీ
బడ్జెట్‌ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లు
అన్ని వర్సిటీలకూ ఒకే చట్టంపై ఆలోచన
2020-21 నుంచే వర్సిటీల ప్రారంభం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే వాటి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కీలక అడుగు పడింది. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులపై సీఎం కేసీఆర్‌ సంతకం చేసినట్లు సమాచారం. సుమారు 9 వర్సిటీల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. అయితే, వర్సిటీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. దీనిపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వేర్వేరు యూనివర్సిటీలకు  వేర్వేరు చట్టాలు కాకుండా ప్రైవేటు వర్సిటీలన్నిటికీ కలిపి ఒకే చట్టం చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. సంబంధిత కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.

అన్నీ సవ్యంగా జరిగితే, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అనంతరం, వచ్చే (2020-21) విద్యా సంవత్సరంలో రాష్ట్రం లో ప్రైవేటు వర్సిటీల హడావిడి మొదలుకానుంది. నిజానికి, ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి 2018 మార్చిలో ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో, అప్పటికే రాష్ట్రంలో వర్సిటీల ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్న పలు సంస్థలకు మార్గం సుగమమైంది. అప్పట్లోనే ప్రైవేటు వర్సిటీలు ప్రారంభమవుతాయని భావించినా.. పలు కారణాలతో సాధ్యం కాలేదు. గత ఏడాది కూడా సాధ్యం కాలేదు. ఈ ఏడాది కచ్చితంగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తొలి దశలో తొమ్మిది వర్సిటీలు
రాష్ట్రంలో ఒకేసారి భారీగా ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందుకు ఇప్పటికే సుమారు 15 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతోపాటు రాష్ట్రంలోని పలు టాప్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు కూడా ఆసక్తి చూపాయి. వీటిలో మల్లారెడ్డి, శ్రీనిధి, అనురాగ్‌, ఎస్‌ఆర్‌, గురునానక్‌ ఉన్నాయి. ప్రస్తుతానికి తొమ్మిది యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు సమాచారం. ఈ జాబితాలో టెక్‌ మహీంద్ర, ఎస్‌ఆర్‌, మల్లారెడ్డి, గురునానక్‌, శ్రీనిధి, నిప్‌మర్‌, అనురాగ్‌, ఎంఎన్‌ఆర్‌, వాక్సన్‌ వర్సిటీలు ఉన్నాయి. వీటి దరఖాస్తులను పరిశీలించిన ప్రత్యేక కమిటీ.. వర్సిటీలు ఏర్పాటు చేసే భవనాలు, ప్రాంతాలను కూడా తనిఖీ చేసింది.

సంబంధిత నివేదికను రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి పంపింది. ఆ వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ సీఎం కేసీఆర్‌ తాజాగా సంతకం చేసినట్లు సమాచారం. అయితే, వీటిలో మల్లారెడ్డి మినహా మిగతా సంస్థలు ప్రస్తుతం వాటి ఇంజనీరింగ్‌ కాలేజీలనే ప్రైవేటు వర్సిటీగా మార్చుకోవడం గమనార్హం. అలాగే, మరో రెండు ప్రముఖ విద్యా సంస్థలు రాడ్‌క్లిఫ్‌, అమిటీ కూడా రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటికి స్థలం విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో తనిఖీ ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పాటు కానున్న 9 ప్రైవేటు వర్సిటీల్లో ఒకటి మెడికల్‌, మరొకటి మహిళా వర్సిటీ అని తెలుస్తోంది. వీటిలో ఎంఎన్‌ఆర్‌ విద్యా సంస్థలు మెడికల్‌ ప్రైవేటు వర్సిటీని; మల్లారెడ్డి విద్యా సంస్థలు మహిళా వర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.

Courtesy Andhrajyothi