Image result for నా పేరు గద్దర్‌!"గాయపడ్డ ప్రజల గీతాన్ని
రాయడం, పాడటం నా వృత్తి

ఎలాంటి సర్టిఫికెట్లు లేవు
కళాకారుడిగా నియమించండి
సాంస్కృతిక సారథికి దరఖాస్తు

హైదరాబాద్‌, డిసెంబరు: ప్రజా గాయకుడు గద్దర్‌.. తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన నిర్ణీత నమునాలో కాకుండా సొంత లెటర్‌ప్యాడ్‌పై ఉద్యోగం కోసం దరఖాస్తు అందించారు. మంగళవారం గద్దర్‌ స్వయంగా మాదాపూర్‌లోని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయానికి వెళ్లారు. తాను కార్యాలయం బయట వేచి ఉండగా, ఆయన అనుచరుడు యాదగిరి లోనికి వెళ్లి గద్దర్‌ ఉద్యోగ దరఖాస్తును సారథి కళాకారుల నియామక కమిటీ కార్యదర్శి బి.శివకుమార్‌కు అందించారు. దరఖాస్తు అందినట్లుగా మరొక ప్రతిపై సంతకం చేయాలని ఆయనను కోరారు. ‘నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకున్నారా ?’ అని వాకబు చేసిన శివకుమార్‌, గద్దర్‌ దరఖాస్తు అందినట్లుగా దాని ప్రతిపై సంతకం చేయటానికి మాత్రం నిరాకరించారు. ఈ విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. యాదగిరి బయటికి వచ్చి ఈ విషయం చెప్పటంతో, గద్దర్‌ అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా, ప్రస్తుతం గద్దర్‌ వయసు 73 ఏళ్లు. ‘నేనొక గాయపడ్డ ప్రజల పాటను. రాయడం-పాడటం-ఆడటం నా వృత్తి’ అని ఆయన తన దరఖాస్తులో పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించిన గద్దర్‌.. ప్రస్తుతం తన వద్ద ఎలాంటి సర్టిఫికెట్లు లేవని అందులో స్పష్టంచేశారు.

కళాకారుడి ఉద్యోగానికి దరఖాస్తు చేసింది నిజమే: గద్దర్‌
తాను తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడి ఉద్యోగానికి దరఖాస్తు చేసింది నిజమేనని గద్దర్‌ చెప్పారు. ఆయనను మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించినప్పుడు, తాను ఒక కళాకారుడిగా ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలిపారు.

గద్దర్‌ దరఖాస్తు పూర్తి పాఠం ఇదీ..
గౌ. బి.శివకుమార్‌ గారు, సమన్వయకర్త,
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల నియామక కమిటీ.
అన్నా !

విషయం: ఉద్యోగం కోసం..
నా పేరు గద్దర్‌. నేనొక గాయపడ్డ ప్రజల పాటను. చిన్నప్పటి నుండే ప్రజల పాటలను పాడుతున్నాను. రాయడం-పాడటం-ఆడటం..నా వృత్తి. నా వద్ద ప్రస్తుతం ఎలాంటి సర్టిఫికెట్లు లేవు. కళాకారునిగా నన్ను నియమించగలరు.
వందనాలతో… గద్దర్‌

(Courtesy Andhrajyothi)