కోయి కోటేశ్వరరావు…..

నేల గుండెలదిరేలా చిందేసి, నింగి చెవులు మారు మ్రోగేలా ప్రజాపోరాటాల ఆశయాలను గానం చేసి, తెలంగాణ పాటకు జాతీయ స్థాయిలో విశేషమైన ప్రఖ్యాతిని సమకూర్చిన అపురూప వాగ్గేయకారుడు వెంకన్న. మూలాలను రక్షించకుండా ఫలాలు భక్షించాలని పరుగులు తీస్తున్న కాలానికి తల్లివేరు ఎరుకను వెంకన్న మహోన్నతంగా ప్రబోధించాడు. వెల్లు వెత్తుతున్న ప్రపంచీకరణ ప్రభావానికి ప్రత్యామ్నాయంగా దేశీయ సంస్కారాన్ని, గ్రామీణ సాంస్కృతిక గరిమను వేయి గొంతుకలతో చాటి చెప్పాడు. తాజ్‌ మహల్‌ అందాల కన్నా నా వాగు పిచ్చుక గూళ్ళే మిన్న అంటూ అఖిల విశ్వానికి తెలియజేశాడు.

గ్రామీణ జీవన సౌందర్యాన్ని ఉన్నతంగా కవిత్వీకరించడంతో పాటు వెంకన్న గ్రామీణ జీవన విధ్వంసాన్ని కూడా తన రచనల్లో విస్తృతంగా చిత్రించాడు. సరళీకృత ఆర్థిక విధానాల మూలంగా, ప్రపంచీకరణ పెను తుఫాన్‌ కారణంగా విచ్ఛిన్నమవుతున్న చేతి వృత్తి కార్మికుల కష్టనష్టాలను, దగ్ధమవుతున్న బడుగు జీవుల బతుకు వెతలను, పతనమవుతున్న దేశీయ సాంస్కృతిక విలువలను వెంకన్న ఎంతో ప్రతిభావంతంగా అక్షర బద్ధం చేశాడు.పల్లే కన్నీరు పెడుతుందో అనే పాట ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమానికి నాందిపలికింది.  

నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనొ అందాక ఈ భూగోళమ్మున అగ్గిపెట్టెదను (అగ్నిధార) అని దాశరథి అన్నట్లుగా ప్రజాకవి గోరటి వెంకన్న తన పాటల అగ్ని బావుటాలతో వర్తమాన తెలుగు సాహిత్యానికి సరికొత్త తేజస్సును, తాత్విక తేజస్సును అందించాడు. మౌఖిక సాహిత్య, పదకవితల గతిలో, యక్షగానాల శ్రుతిలో బైరాగుల కిన్నెర తత్వాల ఒరవడితో చెరిగిపోతున్న పల్లె ఆనవాళ్ళను, శిథిలమవుతున్న మానవ సంబంధాలను అద్భుతంగా దృశ్యమానం చేసిన అసాధారణ కవి గోరటి వెంకన్న. నేల గుండెలదిరేలా చిందేసి నింగి చెవులు మారు మ్రోగేలా ప్రజాపోరాటాల ఆశయాలను గానం చేసి, తెలంగాణ పాటకు జాతీయ స్థాయిలో విశేషమైన ప్రఖ్యాతిని సమకూర్చిన అపురూప వాగ్గేయకారుడు వెంకన్న. మూలాలను రక్షించకుండా ఫలాలు భక్షించాలని పరుగులు తీస్తున్న కాలానికి తల్లివేరు ఎరుకను వెంకన్న మహోన్నతంగా ప్రబోధించాడు. వెల్లువెత్తుతున్న ప్రపంచీకరణ ప్రభావానికి ప్రత్యామ్నాయంగా దేశీయ సంస్కారాన్ని, గ్రామీణ సాంస్కృతిక గరిమను వేయి గొంతుకలతో చాటి చెప్పాడు. తాజ్‌ మహల్‌ అందాల కన్నా నా వాగు పిచ్చుక గూళ్ళే మిన్న అంటూ అఖిల విశ్వానికి తెలియజేశాడు. సహజ సుందర శోభిత మైన, బహుళార్థభరితమైన ప్రకృతిని కోటి కన్నులతో దర్శించి, మేటి పాటలు రచించి, ప్రకృతి కేంద్రంగా మానవ జీవన ప్రమాణాలను నిర్దేశించి, పశుపక్ష్యాదుల కార్యాచరణ ఆధారంగా నైతిక సూత్రాలను నిర్థారించాడు.

శివసాగర్‌ చిరుగాలి సితార సంగీతంతో, యుద్ధనౌక జన గద్దర్‌ గానంతో, నీలిమేఘాల రాగాలతో,  చిక్కనవుతున్న పాటలతో, ప్రతిధ్వనిస్తున్న అత్యాధునిక సాహిత్యాన్ని తన ఏకునాదం మోతతో కదిపి కుదిపేశాడు వెంకన్న. పాలమురు మెట్టప్రాంత సోయితో, విప్లవ దళితోద్యమాల ఉమ్మడి స్పృహతో తన తండ్రి అపరధనుర్దాసు నరసింహ కళావారసత్వంతో కవిగా, గాయకుడిగా, వాగ్గేయకారుడిగా, దూసుకువచ్చిన గోరటి వెకన్న అత్యంత ప్రామాణికమైన, ప్రభావశీలమైన గేయకవిత్వంతో తెలుగు సాహిత్యంలో మిగిలిపోయిన ఖాళీలను సమర్థవంతంగా భర్తీ చేశాడు.

తెలంగాణ భాషా వికాసానికి ప్రాణచైతన్యాన్ని అందిం చాడు. వస్తువైవిధ్యంతో రూపవైశిష్ట్యంతో తెలుగు గేయకవిత్వంలో గుణాత్మక మార్పులు తీసుకువచ్చాడు.కాలేకడుపుల మీద రాళ్ళు గొట్టే రాజ్యమిది అంటూ పాలక వర్గాల క్రూరత్వాన్ని ఎండగట్టి ఎగదిగేసే మత, కుల కుంపటులారి/మమతపూలు రెక్కతొడిగి విరియాలని మనసారా పిలుపునిచ్చాడు. మను ధర్మానికి వ్యతి రేకంగా పాటల ఈటెలు సంధించాడు. ఆశనెరుగని ఆది వాసులు/ అడవిదారికి దివిటీ వెలుగలని మూలవాసులకు జేజేలు పలికి, గిరిజన పోరాటాలకు సంఘీభావం ప్రకటించాడు.నీతి బతుకు కవితలో అనుక్షణం స్త్రీలపై పెరుగుతున్న లైంగిక దోపిడిని వ్యతిరేకించి కామతృష్ణ పరమ హింసలను ఖండించాడు.

పందులె తన బంధు బలగంగ/ కష్టసుఖాలను కలబోసుకొని బ్రతికేఎరుకల నాగన్న, కురులకు కులుకునేర్పే మంగలన్న, కల్ల కపటమెరుగని గొల్ల కురుమ వనిత, యాదవ ఎలమంద, పిండిగిర్నిసుబ్బయ్య, ఇల్లుబాసిపోయిన రైతన్న, మాదిగ తాతయ్య, మాలసెన్నయ్య, పరక సేపలకు గాలాలేసే ముస్లిమ్‌ పోరలు, బ్యాగరి బాలక్క, తలారి రామక్క, సలువాది సాయక్క సబ్బండ వర్ణాల సమస్త శ్రామికులను తన పాటల్లో వెంకన్న రమణీయంగా చిత్రించాడు. రైతులతోపాటు ప్రధానంగా వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల శ్రామికులు, దళిత బహుజనుల సమ్మిళిత జీవన స్థితిగతుల కోణంలో నుండి వెంకన్న పల్లె అస్తిత్వాన్ని తేట తెల్లం చేశాడు. అందువల్లనే తల్లి రక్తం బిడ్డలో ప్రవహించినంత సహజంగా పల్లె తత్వం వెంకన్న పాటల్లో ప్రతిఫలిస్తుంది. నా ఊరు, నా ప్రాంతం, నా సంస్కృతి, నా భాష అనే అహంకార దర్శనం, ఆత్మగౌరవం వెంకన్న పాటల నిండా పరిమళిస్తుంది. పల్లె పట్ల అపారమైన బెంగ, పల్లెవాసుల బతుకుపట్ల ఎడతెగని దిగులు ఈ కవి మనసు నిండా ఆవరించి ఉంటుంది. నీ ఆట ఏమాయెరో ఓరన్న నీ పాట ఎటుబాయెరో మాయన్నా అంటూ గ్రామీణ కళా రూపాల గొప్పతనాన్ని, అవి అందించిన సాంస్కృతిక చైతన్యాన్ని,

ఆ కళాకారుల అసామాన్య ప్రతిభా పాట వాలను తలచుకొని దుఃఖి స్తాడు. ఆ మధుర జ్ఞాపకా లను నెమరువేసుకొని ఒక్కొక్క సారి సేదతీరుతాడు. పదిలమైన పల్లె అడుగు జాడలు అంతరించి పోతున్నాయన్న వలపోతను వెంకన్న సమున్నతంగా తన కవిత్వంలో అక్షరబద్ధం చేశాడు. పారె ఏటి అలలమీద/ పండు వెన్నెల రాలినట్లు, ఊరే ఊట సెలిమలోన/ తేట నీరు తొణినట్లు/ వెండి మెరుపుల నవ్వు నీది లచ్చువమ్మో అంటూ తెలుగు పాఠకుడు కనీ వినీ ఎరుగని సాదృశ్యాలతో, గ్రామీణ మహిళల అపురూప సౌందర్యాన్ని, శ్రమైక దృష్టిని అమేయ శిల్ప చాతుర్యంతో ఈ కవి ఉన్నతీకరించాడు. ముచ్చటొలికే ముగ్గులేసే/ మునివేల గోరుపైన/ పొద్దె ముద్ద గోరింటయితది లచ్చువమ్మా అన్న కవి అపూర్వ భావ చిత్రం ప్రబంధకవుల వర్ణనా వైదుష్యంతో పోటి పడుతుంది.

పాలి పోయిన కందిసేనే/ నీవు పాట పాడితే పూత పడుతది అన్న మెచ్చుకోలు లచ్చువమ్మకే కాదు వెంకన్నకు కూడా వర్తిస్తుంది. రైతు కేంద్రంగా తెలుగులో వెలువడిన కావ్యాలలో కనిపించని భిన్నమైన వ్యవసాయక వాతావరణం వెంకన్న కవిత్వంలో పచ్చ పచ్చగా మెరుస్తుంది. మెట్ట ప్రాంత పంట పొలాల స్వరూపాన్ని వెంకన్న అత్యంత పరిశీలనాత్మక దృష్టితో తన పాటల్లో ఆవిష్కరించాడు. గాలికూగే వేరుసెనగ, మురిపాలొ లుకు మిరపసేలు, గుత్తులుకాసిన పత్తిసేలు, వెన్ను విరిచిన జొన్నచేలు వెంకన్న సృజన క్షేత్రం నిండా పరచుకొని ఉంటాయి.

Poetry is the image of man and Nature అన్న వర్డ్స్‌వర్త్‌ సూత్రీకరణకు వెంకన్న కవిత్వం వ్యాఖ్యానం వలె ఉంటుంది. విహంగ వీక్షణం లాగా కాకుండ Microscopic Viewతో వెంకన్న అనంత ప్రకృతి అందచందాలను తన కవిత్వంలో రాశిపోశాడు. సెరువు, వాన, వాగు, అడవి వెన్నెలతో పాటు పశుపక్ష్యాదుల తీరుతెన్నులను సహృదయహృదయాను రంజకంగా చిత్రిక పట్టాడు. జువ్వి కొమ్మన గువ్వల రాగాలు, పంచె వెన్నెల రామసిలుకలు పరికిపిట్ట, బురకపిట్ట, తీతువు, విసురుగాలి తాకి ఈల వేసే సెలిమ, ఈత కమ్మల గాలి దరువు, తెప్పల మాటున వెన్నెల తాళం,చిరుగాలి పాటకు ఎగసి దరువేసే చినుకులు లాంటి పరవశాత్మకమైన పరిసరాలకు నవనవోన్మేషమైన పదబంధాలు వెంకన్న కవిత్వంలో దర్శనమిస్తాయి.

వెంకన్న రాసిన ప్రకృతి కవిత్వంలో ఆలంకారిక దృష్టితోపాటు జీవకారుణ్య స్ఫూర్తి, పర్యావరణ పరిరక్షణాస్పృహ కూడా విశేషంగా చోటుచేసుకుంది. కొంగమ్మ, పిట్ట బతుకు లాంటి పాటల్లో పక్షుల్లోని నైర్మల్యాన్ని, త్యాగనిరతిని, మానవుడు అలవరచుకొని, తన లోలోపల మలినాలను తొలగించుకోవాలని కవి హితవు చెప్పాడు. అలచంద్రవంక గేయకవిత్వం ప్రకృతి రమణీయతకు, బహుముఖీన ప్రకృతి ఔన్నత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

గ్రామీణ జీవన సౌందర్యాన్ని ఉన్నతంగా కవిత్వీకరించడంతో పాటు వెంకన్న గ్రామీణ జీవన విధ్వంసాన్ని కూడా తన రచనల్లో విస్తృతంగా చిత్రించాడు. సరళీకృత ఆర్థిక విధానాల మూలంగా, ప్రపంచీకరణ పెనుతుఫాన్‌ కారణంగా విచ్ఛిన్నమవుతున్న చేతివృత్తి కార్మికుల కష్టనష్టాలను, దగ్ధమవుతున్న బడుగు జీవుల బతుకు వెతలను, పతనమవుతున్న దేశీయ సాంస్కృతిక విలువలను వెంకన్న ఎంతో ప్రతిభావంతంగా అక్షర బద్ధం చేశాడు. పల్లే కన్నీరు పెడుతుందోఅనే పాట ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమానికి నాందిపలికింది. కుల, మత, వర్గ, లింగ వివక్షల అగ్ని కీలల్లో ప్రపంచీకరణ ఆజ్యం పోస్తుందని, తద్వారా ఆ వివక్ష నెదుర్కొంటున్న ప్రజాజీవితం అల్ల కల్లోలమవుతుం దని వెంకన్న పాటల ద్వారా ప్రచారం చేశాడు. కుల, మతం, వర్గం, జెండర్‌లతో పాటు ఐదో శత్రువైన ప్రపంచీకరణ రగిలించిన పెనుప్రమాదాలను, దాని పర్యవసానాలను తన గేయాల్లో వెంకన్న శక్తివంతంగా చాటి చెప్పాడు. ఎంతో చారిత్రాత్మక మైన ప్రాధాన్యత కల్గిన పల్లె కన్నీరు పాటల్లీ నుండి డిల్లీదాక ప్రజా సమూహాలను చైతన్య పరచి, పాలక వర్గాల పీఠాలను తారుమారు చేసింది. అక్షరరూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళను కదిలిస్తే, పాట రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క కోటి మందిని కదిలిస్తుందని గోరటి వెంకన్న పాట నిరూపించింది.

వెంకన్న పాట స్వరూపం స్వభావాలను, తదనుగుణ మైన జీవన నేపథ్యాన్ని నిశితంగా విశ్లేషించిన కె.శ్రీనివాస్‌ చెప్పినట్లుగా తెలంగాణ కావాల్సివచ్చిన కాలానికి ఎదిగివచ్చిన పుత్రుడు వెంకన్న, ‘పూసిన పున్నమి, వైభవ గీతిక, తల్లి తెలంగాణమా, ఇద్దరం విడిపోతే లాంటి పాటలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక ఆలంబనగా నిలి చాయి. తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవ ప్రాభవాలను సరళంగా, శిల్ప సుందరంగా, కలమారా గళమారా గానం చేయడంలో వెంకన్న కీలకమైన పాత్ర పోషించాడు. ఉత్తేజభరిత మైన, ఉద్వేగ పూరితమైన, తన ఆటపాటలలో తెలంగాణ ఉద్యమానికి వెంకన్న ఊపిరిపోశాడు. గ్రామీణ జనులను, నగరవాసులను, మేధావులను

ఉద్యమాభిముఖంగా మళ్ళించడంలో వెంకన్న పాట బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు, తెలంగాణ సాహిత్య పరిణామ క్రమాన్ని వేగవంతం చేసింది.

గోరటి గొప్ప తాత్విక కవి. బుద్దుడు, చార్వాకులు, కారల్‌మార్స్‌, జ్యోతిబాపులె, డా. బి.ఆర్‌ అంబేద్కర్‌ వంటి సామాజిక తత్వవేత్తల స్ఫూర్తితో పాటు వేమన, పోతులూరి వీరబ్రహ్మం, అన్నమయ్య దున్న ఈద్దాసు లాంటి తత్వ కవుల సంకీర్ణ ప్రభావంతో అచల తత్వ ప్రేరణతో ఆయన తత్వ కవిగా రూపాంతరం చెందాడు. మూట ఎందుకు వెంట హరి దాస/ దాంట్లో మురికి గూడుతదంట హరిదాస/మోసుకొచ్చిందెంత హరిదాస/ నీవు తీసుకెళ్ళేదెంత హరిదాస/ సూసుకుంటె వింత హరిదాస/శూన్యమే నీ బొంత హరిదాస’ అంటూ ఈనాడు వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక తీవ్రవాదాన్ని మార్కెట్‌వాద వలలో చిక్కుకున్న మానవుడి ధనదాహాన్ని అత్యత్భుతంగా వెంకన్న ఈ పాటలో చిత్రించాడు. “Of the poets I have known Goreati Venkanna has the rarest creativity and the finest  imagination. In him we find a Pablo Neruda and Bob Dylan” (The Wave of the Crescent) – అని ‘సరస్వతీ సమ్మాన్‌’ గ్రహీత కె.శివారెడ్డి చెప్పిన మాట అక్షరాల నిజం. అందుకే గోరటి వెంకన్న ఒక లెజెండ్రి పోయెట్‌. ఆయన పాట ఒక సామాజిక ఇతిహాసం. మన కాలపు వైతాళికుడైన గోరటి వెంకన్న పాటను కాలమే మైమరచి హమ్‌ చేస్తుంది.

కోయి కోటేశ్వరరావు