Image result for భగ్గుమన్న ఈశాన్యం"అసోం, త్రిపురల్లో భారీగా నిరసన జ్వాలలు
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు
గువాహటిలో సైన్యం మోహరింపు

దిల్లీ/గువాహటి/అగర్తల: ‘పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్‌)కు వ్యతిరేకంగా అసోం బుధవారం అట్టుడికిపోయింది. త్రిపుర రాజధాని అగర్తల సహా కొన్ని ప్రాంతాలకు ఈ బిల్లు వ్యతిరేక సెగ పాకింది. ఈ రెండు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జనజీవనం దాదాపుగా స్తంభించి పోయింది. నిరసనకారులు టైర్లు, కొయ్యదుంగలను రోడ్లపై తగులబెట్టారు. అసోంలో నిరవధిక కర్ఫ్యూను విధించడంతో పాటూ సైన్యాన్ని మోహరించారు. అసోంలో వేలసంఖ్యలో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. సచివాలయం ఎదుట భద్రతా సిబ్బందితో విద్యార్థులు ఘర్షణపడ్డారు. గువాహటిలో పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లాఠీఛార్జికి దిగారు. రబ్బరు బుల్లెట్లనూ ప్రయోగించారు. పలువురు ఆందోళనకారులు ఈ ఘటనల్లో గాయపడ్డారు. దిశ్‌పుర్‌లో ఆదివారం జపాన్‌, భారత్‌ ప్రధానుల మధ్య ఆదివారం జరగాల్సి ఉన్న కీలక సదస్సు కోసం ఏర్పాటు చేసిన వేదికను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.  గువాహటి, దిబ్రూఘర్‌, జోర్హాట్‌, తిన్‌సుకియా, కామ్‌రూప్‌, గోలాఘాట్‌ తదితర ప్రాంతాల్లోనూ పోలీసులు పెద్దసంఖ్యలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Image result for భగ్గుమన్న ఈశాన్యం"ఈశాన్యానికి పారామిలిటరీ సిబ్బంది!
అసోంలో బుధవారం నుంచి నిరవధిక కర్ఫ్యూను విధించారు.
శాంతిభద్రతల పరిస్థితి అస్థిరంగా ఉన్న నేపథ్యంలో అయిదువేల పారామిలిటరీ సిబ్బందిని తరలించారు.
త్రిపురలోని ధలాయ్‌ జిల్లాలో తీవ్ర ఆందోళనల నేపథ్యంలో అక్కడ అసోం రైఫిల్స్‌ బలగాలను మోహరించారు. మరికొన్ని ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించారు. రాజధాని అగర్తల సైతం ఆందోళనలతో అట్టుడికి పోయింది.
గురువారం త్రిపురలో బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది.
గువాహటి వర్సిటీ, కాటన్‌ విశ్వవిద్యాలయం, దిబ్రూఘర్‌ యూనివర్సిటీలు బుధవారం నుంచి జరగాల్సి ఉన్న వివిధ పరీక్షలను వాయిదా వేశాయి.
దిల్లీలో ఉంటున్న ఈశాన్య రాష్ట్రాల పౌరులు కొందరు బుధవారం జంతర్‌మంతర్‌ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

(Courtesy Eenadu)