-2020-21లో 5.4 శాతం క్షీణత..!
– ధనిక రాష్ట్రాల్లో రెండకెల పతనం
– తెలంగాణ 11 శాతం కోల్పోవచ్చు :ఎస్బీఐ రిపోర్ట్‌

న్యూఢిల్లీ : అసలే మందగమనంలో ఉన్న భారత ఆర్ధిక వ్యవస్థ వల్ల అనేక మంది తీవ్ర తిప్పలు పడుతున్న వేళ.. కరోనా వైరస్‌ దేశ ప్రజల తలసరి ఆదాయాన్ని మరింత పడిపోయేలా చేస్తుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. పేద రాష్ట్రాలతో పోల్చితే ధనిక రాష్ట్రాల్లో తలసరి ఆదాయం మరింత పడిపోనుందని అంచనా వేసింది. ఎస్బీఐ ఎకోవ్రాప్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారతీయుల తలసరి ఆదాయం (పీసీఐ) 5.4 శాతం తగ్గి రూ.లక్ష 43వేలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇంతక్రితం ఏడాదిలో పీసీఐ రూ.1.52 లక్షలుగా ఉంది. దేశ సగటు కంటే అధికంగా ఉన్న ధనిక రాష్ట్రాలు అత్యధికంగా ప్రభావితం కానున్నాయి. దేశ జీడీపీలో 47 శాతం వాటా కలిగిన ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల తలసరి ఆదాయాల్లో రెండంకెల స్థాయిలో తగ్గుదల చోటు చేసుకున్నాయి. రాష్ట్రాల వారిగా పరిశీలిస్తే ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ రాష్ట్రాల పీసీఐలో వరుసగా 15.4 శాతం, 13.9 శాతం, 11.6 శాతం చొప్పున క్షీణతను చవి చూడనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తలసరి ఆదాయం 10-12 శాతం మధ్య తగ్గొచ్చు. అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, మణిపూర్‌ ప్రాంతాలు అత్యధిక పీసీఐ తగ్గుదలను నమోదవు చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల తలసరి ఆదాయంలో 11.10 శాతం తగ్గుదల చోటు చేసుకోనుందని ఈ రిపోర్ట్‌ అంచనా వేసింది. రాష్ట్రంలో 2019-20లో ఉన్న రూ.2.54 లక్షల తలసరి ఆదాయం 2020-21లో రూ.2.25 లక్షలకు పడిపోవచ్చు. స్థూలంగా భారత ప్రజల తలసరి ఆదాయం 5.40శాతం తగ్గి రూ.1.43 లక్షలకు పరిమితం కావొచ్చని ఈ రిపోర్టు పేర్కొంది.

Courtesy Nava telangana