Image result for People's Anger citizenship bill"”హిందూ ముస్లిం ఏక్‌ హై – మోడీ, షా ఫేక్‌ హై” ఇదీ ఇప్పుడు దేశంలో మారుమోగుతున్న సరికొత్త నినాదం. బహుశా కమలనాథులు తమ విద్వేషపాలనకు ఇంతటి నిరసన ఊహించి ఉండరు. ప్రజలిచ్చిన మెజారిటీని దుర్వినియోగం చేస్తూ పార్లమెంటులో తమకు ఎదురేలేదన్నట్టుగా వ్యవహరిస్తే ప్రజాక్షేత్రంలో ప్రతిఘటన తప్పదని ప్రస్తుత పరిణామాలు నిరూపి స్తున్నాయి. ”పౌరసత్వ సవరణ చట్టం”తో కేంద్రం పెట్టిన చిచ్చుకు యావత్‌ దేశం భగ్గుమంటోంది. తమ వైఫల్యాల ఫలితంగా దేశం ఎదుర్కొంటున్న అనర్థాల నుంచి ప్రజల దృష్టి పక్కదారి పట్టించడం, నిత్యం విద్వేషాలను రెచ్చగొడుతూ మెజారిటీ ప్రజల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడం లక్ష్యంగా కేంద్రం తెచ్చిన ఈ చట్టం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం ఈశాన్యమో వాయువ్యమో కాదు ఆసేతు హిమాచలం నిరసన గళమై ప్రతిధ్వనిస్తోంది. భారతీయుల భావ చైతన్యానికి ఇది ప్రతీక. తాజాగా వామపక్షాల పిలుపు మేరకు దేశమంతటా ప్రజలు ఒక్కతాటిపై కదిలి కేంద్రంపై కన్నెర్రజేయడం ఈ పరిణామానికి మరింత బలమిస్తోంది.

ఊహించని రీతిలో పెల్లుబుకుతున్న ఈ నిరసనల వెల్లువలో ఉక్కిరిబిక్కిరి అవతున్న మోడీ, షా ”ఈచట్టం వల్ల భారతీయ పౌరులకు, ప్రత్యేకించి ముస్లింలకు వచ్చిన నష్టమేమీలేదు”అని పదేపదే ప్రకటిస్తూనే.. ”వారు వేసుకున్న దుస్తులను బట్టే నిరసనకారులెవరో అర్థమవుతోంది” అనడం వారి అంతరంగంలోని విద్వేషాలనే సూచిస్తుంది తప్ప ప్రజలకు విశ్వాసం కల్పించడం లేదు. నిరసనల్లో పాల్గొంటున్నది కేవలం ముస్లింలు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకపోవడం ఈ అసంబద్ధ ప్రకటనల బండారాన్ని బయట పెడుతోంది. నిరసనకారుల్లో అత్యధికులు ముస్లిమేతరలూ, కుల, మత, ప్రాంతాలకతీతంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నవారు కావడం గమనార్హం. కేవలం మతాధార పౌరసత్వమనేది రాజ్యాంగ విహితం కాదనీ, భారతీయ లౌకిక స్ఫూర్తికి ఇది అతిపెద్ద విఘాతమని విశ్వసించడం వల్లే వారంతా ఈ చట్టాన్ని నిరసిస్తున్నారన్న నిజాన్ని విస్మరించి మోడీ, షా మాట్లాడుతుండటం ప్రజల దృష్టిని ఏమార్చడమే.

ఏలినవారి నిషేధాజ్ఞలను సైతం ధిక్కరించి లక్షలాదిగా ప్రజలు నిరసన జ్వాలలై ఎగసిపడుతుండగా.. ఈ క్రమంలో అంతులేని నిర్బంధకాండ కూడా కొనసాగుతోంది. ఎటు చూసినా ఒకవైపు ప్రజల ఆగ్రహజ్వాలలూ మరోవైపు ఇనుపబూట్ల స్వైరవిహారం, అరెస్టుల పర్వం… ఇదీ ఇప్పుడు వర్తమాన భారతీయ ముఖచిత్రం. ఈ పరంపరలో ఢిల్లీలో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరీ సహా పలువురు వామపక్షనేతలను, బెంగుళూరులో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు.. లక్నోలో ఒకరు, మంగళూరులో ఇద్దరు ఆందోళనకారులను తమ తుపాకులకు బలితీసుకున్నారు. దేశవ్యాప్తంగా వేలాదిమందిని అరెస్టు చేసి వందలాది ప్రజలను క్షతగాత్రులను చేశారు. అయినా వెరువక స్వతంత్రంగా సమీకృతులైన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంటుండటం ఈ ”పౌరసత్వ సవరణ చట్టం” వ్యతిరేకోద్యమంలో ఓ గొప్ప పరిణామం. ఈ ప్రజల్లో మేథావులు, యువకులు, మహిళలతో పాటు విద్యార్దిలోకం పెద్దయెత్తున కదలటం విశేషం. ఈ విద్యార్థులు కేవలం మైనారిటీ వర్గాల పిల్లలు అధికంగా ఉండే జామియా, ఆలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయాలకు చెందినవారు మాత్రమే అనుకుంటే పొరపాటు. ప్రగతిశీల భావాలకు నిలయాలైన జేఎన్‌యూ, జాదవ్‌పూర్‌, హెచ్‌సీయూలతో పాటు టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ వంటి దేశంలోని అనేక ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఈ నిరసనలు సహజంగానే ఉధృతంగా ప్రతిధ్వనిస్తున్నాయి. కానీ ఎన్నడూ లేని విధంగా ఐఐటీ విద్యార్థులతో పాటు ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, పూణే, చండీగఢ్‌, లక్నో, భూపాల్‌లలోని ప్రయివేటు విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూడా ఈ ఉద్యమంలో గొంతుకలపడం అరుదైన విషయం.

ఈ స్పందన కేవలం జామియా మిలియా, ఆలీగఢ్‌ యూనివర్సిటీల్లో జరిగిన ఘటనల్లో ఆ విద్యార్థులకు సంఘీభావమే కాదు, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితాల పేరుతో కేంద్రం చేస్తున్న కుటిల యత్నాలకు వ్యతిరేకం కూడా అన్నది విస్మరించకూడదు. ఇలా విద్యార్థులూ యువజనులూ మహిళలూ ప్రముఖులతో కూడిన ప్రజలంతా భాగస్వాములవుతోన్న ఈ నిరసనోద్యమం ఈ వివాదాస్పద చట్టాలకు, ప్రభుత్వానికి వ్యతిరేకం మాత్రమే కాదు ప్రజాస్వామ్యశక్తులకో గొప్ప ఉత్తేజం.

చట్టసభల్లో ఆధిక్యత ఉన్నంత మాత్రానికే ఏదైనా చేసేయొచ్చు అనే అహంకారానికి చెంపపెట్టు. తమ అధికారంతో ఎంతటి ప్రజా వ్యతిరేకతనైనా అణచివేయొచ్చుననుకునే దురహంకారానికి గొడ్డలిపెట్టు. కులమతాలకతీతంగా, అసమానతలూ అసహనాలూ విద్వేషాలకు దూరంగా.. సర్వమానవ సమతా భావంతో వర్తమానాన్ని ఆవిష్కరించాలనీ, జీవితోన్నతికి అవరోధంగా ఉన్న ఈ శృంఖలాలను తెంచుకునీ, భిóన్నత్వంలో ఏకత్వమనే లౌకిక స్ఫూర్తి పునాదిగా భవిష్యత్తులోకి ప్రయాణించాలనీ భావిస్తున్న కోట్లాది భారతీయుల ఆకాంక్ష. కాబట్టే ఈ అమానవీయతను ప్రతిఘటిస్తూ ”హల్లాబోల్‌” అంటూ విశ్వవిద్యాలయాల్లో ప్రతిధ్వనిస్తున్న నినాదాన్ని నేడు దేశమంతా అందిపుచ్చుకుంటోంది! కమలనాథుల విద్వేష రాజకీయాలను గొంతెత్తి నిరసిస్తోంది!!

(Courtesy Nava Telangana)