కరోనాపై ప్రధాని పిలుపునకు కదిలిన జనం
మాజీ రాష్ట్రపతులు, ప్రధానులకు మోడీ ఫోన్‌..

న్యూఢిల్లీ : మొన్న చప్పట్లు…ఇపుడు దీపాలతో కరోనాకు వ్యతిరేకంగా ప్రధాని మొదలుకుని రాష్ట్రపతి కోవింద్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా యావత్‌ ప్రజలు కదిలారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు విద్యుత్‌ లైట్లు బంద్‌ చేయాలని మోడీ ఇచ్చిన పిలుపుతో తొమ్మిది నిమిషాలసేపు చీకట్లు అలుముకున్నాయి. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా కొవ్వొత్తులు,దీపాలు, ఫోన్‌ లైట్లు వెలిగించారు. అంతకు ముందు వైరస్‌ వ్యాపిస్తున్న తీరు, దాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ ఆదివారం మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, పలువురు ప్రతిపక్ష నేతలతో ఫోన్‌ ద్వారా మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా ఆయన కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంపై వారితో చర్చించారు. ప్రధాని మాట్లాడిన వారి జాబితాలో మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ ముఖర్జీ, ప్రతిభాపాటిల్‌, మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, హెచ్‌డి దేవగౌడ, ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌యాదవ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌, తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, దక్షిణాది నేతలైన తెలంగాణ సీఎం కెేసీఆర్‌, డీఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌, బీజేపీ మిత్రపక్ష నేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ఉన్నారని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కరోనాను వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాన్ని ప్రధాని నేతలకు వివరించినట్టు తెలిపారు.

Courtesy Nava Telangana