సౌరా ప్రాంతంలో 300కుపైగా..
వైద్య సేవలు అందక తోచిన పద్ధతుల్లో పెల్లెట్ల తొలగింపునకు స్థానికుల యత్నం
శస్త్ర చికిత్సలు అవసరమైన కేసుల్లో బాధితుల్లో ఆందోళన
శ్రీనగర్‌:370 అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్‌ నుంచి వస్తున్న పెల్లెట్‌ బాధితుల కథనాలు ఆవేదన కలిగించేలా ఉన్నాయి. కేంద్ర నిర్ణయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమైన ప్రాంతంగా పేరున్న శ్రీనగర్‌లోని సౌరా నుంచి పెల్లెట్‌ బాధితుల సంఖ్య అధికంగా ఉన్నది. ఈ ప్రాంతంలో పెల్లెట్‌ బాధితుల సంఖ్య 300కు పైగానే ఉన్నట్టు చెబుతున్నారు. ప్రతి శుక్రవారం స్థానిక జెనాబ్‌ సాహెబ్‌ మసీదులో ప్రార్థనల అనంతరం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతో, ఈ ప్రాంతానికి రాకపోకల్ని అక్కడి అధికారులు నిలిపివేశారు. సౌరా ప్రాంత పౌరులకు వైద్య సేవలందించేవారు కూడా లేరు. దాంతో, పెల్లెట్‌ బాధితుల కష్టాలు వర్ణాణాతీతంగా మారాయి.
శరీరంలోని వివిధ అవయాల్లోకి చొచ్చుకెళ్లిన పెల్లెట్‌ గుళ్లను బయటకు తీయాలంటే నిపుణులైన సర్జన్లకు మాత్రమే సాధ్యం. బాధితులను ఆస్పత్రులకు తరలించే అవకాశం లేకపోవడంతో మసీదులోనే అత్యవసర గదిని ఏర్పాటు చేసి పెల్లెట్లను తొలగించేందుకు స్థానికుల్లోని కొందరు తమకు తోచిన పద్ధతిలో ప్రయత్నిస్తున్నారు. అందుకోసం వారు బ్లేడ్లు, డెట్టాల్‌ పూసిన కాటన్‌ ప్యాడ్స్‌లాంటివి ఉపయోగిస్తున్నారు. తన బంధువుల పిల్లలతోపాటు తన సోదరీమణులకు పెల్లెట్లను తొలగించానని ఫిరోజీ అనే మహిళ తెలిపారు. తానేమీ వైద్య శిక్షణ పొందిన వ్యక్తిని కాదని ఆమె తెలిపారు. తానూ బాధితురాలినేనని, తానే తన శరీరంలోకి చేరిన పెల్లెట్లను తొలగించుకున్నానని ఆమె తెలిపారు. ఓ యువకుడి కళ్లల్లోకి పెల్లెట్లు వెళ్లాయని, వాటిని ఇంటి వద్ద తొలగించలేమని ఆమె తెలిపారు. ఆస్పత్రిలో చేర్పించే అవకాశమెప్పుడొస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నామని ఆమె తెలిపారు.
పెల్లెట్లు తొలగించే క్రమంలో కొన్నిసార్లు రక్తం ధారాపాతంగా కారిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 65 ఏండ్ల తన మామ కూడా బాధితుడేనని ఆమె తెలిపారు. ఆయన కాలులో 250 పెల్లెట్లు ఉన్నాయని, వాటిని ఇంకా తొలగించలేదని ఆమె తెలిపారు. ఆయన నడవలేనిస్థితికి చేరారని ఆమె తెలిపారు. రెండు వారాల క్రితం 16 ఏండ్ల ఇర్షాద్‌ తలలోకి 200 పెల్లెట్లు వెళ్లాయని అతని తల్లి తెలిపారు. అతని మెదడు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హౌదాను రద్దు చేస్తూ ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాశ్మీరీలను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. తమ నిర్ణయం వల్ల ఏదో జరుగుతుందని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఆందోళనలను అదుపు చేయడం కోసమని ముందస్తుగానే వేలాది మంది సైనికులను మోహరించింది. ఇంటర్‌నెట్‌, మొబైల్‌ఫోన్‌సహా సమాచార వ్యవస్థలన్నిటిపైనా నిషేధం విధించింది. దాంతో, బయటి ప్రపంచంతో కాశ్మీరీలు తమ బాధల్ని పంచుకునే అవకాశం లేకుండా పోయింది. కేంద్రం అనుసరిస్తున్న నిర్బంధ విధానాల పట్ల అక్కడి పౌరుల్లో ఏదో ఓ రూపంలో నిరసన వ్యక్తం చేయాలన్న భావన కలగడం సహజం. అయితే, పౌరులతో వ్యవహరించడంలో సమయస్ఫూర్తి ప్రదర్శించేలా భద్రతా దళాలకు తగిన సూచనలు చేయడం ప్రభుత్వ బాధ్యత. కాశ్మీర్‌లోని కొన్నిచోట్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి పౌరుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే, వాటిని అదుపు చేయడం కోసం భద్రతా దళాలు పెల్లెట్‌గన్స్‌ వినియోగించడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Courtesy Nava telangana…