కులాన్ని ప్రస్తావిస్తూ జూనియర్‌ డాక్టర్‌ని వేధించారు.. 
వెక్కిరింపులు, వేధింపులతో పాయల్‌ తాడ్వీని చంపేశారు : స్నేహితురాలు వెల్లడి 

విద్యలేని వాడు వింత పశువు…అన్నది ఒక సామెత. కానీ నేడు ఎంతోమంది ఉన్నత విద్యావంతులై కూడా వింత పశువుల్లా వ్యవహరిస్తున్నారు. వైద్య వృత్తిలో ఉండి…సహచర విద్యార్థిపై కుల దూషణ చేశారు. ‘నువ్వు రిజర్వేషన్‌తో ఇక్కడ సీటు సంపాదించావు’…అంటూ చిన్నచూపు చూశారు. ఆ మాటలు పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ వైద్య విద్యార్థి డాక్టర్‌ పాయల్‌ తాడ్వీ ఆత్మహత్యకు దారితీసింది. కుల వివక్ష, కుల దూషణే తాడ్వీ ప్రాణాలు బలిగొన్నాయని ఆమెతో కలిసి ఒకే గదిలో ఉంటూ చదువుకుంటున్న స్నేహితురాలు పోలీసు విచారణలో తెలిపారు. ముంబయి ‘బీవైఎల్‌ నాయిర్‌’ హాస్పిటల్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ రెండో సంవత్సరం విద్యార్థిని పాయల్‌ తాడ్వీ మే 22న ఆత్మహత్య చేసుకుంది. జూనియర్‌ డాక్లర్లు హేమ అహుజా, భక్తి మెహర్‌, అంకిత ఖండేల్‌వాల్‌ అనే ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురికి కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఈ కేసుకు సంబంధించి క్రైం బ్రాంచ్‌ న్యాయస్థానంలో 1800 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలుచేసింది. ఈ ముగ్గురు నిందితులు చేసిన కుల దూషణ, కుల వివక్ష జూనియర్‌ డాక్టర్‌ తాడ్వీ ఆత్మహత్యకు దారితీసిందని ఛార్జ్‌షీట్‌లో ఆరోపించారు.

‘ఎవరూ అండగా నిలబడటం లేదు’ 
తాడ్వీ, స్నేహల్‌ ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ ఒకేగదిలో ఉండేవారు. కులాన్ని ప్రస్తావిస్తూ కాలేజీలో తనను వేధిస్తున్నారని తనతో చెప్పి తాడ్వీ బాధపడేదని పోలీస్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో స్నేహల్‌ వెల్లడించారు. ఇతర జూనియర్‌ డాక్లర్ల ముందు, హాస్పిటల్‌ సిబ్బంది, రోగుల ముందు అహుజా, మెహెర్‌, ఖండేల్‌వాల్‌ అనే ముగ్గురు వైద్య విద్యార్థులు తాడ్వీని దారుణంగా వేధించారనీ, ‘నీట్‌’ ప్రవేశపరీక్షలో నీకు ఎన్నిమార్కులు వచ్చాయి? రిజర్వేషన్‌తో సీటు కొట్టేశావనీ…తాడ్వీని ఏడిపించారనీ స్నేహల్‌ తెలిపారు. కుల వివక్షతో తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని పేర్కొంటూ లేఖ రాసి మే 22న తాడ్వీ ఆత్మహత్య చేసుకుంది. తాను ఎదుర్కొంటున్న వేధింపుల సంగతిని సీనియర్‌ విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందనీ, ఇక్కడ ఎవరూ తనకు అండగా నిలబడటం లేదనీ తాడ్వీ ఆవేదన చెందింది. ఈ లేఖను మొబైల్‌ ఫొటో తీసి అందరికీ పంపింది.

(Courtacy Nava Telangana)