– సక్రీబాయి కుటుంబానికి న్యాయం చేయాలి…
– రూ.10 లక్షల నష్టపరిహారమివ్వాలి
– ఎస్‌ఐపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
– రౌండ్‌టేబుల్‌ సమావేశంలో గిరిజన సంఘాల నేతలు
– మానవ హక్కుల కమిషన్‌కు వినతిపత్రం

హైదరాబాద్‌ : లిక్కర్‌ మాఫియాతో కుమ్మక్కైన పోలీసులు.. సారా, గుడుంబా తయారు చేస్తున్నారనే సాకుతో రాష్ట్రంలోని మారుమూల తండాల్లోని గిరిజనులపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ఉల్పాయిపల్లికి చెందిన కేతావత్‌ సక్రీబాయి అనే లంబాడి మహిళను పోలీసులు అక్టోబరులో చిత్ర హింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అదే నెల 17న ఆమె మరణించిందని తెలిపారు. ఆమె చావుకు కారణమైన అడవిదేవులపల్లి ఎస్‌ఐ నాగుల్‌ మీరాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సక్రీబాయి కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారమివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు రాంబాలు నాయక్‌తోపాటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు వినతిపత్రం వినతిపత్రం సమర్పించారు.

సక్రీబాయి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్‌.ధర్మనాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీరాం నాయక్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో సక్రీబాయి భర్త కేతావత్‌ రాజ్యా, ఆమె కుమారుడు, కూతురు కూడా పాల్గొన్నారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.రవినాయక్‌, భూక్యా వీరభద్రం, బాలు నాయక్‌, శంకర్‌ నాయక్‌, ఆర్‌.అంజయ్య నాయక్‌ (తెలంగాణ గిరిజన సమాఖ్య), డి.గణేశ్‌ నాయక్‌ (ఎల్‌హెచ్‌పీఎస్‌), రాజేశ్‌ నాయక్‌, వెంకటేశ్‌ చౌహాన్‌ (గిరిజన శక్తి), రతన్‌ సింగ్‌ (గిరిజన మోర్చా), జి.వెంకన్న నాయక్‌ (ఆలిండియా ట్రైబల్‌ ఫెడరేషన్‌), వెంకట్‌ బంజారా (గిరిజన విద్యార్థి సంఘం), లోకిని రాజు, రఘు (ప్రదేశ్‌ ఎరుకల సంఘం), రాము నాయక్‌ (లంబాడీ సేన), రఘునాథ్‌ (పౌర హక్కుల సంఘం), అంబటి నాగయ్య (తెలంగాణ విద్యావంతుల వేదిక), బాలు నాయక్‌ (సర్పంచ్‌) తదితరులు పాల్గొన్నారు. సక్రీబాయిపై పోలీసులు దాడికి పాల్పడటంతోపాటు ఒక చీకటి ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురి చేయటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత పాశవిక చర్యని విమర్శించారు. లిక్కర్‌ మాఫియా, వైన్‌ షాపు యజమానులతో కుమ్మక్కైన పోలీసుల తీరును తీవ్రంగా నిరసించారు. ఇప్పటికైనా ఈ ఘటన పట్ల స్పందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

Courtesy Nava Telangana