– అరుణ్ సాగర్Image result for అరుణ్ సాగర్

(పవన్ కళ్యాణ్ గురించి సోదరుడు అరుణ్ సాగర్ ఏనాడో చేసిన హెచ్చరిక ఇది. ఒకసారి చదువుదామా)

ఒకటో నెంబర్ హెచ్చరిక
డియర్ చే! మమ్మల్ని క్షమించు. ఓ అజ్ఞాని చేసిన అపచారానికి, దాన్ని ఆనాడే నిలదీయకుండా లైటు తీసుకున్న మా అలసత్వాన్ని క్షమించు. నువ్వు నలుగురికీ కొత్తగా పరిచయమవుతావనీ, నువ్వు కొన్ని కొత్త హృదయాలను వెలిగిస్తావనీ, నువ్వు కొన్ని కొత్త ఆవేశాలను రగిలిస్తావని ఆశతో ఆకాంక్షతో సహించాం. ఇప్పుడిక తాటతీస్తాం.

ఎన్ని మాటలు గురూ. రెండున్నర గంటల పాటు టేకులూ, రీటేకులూ లేని నటనా వైదుష్యం. యాడికెల్లొస్తారు గురూ. వీళ్లు మనల్ని ఏమనుకుంటారు. పాపం చిన్న జీవితం. బావి చుట్టూ గుండ్రంగా, రౌండ్ గా ఒక చక్రం లో చిక్కుకున్న ఆ ప్రదేశముందే అదే వారి ఆకాశం. ఆ పదడుగుల నీరే ఆవాసం. పైగా చేగువేరా బొమ్మొకటి. ఎగిరి తన్నేవాడు లేకపోతే సరి.

ఒక పార్టీ, దానికో విధానం. దానికో పుస్తకం. పర్యావరణం కోసం పాటుపడతాం. రాష్ట్ర ఆవిర్భావం తప్ప వేరే పండగలు జరుపుకోం. అందరూ మంచిగా ఉండేలా సమాజాన్ని మారుస్తాం. వైద్యం అందరికీ సమానంగా అందిస్తాం. మహిళలు నిర్భయంగా తిరిగేలా చూస్తాం.. అయిందా? ఇంకేమైనా ఉందా? ఉండదులే. చిన్న మెదడు తప్ప పెద్ద మెదడు ఉండే అవకాశమే లేని చోట ఇంతకంటే గొప్ప ఆశయాలు ఏముంటాయి? ఇవి తప్ప గొప్ప విధానాలు ఉంటాయనే ఆలోచన మాత్రం ఎలా వస్తుంది? అజ్ఞానము ఉపశమించు గాక! తప్పు. పాపం శమించునేమోగానీ అజ్ఞానం ఉపశమించదు. చీకటి బుర్రలో ప్రమిద వెలిగించాలన్నా కొంచెం ప్లేసుండాలి కదరా అన్నయ్యా. పార్టీ విధానమంటే ఏం చేస్తామో చెప్పడం కాదు రా బై ఎలా చేస్తామో చెప్పడం.
ప్రశ్నించడానికే పుట్టాం. కానీ, ప్రశ్నించాల్సినవేవీ ప్రశ్నించం. కన్వీనియంట్ గా ఉండే ప్రశ్నల్నే వేస్తాం. బైదివే మమ్మల్ని ప్రశ్నలు వేస్తే మాత్రం సహించం.

కానీ గురూ పర్యావరణ పరిరక్షణ అంటే ఏమిటి? చీపురు పట్టుకొని రోడ్లు ఊడవాడమా? హుసేన్ సాగర్ డ్రెడ్జింగ్ కు బడ్జెట్లకై పోరాడటమా? లేక ప్లాస్టిక్ నిషేధమా? కొందరు సినిమా మా డైరెక్టర్ లను వేదిక ఎక్కించి ఎర్త్ అవర్ పాటించడమా? పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడటమంటే సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాటమని వీళ్లకు ఎవరు చెబుతారు? వర్ధమాన దేశాల నీటినీ, గాలినీ, నేలనీ, ఆవరణాన్ని ధ్వంసం చేస్తున్న దోపిడీ రూపాలేంటో కప్పలకు ఎలా తెలుస్తుంది? ….
…… అంబానీల అడ్డగోలు దోపిడీకి అన్ని గేట్లూ ఎత్తేయడానికి సిద్ధపడ్డ వాడిని నెత్తిన పెట్టుకుని అందరూ సమానమయ్యే సమాజం గురించి విధాన ప్రకటన చేస్తున్నావే. మా చెవిలో ఏమైనా కమలం పూవులు కనిపిస్తున్నాయా?

సరే కానీ గురూ. ఇవన్నీ పక్కన పెట్టు. నీ నుంచి ఇన్ని ప్రశ్నలకు సమాధానాలను ఆశించడం వెర్రి వాళ్లుచేసే పనే. కానీ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. నీకు కుత్బుద్దీన్ అన్సారీ ఎవరో తెలుసా? ఫేస్ ఆఫ్ గుజరాత్ రాయిట్స్ ను నువ్వు గుర్తు పట్టగలవా? గర్భిణుల కడుపులు చీల్చి, కుటుంబాలకు కుటుంబాలను ఇళ్లల్లో తలుపులు వేసి బంధించి, సజీవ దహనాలు చేసి, వీధిలో, బడిలో, బేకరీలో కత్తులు, గొడ్డళ్లు, త్రిశూలాలు చేతపట్టి, వెంటాడి వేటాడి నెత్తురు పారించిన రక్తపు వాసన నీ ముక్కుకు తెలుసా? మోడీ మీద నమ్మకం. తొక్కలోది.

బాసూ నువ్వింత నాటకం ఆడకుంటే బాగుండేది. సామాన్యుడు సామాన్యుడు అంటూ దొంగ జపం చేస్తూ ఇన్ని కోట్ల ఖర్చుతో హైటెక్ పార్టీ లాంచ్ చేయకుంటే బాగుండేది. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేశావు. సొమ్ము నీది కాదు కాబట్టి పెద్ద ఫరకేం పడదు. నువ్వు మాత్రం ఏం చేయగలవు. నీ డైరెక్టర్ ఫాల్టది. బహుశా మోడీ గారు ఇలాగే కోరి ఉంటారు. ఈ నాటకం అంతా ఆడి సినిమాటిక్ గా ఈ ట్విస్ట్ ఇవ్వమని చెప్పి ఉంటారు. పిచ్చి జనులు కాదు గురూ. పచ్చి నాటకాలను కూడా కచ్చితంగా పసిగట్టగల చైతన్యశీలురు. నీ వినోదాత్మక ప్రసంగంలోనే కనిపెట్టారు. నీ ముందు వెనక నిన్ను నడిపించే శక్తులెవరో, ఈ కార్పొరేట్ రాజకీయ క్రీడలో నీ స్పాన్సరర్లెవరో జనం సులభంగా గ్రహించారు.

చరిత్రలో ఇది మామూలే. పెట్టుబడి వేసే ఎత్తుగడల్లో భాగంగా చాలామంది శిఖండులు రకరకాల స్థలకాలాల్లో ఇలా అవతారాలెత్తి ఆపై పని కాగానే అలా సర్దుకుంటున్నారు.

ఇప్పుడు పెట్టుబడికి మోడీ కావాలి. అతని కోసం రకరకాల రూపాల్లో, పాత్రల్లో తెరమీదకు తోలు బొమ్మలు రావాలి. కాగల కార్యం తీర్చాలి. అలాంటి క్యారెక్టరే ఇది. కాకపోతే ఇది తెరమీది పాత్ర కాదు అంతే తేడా. నటనొక్కటే కామన్.

ఎంత మోసగాడివి గురూ. మోసగాడు సినిమాలో మీ అన్నయ్య నటించాడు. నువ్వేమో చే గువేరా బొమ్మలు పెట్టుకున్నావ్. శివ సాగర్ కవిత్వం చదివావ్. తిలక్ ని కోట్ చేశావ్. కొమురం పులి సినిమా టైటిల్ పెట్టుకున్నావ్. నీ గురించి ఊహించుకున్నదొకటి. నువ్వు చేసిందొకటి…….. ఇదొక స్కెచ్. ఆ స్కెచ్ లో నువ్వొక గీత. రెండు సినిమాలు ఫ్లాపయితే చెరిగిపోయే గీత. నీకు కూడా తెలిసిరావాలిలే. నీ సీను తరిగిన రోజున నీకేసి గల్లీలీడరు కూడా చూడడని తెలిసే .. నీ రోజు నీకుంది అన్నయ్యా. లేదా మీ అన్నయ్యని చూస్తే అర్థమవుద్ది.

సంఘపరివార్ వాళ్లు ప్రతిదానికీ గొడవ చేస్తారు. పోస్టర్ లో కృష్ణుడికి కళ్లజోడు పెడితే గొడవ. రాముడి ఫోటో టీ షర్టు మీద వేస్తే గొడవ. హిందూ దేవతల బొమ్మ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ మీద ఉంటే గొడవ. కానీ మేం అలా కాదు. చే బొమ్మలు టీ షర్టుల మీద, బీరు మగ్గుల మీద, సిగార్ పెట్టెల మీద, ఆఖరికి హవాయి చెప్పుల మీద ఉన్నా మేం ఫీలవలేదు. అతన్ని ధరించడం ఒక ఫ్యాషనయినందుకు గర్వపడ్డాం. కానీ గురూ పొరపాటు చేశాం. ప్రతి గొట్టంగాడూ చే ఫోటో పెట్టుకోవడాన్ని చూసి ఊరుకొని పొరపాటు చేశాం. ఆనాడే నీకేం తెలుసునని అడిగుంటే, నీ జ్ఞానమేంటో ప్రశ్నించి ఉంటే ఇప్పుడిలా మోసపోయే వాళ్లం కాదు ‌. …
….. బెటర్ లేట్ దేన్ నెవర్. ఇప్పుడొక బహిరంగ హెచ్చరిక. ముందు మీ ఇంటి గోడమీద చే బొమ్మ తీసేయ్. నీ సినిమాల్లో, సెట్ ప్రాపర్టీల్లో చే బొమ్మను ఎడిట్ చేసేయ్. నువ్వు మోడీ తీర్థం తాగుతావో, చంద్రబాబు స్పాన్సర్డ్ పాట పడుకుంటావో నీ ఇష్టం. బట్ చే కి దూరంగా ఉండు. నీకిక ఆ అర్హత ఏమాత్రమూ లేదు. నీకే చెబుతుంది వినిపిస్తుందా?