Image result for cyber crime part time job"బస్సుల్లో ఆకర్షించేలా పోస్టర్‌ ప్రకటనలు
మోసపోయి బోరుమంటున్న బాధితులు

హైదరాబాద్‌: ‘పార్ట్‌ టైం జాబ్‌’ చేయాలనుకుంటున్నారా…? అర్హత: డిగ్రీ, ఇంటర్‌, పదో తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌. రోజూ రెండు గంటల పని. జీతం రూ.10,000 నుంచి రూ.12,000. అత్యవసరంగా కావాలి. శిక్షణ కూడా అందిస్తాం. అంటూ బస్సుల్లో, రైళ్లలో, అక్కడక్కడా గోడల మీద ప్రకటనలు కనిపిస్తూనే ఉంటాయి. వీటిని చూసి చాలా మంది మోసపోతున్నారు. ఉద్యోగం ఇస్తారు కదా అని ప్రకటనల్లో చెప్పిన నంబరుకు ఫోన్‌ చేసి అక్కడకు వెళ్తే…వారి దగ్గర ఉన్న డబ్బులను కాస్తా వసూలు చేస్తున్నారు కొందరు మోసగాళ్లు. ఉపాధి అవకాశం కోసం ఎదురుచూస్తున్న అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ దందాకు పాల్పడతున్నారు.

నిజమని…
కొత్తగా భాగ్యనగరంలో అడుగుపెట్టినవాళ్లకు ఈ పోస్టర్‌లు కనపడితే జాబ్‌ దొరకడం చాలా సులువని భావించి మోసపోతున్నారు. ఉద్యోగం కోసం ఫోన్‌ చేస్తే ముందుగా కొంత అడ్వాన్స్‌గా ఇవ్వమని చెబుతారు. జాబ్‌ వస్తుందిగా ఈ కొంత మాత్రం ఇస్తే పోయేదేముందంటూ రూ.1000 నుంచి రూ.3000 వరకు ముట్టజెప్పుతారు. పదో తరగతి మెమోలు జిరాక్స్‌లు అప్పజెప్పుతారు. తీరా పని చూపిస్తారా అంటే అదీ ఉండదు.. ఒక వేళ చూపించినా… పోస్టర్‌ ప్రకటనలో చెప్పిన పనికి చూపించిన పనికి చాలా తేడా ఉంటుంది. అధ్వాన స్థితిలో పని చేయలేక, ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకోలేక విసిగి వేసారి డబ్బులు వదులుకుంటున్నారు.

ఫిర్యాదు చేయడం లేదు…
చాలా వరకు ఇలాంటి మోసాలు పోలీస్‌ స్టేషన్ల వరకు వెళ్లడం లేదు. కొద్ది మొత్తంలోనే కదా దీనికోసం పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగడం ఎందుకు అని అనుకోవడంతో ఇటువంటి మోసగాళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇలా చిన్న మొత్తాలతోనే పెద్ద సంఖ్యలో మోసాలకు పాల్పడుతూ అందినకాడిని వెనకేసుకుంటున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి నగరానికి…
ఈ ప్రకటనలు కేవలం నగరంలోనే కాదు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా ఆర్టీసీ పల్లెవెలుగు, లోకల్‌ బస్సుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. పల్లె ప్రాంతాల్లో అప్పుడే డిగ్రీ, ఇంటర్‌ పూర్తి చేసి నగరానికి వచ్చి పై చదువులు చదువుకుందామనుకునే విద్యార్థులు ఎక్కువగా ఈ వలలో పడుతున్నారు. ఇటీవలే నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఇలాగే మోసపోయాడు. ప్రకటన చూసి ఫోన్‌ చేస్తే చాక్లెట్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌ పోస్టుకి నువ్వు సెలెక్ట్‌ అయ్యావు. రూ.3000 ఇస్తే చాలు మొత్తం పని అయిపోతుందని చెప్పారు. నిజమేనని నమ్మి నగరానికి వచ్చిన యువకుడు ఉప్పల్‌లో ఓ వ్యక్తిని కలిసి డబ్బులు ఇచ్చాడు. అతడు చెప్పిన ప్రకారం వారం రోజుల తర్వాత ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ప్రణాళిక ప్రకారమే మోసం చేశారని ఓ బాధితుడు ఘొల్లుమన్నాడు.

డబ్బులు అడిగితే మోసమే
ఉద్యోగాలు ఇచ్చేవారు ఎప్పుడూ డబ్బులు అడగరు… చేసిన పనికి జీతం ఇస్తారు. బలహీనతను సొమ్ము చేసుకుందామనే మోసగాళ్ల వలలో పడొద్దు. పత్రికల్లో, బస్సుల్లో, ఇతర వాల్‌పోస్టర్లలో ఇచ్చే ప్రకటనలు చూసి తొందరపడొద్దు. స్వయంగా అక్కడి వెళ్లి కార్యాలయం వాతావరణం చూడండి. అక్కడి ఉద్యోగులతో మాట్లాడండి. ఎప్పటి నుంచి ఆ కార్యాలయం ఉందో ప్రశ్నించండి. అన్ని విధాలుగా సబబుగానే ఉందని అనిపిస్తే తర్వాతి ప్రక్రియకు వెళ్లండి. ఇలాంటి మోసగాళ్లను గుర్తిస్తే వెంటనే 94906 16555 నంబరుకు ఫిర్యాదు చేయండి. లేదా ‘హాక్‌ ఐ’ మొబైల్‌ యాప్‌లో ఫిర్యాదు చెయొచ్చు.

కేసీఎస్‌ రఘువీర్‌, అదనపు డీసీపీ, సైబర్‌ క్రైం

(Courtesy Eenaddu)