Parents need to think about their kids-Naresh Kumar Sufi

కొన్నేళ్ల కింద నేను పుట్టకముందు “#ఈ_చదువులు__మాకొద్దు” అనే సినిమా వచ్చింది. అప్పటి డబ్బు లెక్కల ప్రకారం నోలాస్, నో గెయిన్ కానీ మంచి విజయం సాధించింది. ఆసినిమా చూసిన యువతరం తల్లులూ తండ్రులూ అయ్యారు వాళ్ళ పిల్లలని డిగ్రీ చదివించారు,
తర్వాత మళ్లీ కొన్నేళ్ళకి “#ఆకలి_రాజ్యం” అనే సినిమా వచ్చింది. ఇదీ మాంచి హిట్టు. ఆ సమయానికి ఉన్న యువతరం వాళ్ళ పిల్లలని ఇంజనీరు (దాన్లో సాఫ్ట్ వేరూ,సివిలో నా బొంద అనికొన్ని ఉన్నాయ్) లేదంటే డాక్టరూ అవమన్నారు. వీళ్ళకన్నా కొంచం కిందవర్గం డిప్లొమాలూ, ప్రభుత్వ ఉద్యోగులూ అవమని పిల్లలని చదివించారు.


అసలు చదువే అందని వర్గం,కులాలూ ఈ దేశంలో ఎప్పటికీ బావుపడవనీ.. వాళ్ళని, వాళ్ళ పిల్లలని ఎలాగూ కుల బానిస వ్యవస్థ పోషిస్తుందని ఒక భరోసా కావచ్చు, నేను కష్టపడ్డాను కుల అవమానాలు పొందాను “కేవలం ప్రభుత్వ/డబ్బు ఎక్కువ వచ్చే ఉద్యోగమే నా బిడ్డలని వాళ్ళ తరం లో రక్షిస్తుంది” అనుకునే వాళ్ళు కావచ్చు. . మెల్లగా ఈ రోగం చిన్న కుటుంబాలకీ సోకింది. చదివితే మంచి భవిష్యత్తు ఉంటది అని చెప్పటం మాని చదివితే డబ్బులొచ్చే ఉద్యోగం ఉంటది అని చెప్పే మాటలు మామూలయ్యాయి. నారాయణలూ, శ్రీ చైతన్యలూ, టెక్నో స్కూల్సూ వచ్చాయి.
కానీ ఈ ముప్పై ఏళ్లలో సంబరం, 7/G లాంటి హీరోలు వచ్చినా వాళ్ళని ప్రేమ ముసుగులో దాచేశారు.
అయితే ఒక సంవత్సరం కింద కూడా…. #నీది_నాది_ఒకే_కథ అనే సినిమా వచ్చింది. పాన్ షాప్, డ్రైవర్, వ్యవసాయం కూడా కెరీర్ అవుతాయని, ఆ ఫీల్డ్ లో ఇంట్రస్ట్ ఉన్నవాళ్ళని కూడా ప్రోత్సహించవచ్చని చెప్పిన సినిమా. తీసిన దర్శకుడు ఒకప్పుడు ఆకలికి తపిస్తూ ఇవాళ సక్సెస్ కొట్టినవాడే. సినిమానీ, దర్శకున్నీ జనాలు చూసి మెచ్చుకున్నారు, హిట్ చేశారు. కానీ దర్శకులు కేవలం టికెట్ డబ్బులకోసమే సినిమా చేశారు అనుకున్నట్టున్నారు. కనీసం తమ పిల్లలకు అలాంటి సినిమా దర్శకుడు అవమని కూడా చెప్పలేక పోయారు. ఫలితం కళ్ళముందు కనిపిస్తూనే ఉంది.
పదిహేడేళ్ల యువ భారత దేశం మట్టికింద నిద్రలకు పోయింది. సినిమాల్లో పడి చస్తారేరా అని పిల్లలని తిట్టే మీరు. కనీసం ఆ సినిమా చూసి బతకండర్రా అని చెప్పలేరా?? ఇన్ని పోస్టుల, ఇన్ని మరణాల తర్వాత కూడా కార్పొరేట్ కాలేజీల అడ్మిషన్లకు ఎగబడే తల్లి తండ్రులారా..! ముసలి తనాన విదేశాలకు తిప్పే కొడుకూ, కూతురు ని తయారు చేసుకునే మీ మధ్యతరగతి పచ్చి స్వార్థం, జనాల్లో మావాడు అదీ, మా అల్లుడు ఇదీ (ఎంత చదివినా బిడ్డకంటే అల్లుడి హోదానే చెప్పుకోవాలి మనం) అని చెప్పుకునే “కన్న ప్రేమ” అనే దరిద్రం ఎప్పుడు బొందలకు పొతాదో..
లక్షల రూపాయలు కాలేజ్ లో కట్టే మీరు.. రేపటి మీ భవిష్యత్తుకు కోట్ల నిచ్చేనలు వేస్తున్నారు, పిల్లలకు ఇష్టం అయిన కాలేజ్ అయినా ఇంట్లో ఒకరోజు వండిన వంకాయ కూర కూడా రెండో రోజు నచ్చలేదు అంటే చికెన్ తెచ్చి పెట్టె మీరు. ఇంత ఫీజు అంత ఫీజు అని వాడు “నేను చేరతాను అన్న ఈ కాలేజ్ నాకు నచ్చట్లేదు” అనే అవకాశం లేకుండా ప్రతీ క్షణం గుర్తు చేస్తున్నారు. పిల్లవాడో, పిల్లనో కేవలం కన్నవాళ్ళ ముందు ప్రతీ మాటా నేర్చుకున్నవాళ్ళు, అమ్మా నాన్నా నా సైన్యం అనుకున్న వాళ్ళు. నాన్న కోపానికి, అమ్మ అలకకూ భయపడి, “,జనం ఏమంటార్రా, నా పరువు” అనే మీ మాటలకు జడిసి చస్తున్నారు… చస్తూనే ఉంటారు…
చలో మనం బిగ్గరగా అరుద్దాం “ప్రపంచ ఐటీ నిపుణులు భారత సంతతి వారే” అని.
PS: పిల్లలకు ఇష్టమైతే అండమాన్ హాస్టల్లో అయినా చదువుతారు. అయితే వాళ్లకు నచ్చకపోతే ఒక మాట చెప్పే అవకాశం ఇవ్వండి. లక్ష ఫీజు పోతే లక్ష కట్నం, (వచ్చేదో,ఇచ్చేదో) పోతుందని లెక్కలెయ్యకండి. పక్కింటి నారాయణ, కొలీగ్ చైతన్యా ముందు మీ ప్రెస్టేజ్ కంటే మీ పిల్లలు (నిజానికి పక్కాగా మాట్లాడితే ఈ దేశపు ఉత్పత్తి సాధనాలు వాళ్ళు ) తక్కువ అనుకోకండి. మొన్న మీరంతా నెత్తిన పెట్టుకున్న అభినందన్ లో, సచిన్ లో, అన్నం పెట్టే రైతులొ, దేశ రవాణా లో వాళ్ళు భాగస్వాములవుతారేమో. గమనించండి. ముఖ్యంగా పేరెంట్స్ అంటే పిల్లల “యజమానులు” అనే ఫీలింగ్ వదిలేయండి సామీ. మీ కాళ్ళు మొక్కుతాం…