దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సిని అమలు చేయడం మొదలు కోల్‌కతాలోని శాంతి నికేతన్‌లో పారామిలటరీ బలగాలను మోహరించడం వరకు పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పశ్చిమబెంగాల్‌ ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా భావించే రెండు అంశాలపై గత కొన్ని రోజులుగా విపరీతమైన దాడి జరుగుతోంది. ఒకటి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన శాంతినికేతన్‌ కాగా, రెండోది బెంగాలీల మధ్య నెలకొన్న సామరస్య భావన. దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌చే సృష్టించబడి, అత్యుత్తమ విద్యాలయంగా కేంద్రంగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌చే తీర్చిదిద్దబడిన శాంతినికేతన్‌ ఇప్పుడు పారామిలటరీ బలగాల నియంత్రణలోకి వెళ్ళింది. నోబెల్‌ బహుమతి గ్రహీతలు అమర్త్యసేన్‌, సత్యజిత్‌ రే, ఇందిరాగాంధీ వంటివారు ప్రజా జీవితంలో రాణించడానికి ప్రేరణ ఇచ్చిన శాంతి నికేతన్‌ ఇప్పుడు పారా మిలటరీ దళాల పహారాలో నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయమే దీనికి కారణం. పచ్చటి చెట్ల సాహచర్యంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మలమైన ఆకాశం కింద విద్యను నేర్చుకోవాలన్న శాంతినికేతన్‌ సిద్ధాంతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దెబ్బతింది. శాంతి నికేతన్‌ అనే భావనకు ముప్పు ఏర్పడింది. హోం మంత్రి అమిత్‌షా అస్సాంలో ప్రకటించిన విధంగా దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సిని అమలు చేయాలన్న నిర్ణయంతో శరణార్ధులపై దృష్టి పడింది. బెంగాల్‌లో దాదాపు 2 కోట్ల మంది బెంగాలీలు, ఇతర ప్రాంతాల నుండి బెంగాల్‌కు వచ్చిన 2.5 కోట్లమంది ప్రజలు ఒకప్పుడు బెంగాల్‌లో శరణార్ధులుగా ఉన్నారు. వీరిలో జోరాష్ట్రియన్‌ మతాన్ని అనుసరిస్తున్న వారు కూడా ఉండవచ్చు.
ఠాగూర్‌ తన కవితలలో చెప్పిన విధంగా ఇవ్వడం,తీసుకోవడం, సమీకరించడం అనేది భారత్‌ భావన. ఇప్పుడు ఈ భావన ప్రమాదంలో పడింది.
విదేశీయులు చొరబడటం తీవ్రంగా పరిగణించాల్సిన చట్టపరమైన సమస్యే. అయితే 45 సంవత్సరాల వయస్సున్న ఒక సామాన్య పౌరుడు తాను భారతీయుడినే అని ఎందుకు నిరూపించుకోవాలి? 12 ఏళ్ళ చిన్నారి తల్లి, తండ్రి భారతీయులేనని ఆ చిన్నారి భారత్‌లో పుట్టిన వాడేనని, విదేశీయుడుకాదని మళ్ళీ ఎందుకు నిరూపించుకోవాలి.
ఇటీవల ఓటరు కార్డు తనిఖీల పేరుతో స్థానిక స్కూల్‌ మాస్టర్లను పంపి దేశ పౌరుడి పూర్వీకుల భారతీయతను తనిఖీ చేసి, ఎన్‌ఆర్‌సికి దొడ్డిదారిన ప్రవేశం కల్పించడం నిజంగా ఆగ్రహం కలిగించే విషయమే.

Courtesy Prajasakthi