భూములిస్తారా.. చస్తారా..?
బలవంతంగా భూసేక’రణం’
దొర భూములు కాపాడటానికి రీడిజైన్‌
పాలమూరు-రంగారెడ్డి బాధితుల గోడు
పోలీస్‌ పహారాలోనే కుడికిళ్ల
మల్లన్నసాగర్‌ తరహాలో పరిహారమివ్వాలని డిమాండ్‌
ఎన్‌.అజయ్ కుమార్‌
వారంతా భూమినే నమ్ముకున్న నిరుపేద రైతులు. ఎకరా, అరెకరానే వారి ఆస్తిపాస్తులు. కుటుంబాల్లో ఉన్నత చదువులు చదివినవారు పెద్దగా లేరు. ఊరంతా రైతు, కూలీలే. ప్రాజెక్టుల కోసం వారి బతుకులను పణంగా పెట్టారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, మిషన్‌ భగీరథ పైపులైన్‌ కోసం భూములిచ్చి, అరకొర పరిహారం తోనే సర్దుకున్నారు. ఇప్పుడు ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టు రూపంలో వారి నెత్తిపై పిడుగు పడింది. ఉన్నదాంట్లో తిండిగింజలు పండించుకుంటున్న భూమినీ ప్రాజెక్టుకు ఇవ్వాలని మెడపై సర్కార్‌ కత్తిపెట్టింది. వారిని నిర్బంధించి పొలాల్లో బలవంతంగా సర్వే చేపట్టింది.
కుడికిళ్ల మొన్నటివరకు తెలియని ఊరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు కేంద్ర బిందువైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని ఈ గ్రామ జనాభా 4706. ఎస్సీలు 1491, ఇతరులు 3201, ఎస్టీలు 14 మంది ఉన్నారు. మొత్తం వ్యవ్యసాయ భూమి వెయ్యి ఎకరాలు. పదేండ్ల కిందట కేఎల్‌ఐ(కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌)కు సింహభాగం ఈ గ్రామం నుంచే సేకరించారు. సుమారు 240 ఎకరాలు, ఆ తర్వాత మిషన్‌ భగీరథ పైపల్‌లైన్‌ కోసం 60 ఎకరాలు తీసుకున్నారు. ప్రస్తుతం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్‌(అంజనగిరి) నుంచి ఎదులా రిజర్వాయర్‌కు 12 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెెళ్లే సామర్థ్యంతో ప్రధాన కాలువ తవ్వుతున్నారు. అందులో కుడికిళ్లకు చెందిన 130 మంది రైతులవి 272 ఎకరాలు సేకరిస్తున్నారు. గతంలోనే రెండుసార్లు భూములు తీసుకున్న ప్రభుత్వం ఉన్న కాస్తా భూమిని ఇవ్వాలంటే రైతులు ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే భూములు ప్రాజెక్టులకిచ్చి నష్టపోయామనీ, ఉన్న భూమిని తీసుకుంటే ఎలా బతకాలనీ సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు.

ఆది నుంచి పోరుబాటే..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలిసారి అధికారం చేపట్టాక పాలమూరు- రంగారెడ్డి రీడిజైన్‌ పేరుతో పనులు మొదలుపెట్టింది. అప్పుడే కుడికిళ్ల గ్రామస్తులు భూములివ్వ బోమని తేల్చిచెప్పారు. తర్వాత కాళేేశ్వరం తెరమీదకు రావడంతో ఈ ప్రాజెక్టు మరుగున పడింది. ఒకట్రెండుసార్లు భూ సేకరణకు వచ్చిన అధికారులను అడ్డుకుని వెనక్కి పంపారు. ఆ తర్వాత భూములు కాపాడాలని కొల్లాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట 108 రోజులు దీక్షలు చేపట్టారు. దీంతో సర్కార్‌కాస్తా వెనక్కి తగ్గింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలమూరు పర్యటనలో ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించారు. పాలమూరు-రంగారెడ్డిని కాళేశ్వరం వలే పరుగులు పెట్టిస్తానన్నారు. అనుకున్నది తడవుగా పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో భూనిర్వాసితులు అడ్డుకున్నా వారిని అరెస్టు చేసి తీవ్ర నిర్భంధం మధ్య భూసర్వే పూర్తి చేశారు.
మైహౌం’ కోసమేనా రీడిజైన్‌..?
మైహౌం రామేశ్వర్‌రావు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. రామేశ్వర్‌రావు స్వగ్రామం కుడికిళ్ల కావడంతో ఆయనకు చెందిన భూమి 20 ఎకరాలు, అనుయాయుల భూమి ఎక్కువగా ప్రాజెక్టులో పోతున్నదని డిజైన్‌ మార్చినట్టు భూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. అందుకే ప్రాజెక్టు ముందు డిజైన్‌ను మార్చి దళితుల భూములు పోయేవైపు మళ్లించారని వాపోతున్నారు. వేలకోట్లకు అధిపతి అయిన రామేశ్వర్‌రావు ఒత్తిడి మూలంగానే కాలువకు ప్రభుత్వం రీడిజైన్‌ చేసినట్టు చెబుతున్నారు.
అక్కడ రూ.12 లక్షలు.. ఇక్కడ రూ.5.50లక్షలు
మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో పోతున్న వేములఘట్‌, కొండపోచమ్మ నిర్వాసితులకు ఇచ్చిన మాదిరిగానే ఎకరాకు రూ.12లక్షల నుంచి 15లక్షలు ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. కుడికిళ్లలో ఎకరాకు రూ.5.50లక్షలు ఇస్తామని చెబుతోందనీ, సీఎం సొంత జిల్లాలో ఒకరేటు, ఇక్కడో ఇంకోరేటు ఎలా నిర్ణయిస్తారనీ స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎకరా భూమి రూ.18లక్షల వరకు నడుస్తోందన్నారు. భూమికి భూమైనా ఇవ్వాలనీ, లేదంటే 2013 చట్టం ప్రకారం మార్కెట్‌ రేట్‌కు మూడు రెట్లు ఎక్కవ ఇవ్వాలనీ డిమాండ్‌ చేస్తున్నారు. తక్కువ పరిహారమిచ్చి బలవంతంగా భూములు గుంజుకుంటే చావనైనా చస్తామనీ, భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదనీ హెచ్చరిస్తున్నారు
పిల్లల పెండ్లి ఎట్ల జెయ్యాలే..
నాకు పెండ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. మాకున్నది పావుతక్వువ రెండెకరాలు. ఇప్పుడు ప్రాజెక్టుకు భూమి తీసుకుంటామం టున్నరు. ఆ భూమి ఆధారంగానే పెండిళ్లు జేద్దామనుకున్న. అది లేకపోతే మా పరిస్థితి ఏంది? మేం ఎట్లా బతకాలి. పిల్లల్ని ఓ అయ్య చేతిలో ఎట్లా పెట్టాలే. మీరే చెప్పుండ్రి సారూ.
మీనగ చంద్రకళ, కుడికిళ్ల

ఎకరాకు రూ.18 లక్షలివ్వాలి
మేం నలుగురం అన్నదమ్ములం. 12 ఎకరాలుంటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఆరెకరాలు పోయింది. ఇప్పు డున్నది ఆరెకరాలే. పంచుకుంటే నా పాలుకొచ్చేది ఎకరంన్నర. నాకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులున్నారు. వ్యవసాయం తప్ప మరే ఆధారం లేదు. మార్కెట్‌లో ఎట్లుంటే అట్ల భూమైనా కొనియ్యాలి. లేదంటే మల్లన్నసాగర్‌ల ఇచ్చినట్టు పరిహారమియ్యాలే.

కులాసి సన్నయ్య, కుడికిళ్ల

Courtesy Nava telangana…