‘‘రాజు అన్నాడు ఇది రాత్రి అని.. మహారాణి అన్నది ఇది రాత్రే అని.. భటుడు అన్నాడు అవును ఇది రాత్రే కదా.. అని. ఇదంతా పొద్దున్న జరిగిన సంభాషణ’’ అని ప్రముఖ హిందీ కవి గోరఖ్ పాండే ఎప్పుడో రాశారు. ఇది ఇప్పుడు దేశ ప్రజాస్వామిక వ్యవస్థలో అన్ని పార్టీల పాలనలో ప్రతిఫలిస్తోంది.

కేరళలోని పలక్కాడ్ జిల్లాలో వలయార్‌లో 9, 13 సంవత్సరాల వయసున్న దళిత బాలికలు ఇరువురు తమ స్వంత ఇంటిలోనే రెండేళ్ల క్రితం ఉరివేసుకుని మరణించారు. ఒక బాలిక ఉరివేసుకుని మరణించిన రెండునెలలకు మరో బాలిక కూడా అదే తరహాలో తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. వారిద్దరిపై అత్యాచారం చేసి చంపేశారని, వారి హత్యల్ని ఆత్మహత్యలుగా చిత్రించారని ఆరోపిస్తూ కేరళలో దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ కేసులో నిందితులైన నలుగురిని నిర్దోషులుగా భావిస్తూ గత నెలలో కోర్టు వారిని విడుదల చేసినప్పుడు మరో సారి ఈ బాలికల మరణం వార్తలకెక్కింది. మంగళవారం ఉదయం తిరువనంతరపురం కాంగ్రెస్ ఎంపి కొడిక్కునిల్ సురేశ్ ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కేరళ రాష్ట్ర పోలీసులు అధికార సిపిఐ(ఎం) ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుని, ఈ కేసులో నిందితులైన ఆ పార్టీ కార్యకర్తలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేశారని, ఈ మొత్తం ఉదంతంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కేరళకు చెందిన ఆర్‌ఎస్‌పి ఎంపి ప్రేమచంద్రన్ కూడా ఈ విషయంలో కాంగ్రెస్ డిమాండ్‌ను సమర్థించారు. దారుణమేమంటే కేరళ ఎంపిలు చెబుతున్న వివరాల ప్రకారం ఆ అమ్మాయిలపై లైంగిక దాడి జరిగిందని డాక్టర్లు చెప్పినప్పటికీ, అసహజమైన రీతిలో వారిపై అత్యాచారాలు చేశారని పోస్ట్ మార్టమ్ నివేదిక చెప్పినప్పటికీ పోలీసులు పూర్తిగా విస్మరించారు. సిపిఐ(ఎం) ప్రభుత్వ యంత్రాంగం, ప్రాసిక్యూషన్, రాష్ట్ర పోలీసులు కుమ్మక్కై ప్రతి దశలోనూ దర్యాప్తును తప్పుదోవ పట్టించారని, బలహీనమైన ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించి, వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేయడంతో కోర్టుకు నిందితులను విడుదల చేయడం తప్ప గత్యంతరం లేకపోయిందని వారు అంటున్నారు. కనీసం ఆ పేద బాలికల తల్లిదండ్రులకు నష్టపరిహారం కూడా చెల్లించలేదని వారు ఆరోపించారు. ఈ బాలికలపై జరిగిన అత్యాచారాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని పాలక్కాడ్ అదనపు సెషన్స్ జడ్జి మురళీ కృష్ణ చెప్పారు. విచిత్రమేమంటే నిందితుడి తరఫున చాలా కాలం వాదించిన న్యాయవాది ఎన్.రాజేశ్‌ను కేసు విచారణ జరుగుతుండగానే బాలల సంక్షేమ కమిటీకి చైర్మన్‌గా నియమించడం కూడా కేరళలో గగ్గోలు సృష్టించింది.

జమ్ములోని కథువాలో మైనర్‌పై అత్యాచారం జరిగినప్పుడు, షాజహాన్ పూర్‌లో మాజీ కేంద్ర మంత్రి చిన్మయానంద ఒక న్యాయ విద్యార్థినిపై లైంగిక దాడి జరిపినప్పుడు, మరెక్కడైనా కానీ ఇలాంటి ఏ సంఘటన జరిగినా సిపిఐ(ఎం) కార్యకర్తలు, వారి మహిళా సంఘాలు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు జరపడం కద్దు. ప్రజాస్వామ్యంలో ఇది సహజమే కాని అదే సిపిఐ(ఎం) కార్యకర్తలు కేరళతో తమ ప్రభుత్వ హయాంలో ఇద్దరు మైనర్ దళిత బాలికలపై అత్యాచారం జరిగితే ఆ కేసును తొక్కిపెట్టడానికి నిందితులను కాపాడడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు నోరు విప్పకపోవడం అత్యంత ఘోరమైన విషయం.

కార్మికుల తరఫున, పీడితుల తరపున తామున్నామంటూ ప్రతి రాష్ట్రంలోనూ ముందుకు వచ్చే సిపిఎం తాము పాలిస్తున్న రాష్ట్రంలో మాత్రం అన్యాయాల పట్ల ధృతరాష్ట్రుల్లా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘సిపిఐ(ఎం)కు పార్టీ తప్ప మరేమీ పట్టదు. పార్టీ మనుషులను కాపాడేందుకు వారు ఎంతటి దారుణాన్నైనా సమర్థిస్తారు’ అని ఆ పార్టీ మిత్రపక్షం నేత ప్రేమచంద్రన్ వ్యాఖ్యానించారు. ‘బహుశా ఇట్లాగే ప్రవర్తిస్తే భవిష్యత్తులో కేరళలో కూడా ఆ పార్టీ మిగలదేమో’ అని కూడా ఆయన అన్నారు. విచిత్రమేమంటే నిన్నమొన్నటి వరకూ వామపక్షాలతో కలిసి ప్రత్యామ్నాయం నిర్మించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఇవాళ కేరళలో జరిగిన ఒక దారుణ ఘటనపై నరేంద్రమోదీ ప్రభుత్వం ద్వారా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం ఒక గొప్ప వైరుధ్యం. మోదీ హయాంలో సిబిఐపై కాంగ్రెస్‌కు విశ్వాసం ఉన్నప్పుడు తమ పార్టీ నేతలపై సిబిఐ ద్వారా జరుగుతున్న దర్యాప్తులు కూడా న్యాయంగానే జరుగుతున్నాయని ఆ పార్టీ భావించవలసి ఉంటుంది.

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల అధినేతలు తాము, తమ అస్మదీయులు నేరాలకు పాల్పడినప్పుడు ఆ దారుణాలపై ముసుగు కప్పే విషయంలో ఆయా పార్టీల వైఖరిలో తేడా కనపడకపోవడం బాధాకరంగా కనిపిస్తుంది. అంతేకాదు, నేరారోపణల విషయంలోనూ, కేసుల్లో ఇరికించడం విషయంలోనూ, నిర్బంధం విషయంలోనూ అధికారంలో ఉన్న వారి ప్రయోజనాలకు అనుగుణంగానే చర్యలు కనపడుతున్నాయి. ఈ మొత్తం క్రమంలో అధికార యంత్రాంగం, పోలీసు వ్యవస్థ, చివరకు న్యాయవ్యవస్థ కూడా భ్రష్టుపట్టడం ఒక దుర్మార్గ సమాజాన్ని సూచిస్తోంది. పాలక్కాడ్ నుంచి ఢిల్లీ వరకు ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు కాని ఆయా వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరించిన దాఖలాలు కనపడడం లేదు.

అధికారంలో లేనప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి, అధికారం చేతుల్లోకి వచ్చాక విచ్చలవిడిగా వ్యవహరించడం నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక లక్షణమయితే అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం ఒక స్థిరమైన సిద్ధాంతాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని రాజకీయ పార్టీలు గ్రహించడం మరో లక్షణంగా కనిపిస్తోంది. హర్యానాలో బీజేపీ ఒక కుటుంబ పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రభుత్వాన్ని పడగొట్టి, తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజీనామాలు చేసిన వారికే బిజెపి తీర్థం ఇచ్చి ఉప ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడం, మహారాష్ట్రలో శివసేనతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్‌సిపి, కాంగ్రెస్ చేతులు కలపడం లాంటివి తాజా పరిణామాలు.

ఈ మూడు పరిణామాల్లో అత్యంత ఆసక్తికరమైనది శివసేన-–ఎన్‌సిపి–కాంగ్రెస్ కూటమిగా ఏర్పాటు అయ్యేందుకు ప్రయత్నించడం. భారత రాజకీయాల్లోనే ఇది ఒక కొత్త సమీకరణంగా భావించేందుకు ఆస్కారం ఉన్నది. దేశ రాజకీయాల్లో ప్రబల శక్తిగా మారిన భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఎవరితోనైనా చేతులు కలిపేందుకు ఆయా పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు బిజెపి ఉధృతిని ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నాయని ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోంది. నిజానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కన్నా భారతీయ జనతా పార్టీని ఏదో ఒక స్థాయిలో అడ్డుకునేందుకు ప్రాంతీయ పార్టీలు తమ శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన–-ఎన్‌సిపి ప్రయోగం విజయవంతం అయితే జాతీయ స్థాయిలో కూడా ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు కలిసికట్టుగా ప్రయత్నించేందుకు అవకాశాలు ఉన్నాయి.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రెండు రోజుల్లోనూ, సభలో గందరగోళం సృష్టించడానికి ముందుకు వచ్చిన వారిలో ప్రాంతీయ పార్టీల ఎంపీలే ఎక్కువ కనపడుతున్నారు. శివసేనకు చెందిన 18 మంది కూడా ఉన్నట్లుండి ప్రతిపక్షంగా మారడంతో ఒక్క లోక్‌సభలోనే దాదాపు 130కి మందికి పైగా ఎంపీలు గందరగోళం సృష్టించిన దృశ్యం మొదటి రోజే కనపడింది.

బిజెపిని అడ్డుకునే ప్రయత్నంలోనే కాదు, బిజెపి నుంచి తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ ఎలాంటి శషబిషలు లేకుండా సిద్ధాంతాల రాద్దాంతాలకు పోకపోవడం గమనార్హం. శివసేన అవలంబిస్తున్న హిందూత్వ ఏమీ ప్రమాదకకరం కాదని, అది మరాఠా అస్తిత్వం కోసం పోరాడిందని కాంగ్రెస్ నేతలు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇక శివసేన నిన్నమొన్నటి వరకూ తాను అధికారం పంచుకున్న భారతీయ జనతా పార్టీని ఈ దేశంపై దాడి చేసిన మహమ్మద్ ఘోరీగా అభివర్ణించింది. బిజెపి పుట్టక ముందునుంచే తాము హిందూత్వ వైఖరిని అవలంబిస్తున్నామని, ఆ పార్టీనుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో స్పష్టం చేసింది.

ఒకప్పుడు బిజెపితో ఎవరూ లేనప్పుడు తాము ఆ పార్టీకి అండగా నిలిచామని, ఇప్పుడా పార్టీ మహారాష్ట్రలో తమనే మింగేందుకు ప్రయత్నిస్తోందని శివసేన విమర్శించింది. బిజెపిని మహారాష్ట్రలో ప్రవేశించేందుకు అనుమతించి తప్పు చేశామని ఆ పార్టీ ఇప్పుడు పశ్చాత్తాప పడుతోంది. బిజెపి పట్ల శివసేన చేసిన వ్యాఖ్యల అంతరార్థం దేశంలోని మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా గ్రహిస్తే వచ్చే ఎన్నికల్లో బిజెపి అంతటా ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. కాని దేశమంతటా విస్తరించేందుకు దూసుకువస్తున్న బిజెపిని విస్మరించేందుకు ఎన్ని పార్టీలు సిద్ధంగా ఉంటాయన్నది పరిశీలించాల్సి ఉన్నది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ 250వ చరిత్రాత్మక సమావేశాలు జరగడం విస్మరించదగ్గ సందర్భం కాదు. తన 67 సంవత్సరాల పయనంలో రాజ్యసభ లోక్‌సభ కన్నా అద్భుతమైన భూమిక పోషించిన సందర్భాలున్నాయి. లోక్‌సభలో మెజారిటీ బలంతో తాము అనుకున్న బిల్లును ఆమోదించగలిగిన ప్రభుత్వం రాజ్యసభలో మాత్రం ప్రతిఘటనను ఎదుర్కొన్న ఉదంతాలు అనేకమున్నాయి. 2002లో ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు పోటా బిల్లును లోక్‌సభ ఆమోదిస్తే రాజ్యసభ తిరస్కరించింది. దీనితో ఉభయ సభల్ని సమావేశపరిచి పోటాను ఆమోదించాల్సి వచ్చింది.

ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నందుకు, ఎంపిలాడ్స్ క్రింద ప్రాజెక్టుల అమలు విషయంలో అక్రమాలకు పాల్పడినందుకు సదరు సభ్యులను రాజ్యసభ బహిష్కరించిన సందర్భాలున్నాయి. కాని కాలం గడుస్తున్న కొద్దీ లోక్‌సభతో పోలిస్తే రాజ్యసభ పెద్దల సభగా, విజ్ఞుల సభగా తన ప్రత్యేకతను ఎంతవరకు నిలుపుకుంటున్నదనేది ప్రశ్నార్థకం. సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో ప్రారంభమై వెంకయ్యనాయుడు వరకు కొనసాగిన రాజ్యసభ కేవలం బిల్లుల ఆమోదం కోసమే ఏర్పడిన సభగా కాకుండా ఒక ప్రత్యామ్నాయ ఆలోచనకూ, లోతైన చర్చలకూ వేదికగా మారినప్పుడే దాని ప్రత్యేకత నిలబడుతుంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాజ్యసభ గత సమావేశాల్లో కశ్మీర్‌లో 370 అధికరణ రద్దును ప్రవేశపెట్టినందుకు నిరసనగా భారత రాజ్యాంగాన్నే చించివేసి సభ నుంచి బహిష్కరణకు గురైన పిడిపి ఎంపిలు మీర్ ఫయాజ్, నజీర్ అహ్మద్‌లు ఇద్దరూ ఇప్పుడు ఏ శిబిరంలో ఉన్నారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. వారు రాజ్యాంగం చించిన నాటికీ ఇప్పటికీ వారి వైఖరిలో చాలా తేడా వచ్చినట్లు కనపడుతోంది. వారిలో ఒకరు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హాజరై పిడిపి నుంచి బహిష్కరణకు గురయ్యారు. ‘మిమ్మల్ని రాజీనామా చేయమని మీ నాయకత్వం చెప్పింది కదా’ అని అడిగినప్పుడు ‘మా నాయకురాలు మహబూబా ముఫ్తీయే నిర్బంధంలో ఉన్నప్పుడు పేపర్లలో వచ్చిన ప్రకటనలు నిజమని ఎలా నమ్ముతాం’ అని వారిలో ఒక ఎంపి ప్రశ్నించారు. రాజ్యసభలో ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాల్లో ఇదొకటి. ఇక్కడ ఎంపీల్లో ఎప్పుడు మానసిక పరివర్తన ఏర్పడుతుందో, ఎప్పుడు ఎవరు ఏ శిబిరంలో కనపడతారో చెప్పలేని పరిస్థితి కనపడుతోంది. ప్రజాస్వామ్య ప్రహసనాలు పెద్దల సభలో కూడా కనపడడం 250వ సమావేశాల సందర్భంగా దాని పరిణతికి నిదర్శనం. ‘‘రాజు అన్నాడు ఇది రాత్రి అని.. మహారాణి అన్నది ఇది రాత్రే అని.. భటుడు అన్నాడు అవును ఇది రాత్రే కదా.. అని.. ఇదంతా పొద్దున్న జరిగిన సంభాషణ..’’ అని ప్రముఖ హిందీ కవి గోరఖ్ పాండే ఎప్పుడో రాశారు. ఇది ఇప్పుడు దేశ ప్రజాస్వామిక వ్యవస్థలో అన్ని పార్టీల పాలనలో ప్రతిఫలిస్తోంది.

ఎ. కృష్ణారావు
(-ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)