307 కోట్లూ నిజాం వారసులకే బ్రిటన్‌ హైకోర్టు తీర్పు

భారత్‌కు భారీ విజయం

2008లోనే కోర్టు బయట పరిష్కారానికి యత్నం

లండన్‌, అక్టోబరు 2: పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా భారత్‌కు మరో భారీ విజయం దక్కింది. హైదరాబాద్‌ నిజాం సంపదపై హక్కుల విషయమై భారత్‌-పాక్‌ల మధ్య కొనసాగుతున్న ఈ కేసులో బ్రిటన్‌ హైకోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 1948లో హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనం కావడానికి కొద్ది రోజుల ముందు నిజాం ఆర్థిక మంత్రి బ్రిటన్‌లోని పాకిస్థాన్‌ హైకమిషనర్‌ రహ్మతుల్లాకు 10 లక్షల పౌండ్లను పంపి జాగ్రత్తగా దాచాలని చెప్పారు. నిజాం చివరకు హైదరాబాద్‌ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేశారు. ఆ సొమ్ము ఎవరిదో న్యాయపరంగా తేలేవరకు ఖాతాను స్తంభింపజేస్తున్నట్లు అప్పట్లో స్థానికన్యాయస్థానం ప్రకటించింది.నాటి 10 లక్షల పౌండ్లు వడ్డీతో కలిపి రూ.307 కోట్లయింది. నాట్‌వెస్ట్‌ బ్యాం కులో ఉన్న ఈ సొమ్ము తమదేనని పాకిస్థాన్‌ వాదిస్తుండగా, అది తమదేనని నిజాం వారసులు భారత్‌తో కలిసి న్యాయ పోరాటం చేస్తున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసులో బుధవారం బ్రిటన్‌ హైకోర్టు భారత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఆ సొమ్ముపై పాక్‌కు హక్కులు లేవని తేల్చింది. రూ.307 కోట్లు ఏడో నిజాం నవాబుకు, వారసులకు చెందుతాయని చెప్పింది. పాక్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దాంతో 70 ఏళ్ల న్యాయవివాదానికి తెర పడింది. ఇది ప్రపంచంలో సుదీర్ఘంగా సాగిన ఆర్థికపరమైన న్యాయ వివాదంగా రికార్డులకు ఎక్కింది. ఈ కేసు మొదలైనప్పుడు నిజాం యువరాజు ముఖరంజా చిన్నపిల్లాడు. ఇప్పుడు 80 ఏళ్ల వృద్ధుడు. నిజాం నవాబు ఆ సొమ్మును భద్రంగా పెట్టమని ఇచ్చారంటే అర్థం ఇండియాకు చెందకూడదనే వాదనను పాక్‌ వినిపించింది. అదే నిజమనుకున్నా ఆ సొమ్ముకు పాక్‌ ట్రస్టీయే అవుతుందని, యజమాని కానేరదని హైకోర్టు అభిప్రాయపడింది.

ఆయుధాల కోసం నిజాం ఈ సొమ్ము ఇచ్చారని మొదట వాదించిన పాక్‌ తర్వాత ఆ వాదనకుకట్టుబడలేదు. సార్వభౌమ దేశాలు తమ చర్యలకు ఏ న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరంలేదు. పాక్‌ ప్రభుత్వం 300 కోట్లకు ఆశపడి 2013లో సార్వభౌమ ప్రభుత్వంగా తనకున్న ఇమ్యునిటీని పక్కనబెట్టింది. ఈ తీర్పు పాకిస్థాన్‌కు పెద్ద షాక్‌గా భావిస్తున్నారు. అయితే, తీర్పును అధ్యయనం చేసిన తర్వాతే చట్టపరంగా ఏం చేయాలన్నది నిర్ణయిస్తామని పాక్‌ విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Courtesy Andhrajyothi