* జెఎన్‌యులో విద్యార్థుల మానవహారం
* దేశ, విదేశాల నుంచి వెల్లువెత్తిన సంఘీభావం
* ఢిల్లీ, ముంబయి, కొల్‌కతా, బనారస్‌, హైదరాబాద్‌ వర్శిటీల్లో భారీ ర్యాలీలు
* విసి బర్తరఫ్‌కు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్‌

ప్రతిష్టాత్మక జవహర్‌ లాల్‌ యూనివర్సిటీ (జెఎన్‌యు)లో ఆదివారం ఎబివిపి గూండాలు జరిపిన అనాగరిక దాడిపై యావద్దేశం ఆగ్రహంతో రగిలిపోయింది. ఢిల్లీ, ముంబయి, కొల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌తో సహా దేశ వ్యాపితంగా అన్ని ప్రధాన నగరాల్లోని యూనివ ర్శిటీలు విద్యార్థుల నిరసనలతో హోరెత్తాయి. భారత్‌లోనే కాదు కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ తదితర ప్రఖ్యాత అంతర్జాతీయ యూనివర్సిటీల్లోనూ విద్యార్థులు నిరసన తెలిపారు. ముసుగులు వేసుకుని, ఇనుపరాడ్లు, సుత్తులు, కర్రలతో ఎబివిపి గూండాలు గంటల తరబడి యథేచ్ఛగా దాడులకు పాల్పడుతుంటే చోద్యం చూసిన విసిపై వారు కన్నెర్ర చేశారు. ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా 70 రోజులుగా విద్యార్థుల సాగిస్తున్న పోరాటాన్ని సహించలేకే మోడీ ప్రభుత్వం ఈ విధమైన దాడులకు దిగుతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ దాడికి వ్యతిరేకంగా జెఎన్‌యు విద్యార్థులు భారీ మానవహారం నిర్వహించారు. జెఎన్‌యు అధ్యాపకుల సంఘం నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌, సిపి చంద్రశేఖర్‌, జయితీఘోష్‌ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. జెఎన్‌యుఎస్‌యు నేతృత్వంలో సబర్మతి దాబా నుంచి నార్త్‌ గేటు వరకు భారీ ర్యాలీ జరిగింది. వర్శిటీ మెయిన్‌ గేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐతోపాటు ఇతర విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. క్యాంపస్‌లో ఎబివిపి గూండాల దాడిలో 34 మందికి గాయాలయ్యాయని, నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్‌ విద్యార్థులు గొంతెత్తి నినదించారు. హింసాకాండను పలు రాజకీయ పార్టీల నేతలు, కార్మిక,యువజన, మహిళా సంఘాలు, సంసినీతారలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు వారికి సంఘీభావంగా నిలిచారు.

విసిని తక్షణమే తొలగించాలి : ఏచూరి
విద్యార్థులపై పాశవిక దాడికి కారణమైన జెఎన్‌యు వైస్‌ ఛాన్సలర్‌ మామిడాల జగదీష్‌ కుమార్‌ని తక్షణమే తొలగించాలి. దుండగులు మారణాయుధాలు పట్టుకొని వర్శిటీ మొత్తం తిరుగుతుంటే విసి స్పందించకపోవడం దారుణం.

పథకం ప్రకారం దాడి : ఐషీ
జెఎన్‌యుపై పథకం ప్రకారం దాడి జరిగింది. జెఎన్‌యు భద్రత, విధ్వంసాల మధ్య ఘర్షణ జరుగుతోది. గత నాలుగైదు రోజులుగా కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ ప్రొఫెసర్లు విద్యార్థి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి హింసను ప్రోత్సహిస్తున్నారన్నారు.

నాజీ పాలన : రాహుల్‌
విద్యార్థులు, అధ్యాపకులపై దాడి దిగ్భ్రాంతికరం. దేశాన్ని పాలిస్తున్న ఫాసిస్టు శక్తులు విద్యార్థుల నిరసన గళాలకు బెదిరిపోతున్నాయి. జెఎన్‌యుపై దాడి చేయడం వారి భయాన్ని ప్రతిబింబిస్తోంది. నాజీ పాలనను గుర్తుచేసింది.

Courtesy Prajashakthi