– ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అనుచిత వ్యాఖ్యలు
– ఆ సిరీస్‌లోనే మొదలైన రిచర్డ్‌ ఊచకోత

ఒకవైపు కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. మరోవైపు జాత్యహంకార మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సమాజంలో వ్యవస్థీకృతంగా వేళ్లూనుకుపోయిన వర్ణ వివక్ష పట్ల ప్రజలు, ఉద్యమకారులు, మానవతావాదులు వీధుల్లోకి నిరసన తెలుపుతున్నారు. వర్ణ వివక్షకు క్రీడా రంగం అతీతం కాదని క్రీడాకారులు తమ చేదు అనుభవాలతో ముందుకొస్తున్నారు. ఐపీఎల్‌లో వివక్ష చవిచూసిన డారెన్‌ సామీ తీవ్ర ఆవేదన లోనయ్యాడు. వెస్టిండీస్‌ క్రికెటర్ల పట్ల వర్ణ వివక్ష చూపటం ఇదే తొలిసారి కాదు. 1976 ఇంగ్లాండ్‌ పర్యటనలో కరీబియన్‌ జట్టును ఉద్దేశించి ఇంగ్లీష్‌ కెప్టెన్‌ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. జాత్యంహకార భావనలకు గుణ పాఠం చెప్పే క్రమంలోనే విండీస్‌ అరివీర భయంకర జట్టుగా నిలువటం విశేషం.

1976 జూన్‌ 1. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ ఐదు టెస్టుల సిరీస్‌ మరో రోజులో ఆరంభం. ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా తొలి టెస్టు ఆరంభానికి ముందు రోజది. హౌటల్‌ లాంజ్‌లో వెస్టిండీస్‌ జట్టు సేదతీరుతోంది. టెలివిజన్‌ ఆన్‌లో ఉంది. కానీ ఎవరూ టీవీ వైపు చూడటం లేదు. టీవీలో ఎవరో ఆఫ్‌ చేయబోతున్నారు.. ఇంతలో తెరపై ఫ్లాష్‌ న్యూస్‌. టీవీలో స్క్రోల్‌ అవుతున్న బ్రేకింగ్‌ న్యూస్‌ చూడటంతో అక్కడ నిశ్శబ్ధ వాతావరణం. ఇన్నేండ్ల తర్వాత విండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘ తొలి టెస్టులో జట్టు వ్యూహం చర్చించేందుకు అందరూ జట్టు సమావేశానికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఇంతలోనే టీవీలో బ్రేకింగ్‌ న్యూస్‌. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ టోనీ గ్రేగ్‌ మాట్లాడబోతున్నాడని యాంకర్‌ మాటలు. దీంతో అందరూ లాంజ్‌లో కుర్చీల్లోనే ఉండిపోయారు. టోనీ గ్రేగ్‌ ఏం చెప్పాడో తెలుసుకోవాలని అనుకున్నాం. టీవీ తెరపైకి టోనీ గ్రేగ్‌ వచ్చేశాడు’. ఆ మాటలు వెస్టిండీస్‌ క్రికెట్‌ స్వరూపాన్నే మార్చివేశాయి. దక్షిణాఫ్రికా నేపథ్యం నుంచి వచ్చిన టోనీ గ్రేగ్‌ ముఖ కవళికలు, మాటల్లో హేళనపరిచే వ్యంగ్యం అర్థం చేసుకునేందుకు రిచర్డ్స్‌ ప్రయత్నించాడు. ‘మా తెలివితో, ఇతర సహచరులతో కలిసి వారిని (వెస్టిండీస్‌) మా ముందు సాష్టాంగపడేలా (తమకు తాము బానిసలు, తక్కువ స్థాయి వాళ్లని భావించి అవతలి వ్యక్తుల ముందు సాష్టాంగపడిపోవటం) చేయబోతున్నాం. మీకు తెలుసా.. అదీ సంగతి’ టీవీలో టోనీ గ్రేగ్‌ వ్యాఖ్యలు. అప్పటికి (గ్రోవల్‌) జాత్యంహకార అర్థాన్ని ఇస్తుందనే విషయం రిచర్డ్స్‌కు తెలియదు. వెంటనే డిక్షనరీ అందుకున్నాడు, గ్రోవల్‌ పదాన్ని వెతికాడు. కానీ డిక్షనరీలో ఆ పదమే లేదు. జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లవైపు చూశాడు. అప్పటికి కానీ అర్ధం కాలేదు.. గ్రోవల్‌ ఏదో సీరియస్‌ అర్థాన్ని ఇస్తుందని!. ‘ అప్పుడు జట్టులో ఎవరి ముఖం చూసినా, ఎంతో చిన్నబోయాయి. గ్రేగ్‌ వ్యాఖ్యలకు క్రికెట్‌కు సంబంధించినది కాదు. అది మరీ వ్యక్తిగత భావాలను రేకెత్తించేది. దక్షిణాఫ్రికా (అధికారికంగానే జాతి వివక్ష పాటించిన చరిత్ర) నుంచి వచ్చిన గ్రెగ్‌ వ్యాఖ్యలు అగౌరవకరమని భావించాం. గ్రేగ్‌ వ్యాఖ్యలు ఎంతో బాధపెట్టాయి. టీవీ కట్టేసి.. అందరం జట్టు మీటింగ్‌కు వెళ్లాం. ఎవరూ ఒక్క మాట మాట్లాడలేదు. జట్టు సమావేశం ఉందా? అని ఎవరో కెప్టెన్‌ క్లైవ్‌ లాయిడ్‌ను అడిగారు. అందుకు లేదు, సమావేశం ముగిసింది అని క్లైవ్‌ అన్నాడు’ అని రిచర్డ్స్‌ తెలిపాడు.

సాగిలపడేలా చేశారు! : టోనీ గ్రేగ్‌ వ్యాఖ్యలు విండీస్‌ జట్టులో ప్రేరణకు దారితీశాయి. ప్రతి ఒక్కరూ జాత్యంహకారానికి తగిన బుద్ధి చెప్పాలని సంకల్పించుకున్నారు. యువ ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌లో ఇది మరింత కాంక్ష రేపింది. రస్తఫారి ఉద్యమ రంగులను పోలిన హ్యాండ్‌బ్యాండ్‌లను రిచర్డ్స్‌ ధరించాడు. ‘ ఆకుపచ్చ రంగు ఆఫ్రికా నేలకు ప్రతీక. బంగారు రంగు దోచుకెళ్లిన సంపదకు చిహ్నం. ఎరుపు చిందిన రక్తానికి చిహ్నం’ అని రిచర్డ్స్‌ ఫైర్‌ ఇన్‌ బాబిలోన్‌ డాక్యుమెంటరీలో వివరించాడు. టోనీ గ్రేగ్‌ వ్యాఖ్యలు వెస్టిండీస్‌ డ్రెస్సింగ్‌రూమ్‌ను ఆగ్రహావేశాలకు ప్రేరేపించాయి. జట్టులోని ప్రతి ఒక్కరి మాదిరిగానే రిచర్డ్స్‌ సైతం ఆ వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకున్నారు. ఇంగ్లాండ్‌ బౌలర్లను ఊచకోత కోశాడు, ఐదు టెస్టుల్లో 829 పరుగులు పిండుకున్నాడు. రెండు డబుల్‌ సెంచరీలు బాదాడు. అందులో రిచర్డ్స్‌ అత్యధిక స్కోరు 291 సైతం ఉంది. ప్రపంచ జట్ల బౌలర్లను ఉతికారేసేందుకు రిచర్డ్స్‌ వస్తున్నాడనే సంకేతం ఈ సిరీస్‌ నుంచే వెలువడింది. ‘ టోనీ గ్రేగ్‌ వ్యాఖ్యలకు అందరూ వ్యక్తిగతంగా మూల్యం చెల్లించేందుకు పూనుకున్నారు. మైదానంలో ఆ స్పందన స్పష్టంగా కనిపించింది. గ్రేగ్‌ బ్యాటింగ్‌కు రాగానే.. అతడికి ఫుల్‌ లెంగ్త్‌ బంతులతో బెంబేలెత్తించారు. నిజానికి ఆ సమయంలో ఆ సంఘటన దురదృష్టకరం. ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఇంగ్లాండ్‌ సహచరుల్లో స్ఫూర్తి నింపేందుకు బహుశా గ్రేగ్‌ చేసిన తప్పుడు ప్రయత్నం కావచ్చు’ అని రిచర్డ్స్‌ తెలిపారు. ఐదు టెస్టుల సిరీస్‌ను 3-0తో గెల్చుకున్న వెస్టిండీస్‌ ఇంగ్లీష్‌ జట్టును వారి గడ్డపైనే సాగిలపడేలా చేసింది.

ప్రజల్లో ఎనలేని చైతన్యం : 1960ల్లో స్వాతంత్య్రం పొందిన కరీబియన్‌ దేశాలు అప్పుడప్పుడే తమ ఉనికి తెలుసుకుంటున్నారు!. బ్లాక్‌ ప్రైడ్‌ అనే నూతన చైతన్యం ప్రజల్లో ప్రస్ఫుటించింది. ఇంగ్లాండ్‌లోని కరీబియన్‌ ప్రజలు గ్రేగ్‌ వ్యాఖ్యలను రాజకీయంగా తీసుకున్నారు. ‘ మనం వర్సెస్‌ వాళ్లు’ అనే నినాదం వినిపించింది. కరీబియన్‌ ప్రజలు క్రికెట్‌ మైదానాల్లోకి పోటేత్తారు. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ బౌండరీలు కొట్టగానే గ్రేగ్‌ వైపు చూస్తూ.. ‘సాష్టాంగపడ్డారు.. సాష్టాంగపడ్డారు’ అని అరిచారు. బ్రిటన్‌లో స్థిరపడిన జమైకా సంగీతకారుడు ‘ ఇప్పుడు ఎవరు సాష్టాంగపడ్డారు’ అనే పాటను విడుదల చేశారు. ఐదో టెస్టు వేదిక ఓవల్‌లో కరీబియన్‌ అభిమానుల గ్రోవల్‌ నినాదాలకు గ్రేగ్‌ స్పందించారు. వారివైపు చూస్తూ, ఓ చిరునవ్వు నవ్వారు. గ్రేగ్‌ వ్యాఖ్యల తర్వాత పరిణామాలు కరీబియన్‌ ప్రైడ్‌కు అద్దం పట్టాయి. మైదానంలో ఉన్నంతసేపు ఆ ఒక్క పదమే వినిపించింది. ‘ చివరకు నేను కూడా సాష్టాంగపడ్డాను. టోనీ గ్రేగ్‌ నన్ను 291 వద్ద అవుట్‌ చేశాడు. నేను డకౌట్‌ అయినంత ఆనందంతో గ్రేగ్‌ సంబరాలు చేసుకున్నాడు. నేను కూడా చింతించాను.. త్రి శతకం కోల్పోయానని కాదు, గ్రేగ్‌కు వికెట్‌ ఇచ్చానని’ అని రిచర్డ్స్‌ గుర్తు చేసుకున్నారు.

కాలగర్భంలో 44 ఏండ్లు గడిచిపోయాయి. రిచర్డ్స్‌ 70వ పడిలోకి వచ్చాడు. టోనీ గ్రేగ్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆ సంఘటన నుంచి ప్రపంచం ముందుకు సాగింది. కానీ జాతి వివక్ష ఇప్పటికీ అదే రీతిలో నిలిచింది. మనషులు అందరూ సమానమే అనే సృహ ఈ ప్రపంచానికి ఇంకెప్పుడు?!

Courtesy Nava Telangana