అపహాస్యమవుతున్న ట్రాఫిక్‌ నిబంధనలు
పట్టించుకోని వాహన చోదకులు

89,63,029 ఇది ఈ ఏడాదిలో ఇప్పటివరకూ రాష్ట్రంలో జరిగిన వాహన చోదకుల ఉల్లంఘన కేసుల సంఖ్య… వాహనచోదకులు ఎంత నిర్లక్ష్యంగా నడుపుతున్నారో ఈ సంఖ్యే చెబుతోంది.

60 ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య ఇది. ఇవి పోలీసుల దృష్టికి వచ్చినవి మాత్రమే.. కేసులు నమోదు కానివి ఇంకెన్నో…

18 ప్రమాదాల బారిన పడి రోజూ ప్రాణాలు కోల్పోతున్న వారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల తీవ్రతకు నిదర్శనం ఈ సంఖ్య.

హైదరాబాద్‌: కాలు బయటపెడితే క్షేమంగా ఇంటికి వస్తారని చెప్పలేని పరిస్థితి.. రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపడం.. ఇందులోనూ మితిమీరిన వేగంతో ప్రయాణించడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలే ప్రధాన కారణం. వాహనం ఎక్కితే చాలు తమకు ఏ నిబంధనా వర్తించదన్నట్లు చెలరేగిపోతున్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలోని రహదారి భద్రతా విభాగం తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మూడొంతుల వాహనాలు ఏదోవిధంగా ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నాయి. ప్రమాదాలు నివారించే ఉద్దేశంతో పోలీసు అధికారులు ట్రాఫిక్‌ పర్యవేక్షణ పెంచడంతో కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది.

ఇలా చేయాలి
ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడి పట్టుబడ్డా జరిమానా కట్టొచ్చులే అనే భరోసా ఉండేది. అందుకే ట్రాఫిక్‌ ఉల్లంఘనల గురించి పట్టించుకునేవారు కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే రాష్ట్ర ప్రభుత్వం పాయింట్ల విధానం అమలులోకి తెచ్చింది. నమోదైన ట్రాఫిక్‌ ఉల్లంఘనలను బట్టి లైసెన్సుదారుడికి పాయింట్లు కేటాయిస్తుంది. జరిమానా మొత్తం పెరగడంతో పాటు మరీ మితిమీరితే లైసెన్సు రద్దు చేయవచ్చు. సాంకేతిక కారణాల వల్ల ఇది సమర్థంగా అమలు కావడంలేదు. ఒక్కరే పదేపదే ఉల్లంఘనలకు పాల్పడటమే కాదు అసలు ట్రాఫిక్‌ నిబంధనలనే ఎవరూ లెక్కచేయడంలేదు. లెక్కచేసి ఉంటే ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడేవారే కాదు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు తగ్గించగలిగితే ప్రమాదాలను అదుపులోకి తేవచ్చు. ఇందుకోసం పాయింట్ల విధానాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి. పోలీసు, రవాణాశాఖల సర్వర్లను అనుసంధానం చేయాలి. ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మితిమీరిన వేగమే కారణం..
ఇటీవల హైదరాబాద్‌లోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన ప్రమాదం తెలంగాణయే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికించింది. పరిమితికి మించి 105 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పి ఫ్లైఓవర్‌ నుంచి కింద రోడ్డుపై పడటంతో ఓ మహిళ మరణించింది. మూడొంతుల రోడ్డు ప్రమాదాలకు మితిమీరిన వేగమే ప్రధాన కారణం. ఇలాంటి ఉల్లంఘనలు రోజుకు రాష్ట్రంలో 3వేల వరకూ జరుగుతున్నాయి. ఇదొక్కటే కాదు మద్యం తాగి వాహనం నడుపుతూ సగటున ఒక్క రాజధాని పరిధిలోనే రోజుకు 148 మంది పట్టుబడుతున్నారు. వీరి చేతిలో వాహనం ఎవరి ప్రాణాలు హరిస్తుందో చెప్పలేం. ఇక రాంగ్‌రూట్లో వెళ్లడం, లైసెన్సు లేకుండా వాహనం నడపడం.. ఇలా ఒకటేమిటి అసలు నిబంధనలు ఉన్నట్లు కూడా ఎవరూ గుర్తించడంలేదు.


ఈ ఏడాదిలో నవంబరు 25 వరకూ రాష్ట్రంలో నమోదైన కొన్ని ట్రాఫిక్‌ ఉల్లంఘనలు
ఇదేం దూకుడు?

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన కేసులు 48,272

Courtesy Eenadu…