హైదరాబాద్‌ : అది ఔట్‌సోర్సింగ్‌ పోస్టు. పర్మినెంట్‌ కాదు. భవిష్యత్‌లో అవుతుందనే నమ్మకం కూడా అంతంతే..! వచ్చే జీతం నెలకు రూ. 15 వేల లోపే..! అయినా.. ఆ జాబ్‌ రావాలంటే రూ. 8 లక్షలు సమర్పించుకోవాల్సిందే..! ఇదీ తెలంగాణ రాష్ట్ర వేర్‌హౌస్‌ కార్పొరేషన్‌లో సాగుతోన్న దందా. సిబ్బంది కొరత సాకుతో చేపట్టిన ఈ నియామకాల్లో ప్రతిభకు పట్టం కట్టకుండా.. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే.. వారికే పోస్టింగ్‌ అన్నట్లుగా కొందరు అధికారులు ఔట్‌సోర్సింగ్‌ పోస్టులను అమ్మకానికి పెట్టారు. ఈ సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌ మొదలు.. మేనేజరు స్థాయి వరకు పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని నెలలుగా పదవీ విరమణలే తప్ప.. కొత్త నియామకాలు జరగడం లేదు. గోదాముల సామర్థ్యం రోజురోజుకూ పెరుగుతుండడం.. 22 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాముల నిర్వహణకు ఉన్న సిబ్బంది సరిపోకపోవడం వంటి కారణాలతో.. ఔట్‌సోర్సింగ్‌ అనివార్యమైంది.

ఇటీవల నిజామాబాద్‌ జిల్లాలో ఔట్‌సోర్సింగ్‌పై నియామకమైన ఓ నిరుద్యోగి నుంచి ఉన్నతాధికారి ఒకరు రూ. 8 లక్షలు వసూలు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అర్హతలున్న ఆశావహులు కొందరు విజిలెన్స్‌ విభాగానికి ఫిర్యాదు చేయడంతో.. ఈ దందా బయటపడింది. ఈ సంస్థ గోదాముల్లో 2016 నుంచి 11 మందిని కాంట్రాక్టు పద్ధతిలో.. మరో 399 మందిని ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమించుకున్నారు. ఇలా నియామకాలు చేపట్టడంలో విమర్శలు రాకపోవడం.. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందనే అభిప్రాయాలు ఉండడంతో.. కొందరు అక్రమార్కులు నియామక ప్రక్రియను దందాగా మార్చేశారు. లక్షలు సమర్పించుకున్న వారికే ఉద్యోగం అన్నట్లుగా పరిస్థితులను మార్చేశారు. గత నియామకాల్లో కూడా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. నాలుగేళ్ల క్రితం పోస్టుకు రూ. లక్ష చొప్పున వసూలు చేయగా.. ఆ తర్వాత ఔట్‌సోర్సింగ్‌ కొలువు ధర రూ. 2 లక్షలు, రూ. 5లక్షలు.. ఇలా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం తాజా నియామకాల్లో ఒక్కో పోస్టుకు రూ. 8 లక్షలుగా అక్రమార్కులు నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందడంతో.. అధికారులు నిఘా పెట్టినట్లు తెలిసింది.

Courtesy Andhrajyothi