• కానీ తాజా కేసులతో అప్రమత్తం కావాలి
  • యశోద ఆస్పత్రి సీనియర్‌ వైద్యుడు ఎంవీ రావు

 ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య అపరిమితంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది! ఏ వస్తువు తాకితే వైరస్‌ సంక్రమిస్తుందో.. ఏ వ్యక్తిలో వైరస్‌ దాగి ఉందో అనే భయం ప్రతి ఒక్కరిలో!! ఈ తరుణంలో ఎలా వ్యవహరించాలి? కరోనా నుంచి ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యశోద ఆస్పత్రి సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎమ్‌.వి.రావు పలు సూచనలు చేశారు. 

 ‘‘ఒక వ్యక్తి ద్వారా పది మందికి వ్యాధి వస్తే ఆర్‌ 10 అంటారు. కరోనా విషయంలో వైరస్‌ సంక్రమించే తీవ్రత ‘ఆర్‌ -3’ నుంచి ‘ఆర్‌-5’ దాకా ఉంది.’’ అని ఎంవీ రావు తెలిపారు. కరోనా నేపథ్యంలో  ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

జనసాంద్రతను బట్టి, కరోనా సోకిన ఒక వ్యక్తి ద్వారా ఆ వైరస్‌ ముగ్గురి నుంచి ఐదుగురికి సోకుతోంది. అలాగే ఏ అంటువ్యాధి అయినా తొలుత లక్షణాల రూపంలో బయల్పడిన తర్వాతే, ఇతరులకు సోకుతుంది. అంటే, అప్పటికే ఆ వ్యక్తి శరీరంలో వ్యాధి ప్రబలడానికి సరిపడే స్థాయికి వైరల్‌ లోడ్‌ చేరుకుని ఉంటుంది. కానీ కరోనా విషయంలో లక్షణాలు బయల్పడే లోపే, వైరల్‌ లోడ్‌ ఇతరులకు సోకే స్థాయికి చేరుకుంటోంది. ఫలితంగా 14 రోజుల ఇంక్యుబేషన్‌ పీరియడ్‌లోనే.. వైరస్‌ సోకిన వ్యక్తికి తెలియకుండానే.. ఎంతోమందికి ఈ వైరస్‌ సోకుతోంది. వారి ద్వారా ఇంకొందరికి వైరస్‌ సోకుతోంది.

అందుకే వారికి ఆ దుస్థితి..
వేరే దేశాల్లో ఉండగా కరోనా సోకి, ఆ తర్వాత దేశంలోకి అడుగుపెట్టిన వ్యక్తులకే ఈ వ్యాధి పరిమితమై ఉంటే, ఆ దశను ఫేజ్‌-1 అనాలి. వారికి దగ్గరగా మెలిగే కుటుంబసభ్యులకూ వైరస్‌ సోకితే ఆ దశ… ఫేజ్‌-2. ఈ రెండు దశలకు భిన్నంగా ఫేజ్‌-1, ఫేజ్‌-2 వ్యక్తులతో నేరుగా సంబంధం లేకుండా సామాజిక సంక్రమణ(కమ్యూనిటీ స్ర్పెడ్‌)లో భాగంగా వ్యాధి సోకితే ఆ దశను ఫేజ్‌-3గా పరిగణించాలి. ప్రస్తుతం చాలా దేశాలు ఫేజ్‌-3లో ఉన్నాయి. ఫేజ్‌-2లో మేలుకోకపోవడం వల్లనే ఆయా దేశాలకు ఈ దుస్థితి. మనదేశంలో, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పాటిస్తూ ఇతరత్రా రక్షణచర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఫేజ్‌-3 వచ్చే అవకాశాలు తక్కువే. కానీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన నిజాముద్దీన్‌ యాత్రికుల్లో చాలామందికి వైరస్‌ పాజిటివ్‌ వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వాళ్లు నిజాముద్దీన్‌లో కలిసిన వ్యక్తుల నుంచి నేరుగా వైరస్‌ బారిన పడ్డారా? లేక వాళ్ల నుంచి ఇతరులకు, ఇతరుల ద్వారా వీరికి వైరస్‌ సోకిందా? అనే విషయం ఆధారంగా మనం ఫేజ్‌ -3కి చేరుకున్నామా లేదా నిర్ణయించవచ్చు.

వైద్యుల పట్ల అనుమానపు చూపు వద్దు!
కరోనా వైరస్‌ ప్రబలిన తొలినాళ్లలో చైనాలో చాలామంది వైద్యులు దానిపై తగిన అవగాహన లేక మాస్కులు ధరించలేదు. దీంతో అక్కడ కొందరు వైద్యులు ఆ వైర్‌సకు బలయ్యారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా పట్ల వైద్యులకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టే ఆస్పత్రుల్లో నెగెటివ్‌ చాంబర్లు ఏర్పాటు చేసుకుని.. రోగి నుంచి వైరస్‌ సోకకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రక్షణ దుస్తులు, మాస్కులు ధరిస్తున్నారు. వారి ద్వారా ఇతరులకు వైరస్‌ సోకే వీలు లేదు. తమను తాము ఎలా రక్షించుకోవాలో వైద్యులకు తెలుసు. కరోనా రోగి ప్రాణాలను కాపాడిన వైద్యులను ఆకాశానికి ఎత్తేసే ప్రజలే.. వారి నుంచి తమకు వ్యాధి సోకుతుందనే భయంతో వారిని దూరం నెట్టేయడం సరికాదు. వైద్యులను, వైద్య సిబ్బందినీ అంటరానివారిగా చూడొద్దు.

కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. అలాగే.. విదేశాల నుంచి వచ్చి.. దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలున్నవారు, వారి కుటుంబసభ్యులు కూడా తప్పక ధరించాలి. ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, ఆయాలు, వార్డుబాయ్స్‌, టెక్నీషియన్లు సాధారణ సర్జికల్‌ మాస్క్‌లు ధరిస్తే సరిపోతుంది. కరోనా బాధితులకు చికిత్స చేసే వైద్యులు, వారిని ఉంచిన వార్డుల్లో సంచరించే సిబ్బంది మాత్రం ఎన్‌-95 మాస్క్‌లు, పి.పి.ఇ (పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్వి్‌పమెంట్‌-హజ్మత్‌ సూట్‌లాంటివి) ధరించవలసి ఉంటుంది. విధినిర్వహణ రీత్యా బయట తిరిగే పోలీసు, మీడియా, పారిశుధ్య సిబ్బంది కూడా మాస్కులను వాడాలి. మిగతా వారు, ఇంటిపట్టున ఉన్న ప్రజలు మాస్క్‌లు ధరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మాస్క్‌ల వాడకం మొదలుపెడితే.. నిజంగా వాటి అవసరం ఉన్న వ్యక్తులకు మాస్క్‌ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఐసీఎంఆర్‌, కేంద్ర ఆరోగ్య శాఖ, తెలంగాణ సర్కారు సైతం.. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు పెట్టుకోవాలని ఎప్పుడూ సూచించలేదు. – నవ్య డెస్క్‌

మరణాలు తక్కువే
కరోనా మాదిరిగానే భయపెట్టిన పలు అంటువ్యాధులకు సమర్థమైన చికిత్సలను కనుగొన్నాం. స్వైన్‌ ఫ్లూను కూడా సమర్థంగా ఎదుర్కొన్నాం. అయితే కరోనా ఇందుకు పూర్తి విరుద్ధం. దీని లక్షణాలు బయల్పడేలోపే ఇతరులకు సోకడం, ఒకేసారి ఎక్కువ మందికి ప్రబలడం లాంటివన్నీ భయం కలిగిస్తున్నాయి. నిజానికి కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నా.. మరణాల శాతం తక్కువ అనే విషయం గమనించాలి. వైరస్‌ సోకినవారిలో మరణిస్తున్నవారు కేవలం 3 శాతం మాత్రమే.

అవగాహనతోనే భయం పోతుంది
కరోనా వైరస్‌ ఎలా సోకుతుందో తెలుసుకుంటే, ఆ వ్యాధి పట్ల నెలకొన్న అనవసర భయాలు వీడిపోతాయి. కరోనా వైరస్‌ ప్రధానంగా రెండు మార్గాల్లో సోకుతుంది. వ్యాధి ఉన్న వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల నుంచి ఆ వైరస్‌ పరుచుకున్న ప్రదేశాలను, వస్తువులను తాకడం ద్వారా వైరస్‌ వ్యాపిస్తుంది. ఆ తుంపర్ల ద్వారా దగ్గర్లోని వస్తువుల ఉపరితలాల మీదకు వైరస్‌ చేరుకుంటుంది. ఆ ఉపరితలాలు… తలుపు గడియ, లిఫ్ట్‌ బటన్‌, పెన్ను, మొబైల్‌ ఫోన్‌, పాల ప్యాకెట్‌.. ఇలా ఏదైనా కావచ్చు. స్టీలు, గాజు, ప్లాస్టిక్‌ల మీద ఈ వైరస్‌ దాదాపు 3 నుంచి 4 రోజులు సజీవంగా ఉంటుంది. రాగి మీద సుమారు 4 గంటలు మాత్రమే సజీవంగా ఉండగలుగుతుంది. కాబట్టి ఏ వస్తువును తాకినా చేతులు శుభ్రం చేసుకోక తప్పదు. అలాగే దైనందిన జీవితంలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అవేంటంటే..

  • పాల ప్యాకెట్‌ను మొదట సబ్బుతో రుద్ది, నీటి ధార కింద ఉంచి శుభ్రం చేసిన తర్వాతే వాడాలి.
  • కూరగాయలు, పళ్లను గోరువెచ్చని నీటితో కడిగిన తర్వాతే తరగాలి.
  • తరచుగా చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
  • కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకడం మానుకోవాలి.

 Courtesy Andhrajyothi