గుర్తించిన వారిలో సగం మందికి రక్షిత గృహాల్లోనే ఆశ్రయం
ఇప్పటివరకు దొరికిన 32 వేల మందిలో 16 వేలకు పైగా వీరే..

తప్పిపోయిన చిన్నారుల్ని గుర్తించడంతో పాటు పనిస్థలాల నుంచి బాలకార్మికులకు విముక్తి కలిగించి తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు ఉద్దేశించిన కార్యక్రమాల వల్ల ఫలితం ఆశించిన స్థాయిలో ఉండటంలేదు. దేశవ్యాప్తంగా ఏటా జనవరి, జులైల్లో  ‘ఆపరేషన్‌ స్మైల్‌’, ‘ఆపరేషన్‌ ముస్కాన్‌కార్యక్రమాలను ప్రత్యేక బృందాలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో గుర్తిస్తున్న చిన్నారులకు సంబంధించి సరైన వివరాలు లేక సగం మంది రక్షిత గృహాల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది.

రాష్ట్రంలో పనిస్థలాల నుంచి విముక్తి పొందుతున్న బాలకార్మికుల్లో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. బాలకార్మికుల్ని సరఫరా చేసేందుకు కొందరు గుత్తేదారులు రంగంలోకి దిగుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని చిన్నారుల్ని రైళ్లలో రహస్యంగా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇలాంటి చిన్నారులతో కొందరు పరిశ్రమల యజమానులు పనులు చేయిస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో పిల్లల్ని అపహరించే ముఠాల వారు యాచకులకు వారిని విక్రయిస్తున్నారు. ప్రత్యేక బృందాల తనిఖీల సందర్భంగా పలువురు చిన్నారుల్ని గుర్తిస్తున్నా చాలా మంది కుటుంబసభ్యుల వివరాలు తెలియకుండా పోతున్నాయి. అలాంటి వారిని రక్షిత గృహాల్లోనే ఉంచాల్సి వస్తోంది. అనంతరం కొందరు చిన్నారుల చిరునామాల్ని గుర్తించి కుటుంబసభ్యుల చెంతకు చేరుస్తున్నా.. ఆ శాతం కొంత మాత్రమే ఉంటోంది.

అక్రమ రవాణా ఎక్కడి నుంచి?
బిహార్‌, పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌  ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌.. తదితర రాష్ట్రాల నుంచి..

ఎక్కడికి తరలిస్తున్నారంటే?
హైదరాబాద్‌ పాతబస్తీలో గాజుల పరిశ్రమల నిర్వాహకులు, కాటేదాన్‌, బాలాపూర్‌ ప్రాంతాల్లో బిస్కట్‌ తదితర పరిశ్రమలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇటుక బట్టీలు నిర్వహించే యజమానులకు అప్పగిస్తున్నారు.

ఎవరు చేస్తున్నారు?
ఇందుకోసం కొన్ని వ్యవస్థీకృత ముఠాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. తెలంగాణలోని కొందరు గుత్తేదారులు ఇతర రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించుకున్నారు. ఒక్కో బాలుడిని పంపించినందుకు కమీషన్‌ ఇస్తున్నారు.

చిన్నారులే ఎందుకంటే?
తక్కువ వేతనానికి పనిచేస్తారనేది ప్రధాన కారణం. ఇతర రాష్ట్రాల్లోని పేద కుటుంబాల ఆర్థిక స్థితిని ఆసరాగా చేసుకొని చిన్నారుల్ని తీసుకొస్తున్నారు. ఒక్కో బాలుడి పేరిట ఏడాదికి రూ.8 వేల నుంచి 20 వేల రూపాయల వరకు కుటుంబసభ్యులకు ఇస్తున్నారు.

దర్పణ్‌కూ చిక్కని చిరునామాలు
ఆపరేషన్ల సందర్భంగా తనిఖీ బృందాలు చిన్నారుల ఆచూకీ కనుగొనేందుకు ‘దర్పణ్‌’ యాప్‌ సహకారం తీసుకుంటున్నారు. ఈ యాప్‌లో దేశవ్యాప్తంగా చిన్నారుల అదృశ్యం ఘటనల్లో నమోదైన కేసులకు సంబంధించి డేటాబేస్‌ నిక్షిప్తమై ఉంటుంది. ఎవరైనా బాలుడిని గుర్తిస్తే వెంటనే అతడి ఫొటోను తీసి తమ వద్ద ఉండే ట్యాబ్‌ల్లో యాప్‌ డేటాబేస్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఒకవేళ ఆ చిన్నారి అదృశ్యంపై కేసు నమోదై ఉంటే కనుక వెంటనే గుర్తించే పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఈ యాప్‌ ద్వారా చిన్నారుల చిరునామాలు తెలుస్తున్న ఉదంతాలు వేళ్లపై లెక్కపెట్టగలిగే స్థాయిలోనే ఉంటున్నాయి. ఇప్పటివరకు 40 లోపు ఉదంతాల్లో మాత్రమే ఇలా గుర్తించగలిగారు.

రేపటి నుంచి ఆరో దశ
తప్పిపోయిన పిల్లల్ని గుర్తించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ స్మైల్‌’ ఆరోదశ కార్యక్రమం వచ్చే జనవరి ఒకటి నుంచి నెలంతా చేపడుతున్నట్లు డీజీపీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పోలీసుశాఖతో పాటు మహిళా శిశుసంక్షేమ, కార్మిక, వైద్య, విద్యా, రెవెన్యూ, క్రీడాశాఖలతో పాటు స్వచ్ఛంద సేవాసంస్థలు, బాలల సంరక్షణ కమిటీలు ఇందులో భాగస్వాములవుతాయని వివరించారు.

(Courtesy Eenadu)