వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా నిజాముద్దీన్‌!
ఆధ్యాత్మిక సమావేశాలకు వేల సంఖ్యలో హాజరు
19 రాష్ట్రాలు, 16 దేశాల నుంచి ప్రతినిధులు
కరోనా పాజిటివ్‌లలో ఢిల్లీ కనెక్షన్‌
హాజరైన వారి పేర్లు రాష్ట్రాలకు పంపిన కేంద్రం
అందరినీ గుర్తించి క్వారంటైన్‌కు పంపే ప్రక్రియ
కొన్ని ప్రాంతాలు సహకరించడం లేదు
అందుకే కరోనా కేసులు భారీగా పెరిగాయి
కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి అగర్వాల్‌
ఆంక్షలను ఉల్లంఘించలేదు: మర్కజ్‌ ప్రకటన

తెలంగాణలో 15..
ఆంధ్రప్రదేశ్‌లో 33..
తమిళనాడులో 45..
ఢిల్లీలో 24..

ఇవన్నీ మంగళవారం వివిధ రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసులు. వీరంతా మర్కజ్‌కు వెళ్లిన వారే. ఇక్కడ మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందుకు కారణం వేల సంఖ్యలో మర్కజ్‌కు వెళ్లడమే. అందుకే అక్కడికి వెళ్లిన అందరినీ గుర్తించే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడ్డాయి. 

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తికి ఢిల్లీలోని ‘నిజాముద్దీన్‌’ ప్రధాన కేంద్రంగా మారినట్లు గుర్తించారు. మార్చి 1వ తేదీ నుంచి అక్కడ జరిగిన సమావేశాల్లో 19 రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొన్నారు. 16 దేశాల నుంచి మత పెద్దలు హాజరయ్యారు. వీరిలో… కరోనా తీవ్రంగా ప్రబలిన దేశాలకు చెందిన వారూ ఉన్నారు. తబ్లీగ్‌-ఎ-జమాత్‌ అనే సంస్థ నిర్వహించిన ఈ సమావేశాలకు బృందాలుగా ప్రయాణించి, బృందాలుగానే బస చేసిన వారిలో అనేక మందికి కరోనా ‘పాజిటివ్‌’గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత వీరంతా తమ  సొంత ప్రాంతాలకు వెళ్లారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారిలో కొందరు ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహిస్తూ మరికొన్ని ప్రాంతాల్లో తిరిగారు. ఇలా ఢిల్లీలో మొదలైన ‘వైరస్‌’ దేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్ర, అసోం, మణిపూర్‌, కశ్మీర్‌ తదితర రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ సోకిన వారికి ‘ఢిల్లీ కనెక్షన్‌’ బయటపడింది. తాజాగా అండమాన్‌కు చెందిన తొమ్మిది మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. వీరు రెండు విమానాల్లో ఢిల్లీ నుంచి అండమాన్‌కు వచ్చారు. దీంతో ఆ విమానాల్లో ప్రయాణించిన వారిని కూడా గుర్తించి… మొత్తం 1800 మందిని క్వారంటైన్‌కు పంపించారు.

తమిళనాడులో ఒకేరోజు 57 పాజిటివ్‌ కేసులు బయటపడగా, వీరిలో 45 మంది మర్కజ్‌ సమావేశాలకు హాజరైన వారే కావడం గమనార్హం. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 97కు చేరుకోగా… ఇందులో 24 మర్కజ్‌ సమావేశాల్లో పాల్గొన్న వారేనని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఇదే సమావేశాల్లో పాల్గొన్న ఇండొనేషియా వాసుల్లో 10 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీరు ఢిల్లీ నుంచి రైలులో తెలంగాణకు వచ్చి కరీంనగర్‌లో పర్యటించారు. తాజాగా అన్ని రాష్ట్రాల్లో నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాల్లో పాల్గొన్న వారిని, వారితో సన్నిహితంగా మెలిగిన వారినీ గుర్తించి పరీక్షలు నిర్వహించే పనిలో పడ్డారు. మార్చి 1 నుంచి మర్కజ్‌ సమావేశాల్లో పాల్గొన్న వారందరి వివరాలను కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపింది. వారిని గుర్తించి వెంటనే క్వారంటైన్‌కు తరలించాలని ఆదేశించింది. అలాగే, సుమారు  2 వేల మంది విదేశీ జమాత్‌ కార్యకర్తలను వారి వారి దేశాలకు పంపించేయాలని నిర్ణయించింది. దీనిపై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు లేఖలు రాసింది.  వివిధ రాష్ట్రాల నుంచి మర్కజ్‌కు హాజరైన వారిలో ఇప్పటికి 2137 మందిని క్వారంటైన్‌కు పంపించారు.

ఉల్లంఘన క్రమమిది…
దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ముందు నుంచే  ఢిల్లీలో సామూహికంగా గుమికూడటంపై ఆంక్షలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ కూడా అమలులోకి వచ్చింది. 50 మందికి మించిన సభలు, సమావేశాలు, మతపరమైన ప్రార్థనలు జరపడానికి వీల్లేదని మార్చి16న కేజ్రీవాల్‌ ఆంక్షలు విఽధించారు. అయితే. మర్కజ్‌లో అంతకుముందే మొదలైన సమావేశాలు యథాతథంగా కొనసాగాయి. మార్చి 22న ‘జనతా కర్ఫ్యూ’ ప్రకటించిన తర్వాత కూడా మర్కజ్‌లో దాదాపు 2వేల మంది ఉన్నారు. 23న 1500 మంది ఖాళీ చేశారు. 25వ తేదీ నుంచి మూడు వారాల లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. ఆ సమయానికి దాదాపు వెయ్యి మంది మర్కజ్‌లో బృందాలుగా బస చేసినట్లు గుర్తించారు. చివరికి… ఆదివారం రాత్రి రాష్ట్ర,కేంద్ర బలగాలు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అక్కడున్న వారిని ఆస్పత్రులకు, క్వారంటైన్‌కు తరలించాయి. ఈనేపథ్యంలో తబ్లీగ్‌-ఏ-జమాత్‌కు చెందిన మౌలానా సాద్‌తోపాటు ఇతర సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.  పర్యాటక వీసాలపై భారత్‌కు వచ్చి మత కార్యక్రమాల్లో పాల్గొన్న 300 మంది విదేశీయులను ‘బ్లాక్‌ లిస్టు’లో పెడతామని హోంశాఖ ప్రకటించింది.

ఏ దేశం నుంచి ఎందరు?
నేపాల్‌ (19), మలేషియా (20), మయన్మార్‌ (33), కిర్గిస్థాన్‌ (28), ఇండొనేషియా (72), థాయ్‌లాండ్‌ (71), శ్రీలంక (34), బంగ్లాదేశ్‌ (19), ఇంగ్లండ్‌ (4), ఫిజీ (4)తోపాటు ఫ్రాన్స్‌, అల్జీరియా, దిబౌటీ, సింగపూర్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాలకు హాజరయ్యారు.

ఆంక్షలను ఉల్లంఘించలేదు: మర్కజ్‌
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలను తాము ఉల్లంఘించలేదని మర్కజ్‌ నిజాముద్దీన్‌ తెలిపింది. ‘‘మర్కజ్‌ సమావేశాల తేదీలు ఏడాది ముందుగానే ఖరారవుతాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ గురించి ప్రధాని ప్రకటించగానే… సమావేశాలను నిలిపివేశాం. కర్ఫ్యూ ముగియకముందే… ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ఇక్కడికి వచ్చిన వారు తిరిగి వెళ్లే మార్గం కనిపించలేదు. అప్పటికీ, ఈనెల 23న సుమారు 1500 మంది తిరుగు ప్రయాణమయ్యారు. మిగిలిన వారిని ఖాళీ చేయించాలని అధికారులు మార్చి 24న నోటీసులు ఇచ్చారు. వాహనాలకు పాస్‌లు ఇస్తే మిగిలిన వారిని స్వస్థలాలకు పంపిస్తామని అదే రోజున చెప్పాం. కానీ సమాధానం రాలేదు’’ అని మర్కజ్‌ పేర్కొంది.

ఏమిటీ మర్కజ్‌
ఇస్లాం మత సిద్ధాంతాలను, ప్రవచనాలను ప్రచారం చేసే సంస్థ తబ్లీగ్‌ జమాత్‌! దీనికి అనుబంధంగా ఎక్కడికక్కడ ‘జమాత్‌’లు ఉంటాయి. ఇందులో 10 నుంచి 15 మంది సభ్యులు ఉంటారు. తమకు వీలైనంత మేరకు ఇరుగు పొరుగు గ్రామాలు, పక్క జిల్లాలకు కూడా వెళ్లి స్థానిక ముస్లింలను కలిసి ఇస్లాం సూత్రాలను వివరించి, వాటిని పాటించాలని కోరుతుంటారు.  తబ్లీగ్‌ జమాత్‌ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని పశ్చిమ నిజాముద్దీన్‌లో ఉంది. దీనినే… ‘నిజాముద్దీన్‌ మర్కజ్‌’ అంటారు. దాదాపు వందేళ్లుగా ఈ సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడ ఆధ్యాత్మిక సమావేశాలు జరుగుతాయి. దేశ విదేశాలకు చెందిన ముస్లింలు ఈ సదస్సులకు హాజరవుతుంటారు.

Courtesy Andhrajyothi