* 70 మంది విద్యార్థినులకు అస్వస్థత
* రహస్యంగా ఆస్పత్రిలో చికిత్స
* తల్లిదండ్రుల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి
పిఎం పాలెం, విశాఖ:
పురుగుల అన్నం తిని విశాఖ నగరంలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల హాస్టల్‌ విద్యార్థినులు 70 మంది అస్వస్థతకు గురయ్యాయి. గురువారం జరిగిన ఈ సంఘటనను యాజమాన్యం రహస్యంగా ఉంచింది. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించి వైద్యమందించింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు కళాశాల హాస్టల్‌ వద్ద శుక్రవారం ఆందోళనకు దిగడంతో వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కథనం ప్రకారం… జివిఎంసి నాలుగో వార్డు పరిధి కొమ్మాది డబుల్‌ రోడ్డు సమీపంలో ఉన్న శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల, గర్ల్స్‌ రెసిడెన్షియల్‌ క్యాంపస్‌ మైత్రి భవన్‌లో ఉంటున్న విద్యార్థినులకు నాణ్యతా లోపమైన ఆహారాన్ని (పురుగులు పట్టిన) పెడుతున్నారు. దీంతో, గత పది రోజులుగా విద్యార్థినులు రోజురోజుకీ నీరసానికి గురవుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ తారకేశ్వరి దృష్టికి విద్యార్థినులు తీసుకువెళ్లారు. ఆమె సమస్యను పరిష్కరించకపోగా విద్యార్థినులను తీవ్రంగా మందలించారు. దీంతో, విద్యార్థినులు అదే అన్నాన్ని తింటున్నారు. గురువారం రాత్రి కూడా పురుగులు అన్నం పెట్డడంతో ఆ అన్నం తిన్న సుమారు 70 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి వారిని తరలించి చికిత్స అందజేసింది. విద్యార్థినులు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చి నిర్వాహకులను నిలదీశారు. యాజమాన్యం వైఖరిని నిరసనగా ఆందోళన చేపట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించారు.

హాస్టల్‌ను సందర్శించిన చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం ప్రెసిడెంట్‌
చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం ప్రెసిడెంట్‌ బొడ్డేపల్లి సురేష్‌ ఈ హాస్టల్‌ను సందర్శించారు. శ్రీచైతన్య క్యాంపస్‌ ప్రిన్సిపల్‌ భానుశ్రీతో చర్చించారు. విద్యార్థినులను ఈ క్యాంపస్‌ నుంచి శ్రావణి క్యాంపస్‌కు షిఫ్ట్‌ చేసేందుకు రాతపూర్వకంగా హామీ తీసుకున్నారు. కళాశాల ఎఒ తారకేశ్వరిని సంస్థ నుంచి తొలగించామని, మెస్‌ ఇంఛార్జి రమేష్‌పై తగు చర్యలు తీసుకునేందుకు ప్రిన్సిపల్‌ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు.

Courtesy Prajashakthi…