– రైతుల్ని విసిగించిన పీఎం కిసాన్‌ పథకం
– నగదు సాయం అందుకున్నవారు 25శాతం లోపే
– 14.5కోట్లమందికి ఇస్తామని చెప్పి…3.85కోట్లమందికి సాయం
– కేటాయించిన నిధుల్లో సగమే వ్యయం

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు (2019)కు కొద్ది నెలల ముందు మోడీ సర్కార్‌ అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన (ఫిబ్రవరి, 2019లో) పథకం ‘పీఎం కిసాన్‌’. ఈ పథకం అమల్లోకి వచ్చి ఏడాది దాటుతోంది. ఈ సందర్భంగా రైతులకు ఏమేరకు లబ్దిచేకూరిందన్న లెక్కలు తీస్తే…గణాంకాలు నిరాశజనకంగా ఉన్నాయి. కేటాయించిన నిధుల్లో సగం కూడా కేంద్రం వ్యయం చేయలేదని, ప్రతి 10మంది రైతుల్లో ముగ్గురు మాత్రమే పూర్తి నగదు సాయం అందుకున్నారని లెక్కతేలింది. ఈ గణాంకాల్ని స్వయంగా మోడీ సర్కారే పార్లమెంట్‌కు ఇవ్వగా, సమాచార హక్కు కార్యకర్త ఒకరు ఆ గణాంకాల్ని తాజాగా సేకరించి మీడియాకు విడుదల చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి…

  • 1 డిసెంబరు 2018 నుంచి 30 నవంబరు 2019 నాటికి ‘పీఎం కిసాన్‌’ పథకం అమలులో మొదటి ఏడాది పూర్తయింది. ఈ పథకం అమలుకు కేటాయించిన నిధుల్లో కేవలం 41శాతం మాత్రమే వ్యయం చేశారు. తద్వారా మూడు వాయిదాల్లో రూ.6వేలు నగదు సాయాన్ని 25శాతం మంది రైతులు మాత్రమే అందుకోగలిగారు. ప్రతి 10 మంది లబ్దిదారుల్లో కేవలం ముగ్గురు మాత్రమే నగదు సాయాన్ని పొందగలిగారు.

48శాతం మందికి ఉత్తచేతులు
ఈ పథకం ద్వారా 14.5కోట్లమంది రైతులు నగదు సాయం పొందుతారని కేంద్రం అంచనావేసింది. 9కోట్లమంది రైతుల్ని లబ్దిదారులుగా గుర్తించారు. మార్చి 2019కల్లా మొదటి వాయిదా(సార్వత్రిక ఎన్నికల సమయంలో) రూ.2వేలు విడుదల చేశారు. మొదటి వాయిదాను 52శాతం మంది, రెండో వాయిదా 44.82శాతం మంది అందుకోగా, పూర్తిగా మూడు వాయిదాలు (రూ.6వేలు) అందుకున్నవారు కేవలం 26శాతమేనని తేలింది. 2019 సార్వత్రిక ఎన్నికలు జూన్‌లో జరుగుతున్నాయనగా, ఆలోపే దేశవ్యాప్తంగా 5కోట్లకుపైగా రైతులను లబ్దిదారులుగా చేర్చారు. ఇక ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు.

ఆధార్‌ పక్కకు..ఎందుకు?
సార్వత్రిక ఎన్నికల కోసం లబ్దిదారుల ఆధార్‌ వెరిఫికేషన్‌ను పక్కకు పెట్టి మొదటి వాయిదా రూ.2వేలు అందజేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక, రెండు, మూడు వాయిదాలకు ఆధార్‌ వెరిఫికేషన్‌ను ‘తప్పనిసరి’ చేశారు. దాంతో లబ్దిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు యూపీ, కర్నాటక, మహారాష్ట్రలలో రైతులు పెద్ద సంఖ్యలో దరఖాస్తుచేసుకోగా వారి పేర్లు లబ్దిదారుల జాబితాలో చేరలేదు.

  • 2018-19, 2019-20 బడ్జెట్‌లో మొత్తం కేటాయింపులు రూ.95వేల కోట్లు కాగా, నవంబరు 2019నాటికి (ఏడాది పూర్తయ్యేనాటికి) రూ.36వేల కోట్లు ఖర్చు చేశామని కేంద్రమే చెబుతున్నది.
  • డిసెంబరు 2019-మార్చి 2020 (నాలుగో వాయిదా కలుపుకొని) నాటికి అయిన వ్యయం రూ.48వేల కోట్లు.
  • సార్వత్రిక ఎన్నికలకు ముందు చూపిన ఆతృత, ఆ తర్వాత పాలకుల్లో తగ్గింది. పథకాన్ని మరింతగా విస్తరించి రైతులకు లబ్దిచేకూర్చాలన్న ఆలోచన కనపడటం లేదని గణాంకాలు చెబుతున్నాయి.

Courtesy Nava Telangana