180 పత్రికలకు 5 మాత్రమే..!
జమ్ముకాశ్మీర్‌లో ఆంక్షల నేపథ్యంలో పలు పత్రికల నిలిపివేత

ర్టికల్‌ 370 రద్దు, జమ్ముకాశ్మీర్‌ను రెండుగా విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పలురకాల ఆంక్షలను విధించారు.. ఇది ఎంతలా అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై వార్తలు అందించేందుకు జర్నలిస్టులకు తగిన సమాచారం కూడా అందుబాటులో వుండటం లేదు. దీంతో ఆయా పత్రికలు ప్రచురణను నిలిపేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ఇంటర్నెట్‌, టెలిపోన్‌ సేవలపై ఆంక్షలు, అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడం. దీని వలన జర్నలిస్టులు ఎక్కడకీ వెళ్లలేక వార్తలు సేకరించలేక పోతున్నారు. జమ్ముకాశ్మీర్‌లో దాదాపు 180 వరకు ఇంగ్లీష్‌, ఉర్దూ డైలీ న్యూస్‌పేపర్లు ఉన్నాయి. వీటిల్లో గత కొన్ని రోజులుగా 5 పేపర్లు మాత్రమే ప్రచురించబడుుతున్నాయి. ఇటువంటి పరిస్థితులపై ‘రైజింగ్‌ కాశ్మీర్‌’ అనే ఆంగ్ల పత్రిక ఎడిటర్‌ ఫైజుల్‌ యాసిన్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించి గత కొన్ని దశాబ్ధాల కాలంలో చోటుచేసుకున్న పరిణామాల్లో తాజాగా జరిగిన మార్పులు అనేవి చాలా ప్రధానమైనవని, వీటిని తాము రిపోర్టు చేయలేకపోయామని అన్నారు.
ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సేవలపై విధించిన ఆంక్షల వలన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏం జరుగుతుందనే దానిపై తమ ప్రతినిధుల నుంచి సమాచారం రాలేదని ఆయా పత్రికలకు చెందిన ఎడిటర్లు, జర్నలిస్టులు రాయటర్స్‌ వార్తా సంస్థకు తెలిపారు. ఇటువంటి ఆంక్షల వలన ప్రతిరోజూ 12 పేజీలు ప్రచురించే రైజింగ్‌ కాశ్మీర్‌ పత్రిక కేవలం 4 పేజీలను మాత్రమే ప్రచురిస్తోంది. ఇందులో కూడా కొన్ని జాతీయ చానెళ్ల నుంచి వచ్చే సమాచారం, పత్రిక కార్యాలయంలోని నలుగురు రిపోర్టర్ల ద్వారా వచ్చే వార్తలను నింపుతున్నారు.

ఎట్టకేలకు వివిధ అంక్షల నడుమ సేకరించిన సమాచారంతో తయారైన పేజీ లేఔట్లు నగర శివారు ప్రాంతాల్లో ఉండే ప్రింటింగ్‌ ప్రెస్‌కు ఆ రోజు సాయంత్రానికి చేరుతున్నాయి. అది కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆంక్షలను కొద్దిమేర సడలిస్తేనే సాధ్యమౌతోంది. రైజింగ్‌ కాశ్మీర్‌ పత్రిక ఉర్దూ, కాశ్మీరీ భాషల్లో ప్రచురితమౌతుంది.. అయితే ఆంక్షల నేపథ్యంలో వాటి ప్రచురణను నిలిపేశారు. దీనిపై పత్రిక పంపిణీదారుడు మన్సూర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ మొత్తానికి కేవలం ఐదు పత్రికలు మాత్రమే ప్రచురితమౌతున్నాయన్నారు. అది కూడా కదలికలపై ఉన్న ఆంక్షల వలన 5 కిలోమీటర్ల పరిధిలోనే పంపిణీ చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. అయితే విదేశాంగ శాఖకు చెందిన ప్రతినిధి ఒకరు స్పందిస్తూ మీడియాపై ఎటువంటి ఆంక్షలు లేవని అన్నారు. ‘వార్తలను ప్రచురించడంతో ఎవరిపై నిషేధం విధించలేదు. రవాణా పరమైన సమస్యల కారణంగా వారు పత్రికలను ప్రచురించకుంటే, అది వేరే విషయం’ అని వ్యాఖ్యానించారు.

సెక్యూరిటీ చెక్‌పోస్టుల నుంచి దాటి వెళ్లేందుకు విలేకర్లు, ఫొటోగ్రాఫర్లకు ఎటువంటి పాస్‌లు జారీ చేయలేదు. దీంతో వారికి విధుల నిర్వహణ అనేది కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో తమకు వార్తలు దొరకకపోవడంతో పత్రిక ప్రచురణను తాత్కాలికంగా నిలిపేసినట్లు రెండు ఉర్దూ పేపర్లకు చెందిన ఎడిటర్లు తెలిపారు. ‘ఆఫ్తాక్‌’ అనే పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ మోరిఫత్‌ ఖాద్రి మాట్లాడుతూ ‘ అనేక విపత్కర పరిస్థితుల్లో కూడా రిపోర్టర్లకు కర్ఫ్యూ పాస్‌లు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు అలా లేదు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను వివరించేందుకు పాలకులు ఎవరికీ అవకాశం ఇవ్వాలనుకోవట్లేదు’ అని వ్యాఖ్యానించారు.

 

(Courtacy Prajashakti)