• కొనుగోలుపై చేతులెత్తేసిన కార్పొరేషన్‌
  • సర్కారు ఇచ్చే ధరలకు భూమి దొరకదు
  • ఎకరా రూ.15 లక్షలకైతే కొనగలం
  • స్పష్టంచేసిన ఎస్సీల అభివృద్ధి సంస్థ
  • 6,051 మందికి 15,299 ఎకరాలు
  • ఈ ఏడాది 599 ఎకరాలే పంపిణీ
  • భూములు ప్రియం.. పథకం మాయం?
  •  తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో భూమి కొనుగోలుకు బ్రేక్‌ పడింది. భూమి కొనుగోలు బాధ్యత చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్‌ కొన్ని నెలలుగా భూములను కొనుగోలు చేయడం లేదు. రాష్ట్రంలో ఎక్కడా ఎకరాకు సర్కారు ఇస్తున్న రూ.3-4 లక్షలకు భూములు దొరక్కపోవడమే ఇందుకు కారణం. గరిష్ఠంగా వరంగల్‌ జిల్లాలో ఎకరాకు రూ.7.5 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అంతకుమించి వెచ్చించే పరిస్థితి కనిపించడం లేదు. భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు 3ఎకరాల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో 2014లో సర్కారు ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలిదశలో గుంట భూమి కూడా లేని వారికి మూడెకరాలను.. ఒకట్రెండు ఎకరాలున్న వారికి మూడు ఎకరాలకు సరిపోయేంతగా భూమి ఇస్తామని.. ఆ తర్వాత నీటి సదుపాయం, డ్రిప్‌ సౌకర్యం, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల రూపంలో సమగ్ర ప్యాకేజీని కూడా ఇస్తామని అప్పట్లో సర్కారు వెల్లడించింది.గత ఆరేళ్లలో ఇప్పటివరకు రూ.670 కోట్లతో 15,299 ఎకరాలను కొనుగోలు చేశారు. ఇప్పటివరకు కేవలం 6051 మందిదళిత కుటుంబాలకు భూ పంపిణీ చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 253 మందికి 599 ఎకరాలను పంపిణీ చేశారు. అయితే ఏటికేడు లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. 2014-15, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో మినహా ఎప్పుడూ వెయ్యి మందికి మించి భూ పంపిణీ జరగలేదు. కాగా ఈ పథకం కోసం లక్షలమంది దళితులు ఎదురుచూస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

రియల్‌ బూమ్‌తో దెబ్బ…ప్రస్తుతం సర్కారు ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా భూమి దొరికే పరిస్థితి లేదు. చిన్న జిల్లాలు కావడం, సాగు నీటి వసతి పెరగడం, రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌తో ధరలకు రెక్కలు రావడంతో రైతులెవ్వరూ భూములను అమ్మేందుకు ముందుకురావడం లేదు. ‘ఇప్పుడు భూములను కొనేవారున్నారు తప్ప అమ్మేవారు కరువయ్యారు’ అని ఎస్సీ సంక్షేమశాఖలో పనిజేసే ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఎకరాకు రూ.10లక్షలు వెచ్చించినా.. రాష్ట్రంలో ఎక్కడా భూమి దొరికే పరిస్థితి లేకపోవడంతో ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు తాజాగా సర్కారుకు ఒక ప్రతిపాదన పంపారు. ఎకరా భూమికి రూ.15 లక్షలు ఇవ్వాలని, అలా ఇవ్వగలిగితేనే భూ కొనుగోలు చేయగలుగుతామని అందులో స్పష్టం చేశారు. కాగా భూములు దొరికే పరిస్థితి లేకపోవడంతో ఈ పథకం అధికారికంగా ప్రకటించకుండానే కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఈ విషయంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రజలు వారంతట వారే ఈ పథకం గురించి మరిచిపోయేలా చేయడమే సర్కారు అభిప్రాయంగా కనిపిస్తోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Courtesy Andhrajyothi..