– కేంద్రం వద్ద 33,600 మెట్రిక్‌ టన్నుల ఉల్లి
– స్థానికంగా ఉల్లి సరఫరా పెరిగాక… దిగుమతులు
– నౌకా కేంద్రంలో కుళ్లిపోతున్న కోట్ల రూపాయల సరుకు
– ఇటు రైతులకు…అటు ప్రభుత్వానికి నష్టం

న్యూఢిల్లీ : కొద్ది నెలల క్రితం కిలో ఉల్లిగడ్డ ధర విని సామాన్యుడు హడలెత్తిపోయాడు. ఇప్పుడు అదే ఉల్లి ధర విని రైతులు హతాశులవుతున్నారు. స్థానికంగా ఉల్లి పంట మార్కెట్లకు చేరే సమయానికి…విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేయటం రైతులను తీవ్రంగా నష్టపరిచింది. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి రూ.200 పలికినప్పుడు వెంటనే దిగుమతలకు చర్యలు తీసుకోవాల్సింది. కానీ దీనిపై కేంద్రం తాత్సారం చేసిందని, రాష్ట్రాల్లో స్థానికంగా సరఫరా పెరిగాక ఉల్లి దిగుమతులకు మోడీ సర్కార్‌ చర్యలు చేపట్టడం సరైన విధానం కాదని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇప్పుడు రైతుకు కిలో ఉల్లిపై కేవలం రూ.6 దక్కుతోందని వారు అన్నారు.

ధర పెరిగిననాడు మధ్య దళారులు, మార్కెట్‌ మాఫియా లాభపడగా వినియోగదారుడు తీవ్రంగా నష్టపోయాడు. కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు ఉల్లి సరఫరా పెరిగిపోయి రైతులు నష్టపోవాల్సి వస్తోందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 33,600 మెట్రిక్‌ టన్నుల ఉల్లి దిగుమతులు ఒక్కసారిగా భారత్‌కు చేరుకోవటమే ఈ పరిస్థితికి కారణమని వారు అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక నుంచి స్థానిక మార్కెట్లకు ఉల్లి సరఫరా పెరిగిందని, కేంద్ర దిగుమతులు కూడా మార్కెట్లకు తరలితే ఉల్లిధర మరింత దిగజారి రైతులు తీవ్రంగా నష్టపోతారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

వద్దంటున్న రాష్ట్రాలు
కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసిన 33,600 మెట్రిక్‌ టన్నుల ఉల్లిగడ్డలను తీసుకోవడానికి రాష్ట్రాలు ఆసక్తి చూపటం లేదు. పంపిణీదారు అయిన ‘సఫాల్‌ ఆఫ్‌ మదర్‌ డెయిరీ’ కూడా నిరాకరించింది. ఈనేపథ్యంలో ఉల్లి దిగుమతుల్లో 90శాతం ముంబయిలోని నౌకా కేంద్రం వద్ద పేరుకుపోయాయి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘మెటల్స్‌, మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా'(ఎంఎంటీసీ)కు రూ.200కోట్లు నష్టం వాటిల్లిందని అధికార వర్గాల సమాచారం. కిలో ఉల్లిగడ్డను రూ.58 ధర వద్ద ఎంఎంటీసీ విదేశాల నుంచి కొనుగోలు చేసిందని, ఇందులో కేవలం 20కోట్ల సరుకుమాత్రమే అమ్ముడైందని తెలిసింది.
33,600 మెట్రిక్‌ టన్నుల ఉల్లి దిగుమతులు ముంబయిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌కు(నౌకా కేంద్రం) చేరి చాలా రోజులైంది. పోర్టు వద్ద బహిరంగ ప్రదేశంలో దిగుమతులను నిల్వచేశారు. ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు ప్రారంభించగా, కిలో ఉల్లిగడ్డ ధర రూ.11 వద్ద కోట్‌ అవుతున్నది. మరోవైపు వాతావరణంలో తేమ కారణంగా నిల్వచేసిన సరుకు కుళ్లిపోయే దశకు చేరుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.

Courtesy Nava Telangana