– విదేశాల నుంచి భారీగా దిగుమతులు 
– రైతుల్ని తీవ్రంగా నష్టపరుస్తుంది : వ్యవసాయరంగ నిపుణులు 

న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌ ఇటీవలి నిర్ణయం దేశవ్యాప్తంగా ఉల్లిరైతులను తీవ్రంగా నష్టపర్చింది. విదేశాల నుంచి ఉల్లి దిగుమతులకు అనుమతిస్తూ ‘లోహాలు, ఖనిజాల ట్రేడింగ్‌ కార్పొరేషన్‌’ నోటిఫికేషన్‌ జారీచేసింది. 2వేల మెట్రిక్‌ టన్నుల ఉల్లి దిగుమతులకు అనుమతిచ్చింది. మరికొద్ది రోజుల్లో ఉల్లి దిగుమతులు మహారాష్ట్రలోని పెద్ద పెద్ద మార్కెట్లకు చేరనున్నదని సమాచారం. దేశంలో 30శాతం ఉల్లి మహారాష్ట్ర నుంచే వస్తోంది. ఇతర రాష్ట్రాల్లో పండించిన ఉల్లిసైతం మహారాష్ట్రలోని మార్కెట్లకు తరలివెళ్తాయి. గత మూడు నెలలకాలంలో ప్రతి క్వింటాలు కు రూ.1802 నుంచి రూ.2267 ధర పలికింది. రిటైల్‌ మార్కెట్‌కు వచ్చేసరికి ఉల్లి ధర కిలో 40 నుంచి 50 మధ్య కు చేరుకుంది. అయితే, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మార్కెట్లకు చేరుకున్న సమయంలో ఉల్లి ధర ఈ స్థాయిలో లేదు. ఉల్లిపంట అంతా మార్కెట్‌శక్తులకు చేరాక దేశవ్యాప్తంగా ఉల్లి ధర పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు పెరిగిన ఉల్లి ధరతో హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్‌ పెట్టుబడి దారులు లాభపడ్డారు. కేవలం రూ.1 కిలోచొప్పున ఉల్లి అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయనీ, అప్పుడు రైతుల కోసం కేంద్రం ఎలాంటి చర్యలూ చేపట్టలేదనీ రాజకీయ నాయకు డు యోగేంద్ర యాదవ్‌ అన్నారు. ఇప్పుడు మార్కెట్లో ఆశాజనకమైన ధర ఉందని రైతులు భావిస్తున్న తరుణంలో, వారిపై పిడుగులాంటి వార్తను కేంద్రం విడుదలచేసిందని చెప్పారు. విదేశాల నుంచి దిగుమతుల వల్ల ఉల్లి ధరలు దారుణంగా పడిపోతాయి. ఈ తరుణంలో మార్కెట్‌కు వచ్చిన ఉల్లిరైతుకు తీరని అన్యాయం జరుగుతుందని వ్యవసాయరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

రైతుకు దక్కని పెట్టుబడి ఖర్చులు 
గత రెండేండ్లుగా ఉల్లిరైతు తీవ్రంగా నష్టపో తున్నాడు. క్వింటా లు ఉల్లి పండించటానికి రైతుకు అవుతున్న వ్యయం సుమారుగా రూ.600 కాగా, పంట చేతికొచ్చి మార్కెట్‌ తరలిస్తే అతడికి లభించిన ధరలు రూ.300 లేదా రూ.200. ఉల్లిధరలు ఈ స్థాయిలో పడిపోతే, రైతుల్ని ఆదుకోవడానికి కేంద్రం ఎలాంటి చర్యా తీసుకోలేదని వ్యవసాయరంగ నిపుణులు గుర్తుచేస్తున్నా రు. జనవరి, 2019లో మహారాష్ట్ర మార్కెట్లలో ఉల్లి క్వింటాలు ధర రూ.517 పలికింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి వరకూ ధరలు పడిపోతూ వచ్చాయి. రైతుల నుంచి పెద్ద ఎత్తున ఉల్లి మార్కెట్‌కు తరలింది ఈ సమయం లోనే. దాదాపు రైతుల నుంచి కొనుగోలు పూర్తికాగానే, మార్కెట్‌లోని ప్రయివేటు శక్తులు ధరల్ని పెంచేశాయి. సరఫరాను నియంత్రంచి, లాభాల్ని పోగేసుకున్నాయి. పడిపోయిన ధరల వద్ద అమ్ముకొని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ఉల్లి ధర కొంత ఆశాజనకంగా ఉందనుకుం టున్న తరుణంలో, ధరల్ని నియంత్రించ డానికి కేంద్రం పూనుకుంది. పెద్ద ఎత్తున విదేశాల నుంచి దిగుమతి చేయడానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిందనీ వ్యవసాయరంగ నిపుణుడు దేవేంద్ర శర్మ అన్నారు.

(Courtesy Nava Telangana)