– 2017లో కొట్టేసిన మొత్తం 2000కోట్లు ..
– దొంగతనాలకు నిరుద్యోగ సమస్యే కారణమా? : ఎన్సీఆర్బీ
న్యూఢిల్లీ : నిరుద్యోగ సమస్య అనేక అనర్థాలకు దారితీ స్తున్నది. ఉన్నత చదువు చదివినా.. ఉద్యోగాలు రాకపోవడం, పేదరికంతో కొట్టుమిట్టాడటం, వయసుతోపాటు బాధ్యతలు పెరుగుతుండటంతో కొందరు పెడదారులు పడుతున్నట్టు తెలుస్తున్నది. నిరుద్యోగానికి సమాంతరంగా నేరాలూ పెరుగుతుండటంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. బతుకు బండిని లాగేందుకు కొందరు నేరాలకూ దిగుతున్నట్టు పలునివేదికల గణాంకాలతో అవగతమవుతున్నది. మోడీ హయాంలో సంపద కొందరి దగ్గరే పోగుపడుతుండటం.. ఫలితంగా అనేక కుటుంబాలు పేదరికంలోకి దిగజారడం, మహిళలు, పిల్లల్లో పౌష్టికాహారలోపం, ఆకలి చావులు మితి మీరుతుండగా.. వీటి నుంచి బయటపడేందుకు ఉద్యోగం, ఉపాధి దొరక్క దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నట్టు సమాచారం. ఉన్నత చదువులు చదివిన యువతీ యువకులూ సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. చైన్‌ స్నాచర్ల ఘటనలు ఎక్కువవుతున్నాయి. యేటా దొంగతనాలు పెరుగుతున్నాయని వెల్లడిస్తున్న నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) రిపోర్టులు ఈ విశ్లేషణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
10శాతం పెరిగిన దొంగతనాలు :
2017లో దేశంలో నివాస ప్రాంతాల్లో ప్రతి మూడు నిమిషాలకు ఒక దొంగ తనమో, దోపిడో, ఇతర విధాల్లో మోసాలు జరిగినట్టు ఈ రిపోర్టు వెల్లడిం చింది. ఆ ఏడాది మొత్తం 2,44,119 కేసులు నమోదైనట్టు తేలింది. రోజుకు 669 కేసు లు, గంటకు 28 కేసులు, ప్రతి మూడు నిమిషా లకు ఒక కేసు చొప్పున నమో దైనట్టు రిపోర్టు వివరిస్తున్నది. కాగా, చోరీ అయిన మొత్తం విలువ రూ. 2065 కోట్లను మించింది. దొంగతనాల సంఖ్య అంతకు ముందు సంవత్స రాని కి కంటే 10శాతం ఎక్కువ(2016లో 2,20,854)గా ఉండటం గమనార్హం. దొంగతనా నికి గురైన మొత్తమూ 2016 కంటే అధికంగానే (రూ. 1,475 కోట్లు) ఉంది.
ఇంటి తాళం కంటే.. ఫోన్‌లాక్‌కే ప్రాధాన్యత!
ఇంటి భద్రత అందులోని నివాసులతోపాటు పోలీసులు, ఇతర రక్షణ అధికారులకూ ముఖ్యమైన విషయమే. అందుకే 2017లో నవంబర్‌ 15వ తేదీని హౌమ్‌ సేఫ్టీ డేగా గుర్తించారు. ఇంటి భద్రత గురించి కొన్ని అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రూపొందించిన ‘హర్‌ ఘర్‌ సురక్షిత్‌ 2018’ రిపోర్టు.. డిజిటల్‌ సెక్యూరిటీ, ఇంటి భద్రత అంశాలపై దృష్టి పెట్టింది. దీని ప్రకారం.. భారతీయులు ఇంటి భద్రత కంటే ఆన్‌లైన్‌ సెక్యూరిటీపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తేల్చింది. ఇంటి తాళం కంటే ఫోన్‌ లాక్‌కే ప్రాధాన్యతనిస్తున్నట్టు తేలింది. 64శాతం మంది తమ ఇంటికి తగిన భద్రత లేకుండా ఉన్నారు. 83శాతం మంది తమ డిజిటిల్‌ పాస్‌వర్డులను ప్రతి ఆరు నెలలకు ఓసారి మారుస్తున్నారు. కానీ, 61శాతం మంది ఇంటికి ఉన్నత భద్రత సాంకేతికతను ఉపయోగించేందుకు నిరాకరిస్తున్నారు.

Courtesy Navatelangana…