• 20 జిల్లాల్లో ఏర్పాటుకు జీవో జారీ.. ఏడాదైనా ఒక్కచోటా లేదు
  • 52 రకాల పరీక్షలు ఉచితమన్నారు
  • రాష్ట్రంలో ప్రతి రోజూ 80 వేల ఓపీ
  • వీరిలో జ్వర పీడితులే ఎక్కువమంది
  • రోగ నిర్ధారణ పరీక్షలతో జేబులు గుల్ల

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 : రాష్ట్రంలో డెంగీ, వైరల్‌ జ్వరాల తీవ్రత కొనసాగుతూనే ఉంది. సర్కారీ ఆస్పత్రుల్లో పరీక్షల కోసం రోగులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సత్వరమే రోగ నిర్ధారణ పరీక్షల నివేదికలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ కేంద్రాలు ఇంతవరకు ఎక్కడా పనిజేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 40 చోట్ల ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్రానికి రూ.38 లక్షలు కేటాయించింది. అన్నింటికి కలపి రూ.20 కోట్ల విడుదలకు అనుమతి ఇచ్చింది. తొలి విడతగా 20చోట్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేస్తూ గత ఏడాది జూలై 5న ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, వికారాబాద్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, ములుగు, మహబూబాబాద్‌, ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్‌, జగిత్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

సూర్యాపేట, నల్లగొండకు మెడికల్‌ కాలేజీలు మంజూరు కావడంతో అక్కడ ఈ కేంద్రాల ఏర్పాటును ఉపసంహరించుకున్నారు. ఏడాది అవుతున్నా ఇతర జిల్లాల్లో ఏర్పాటుకాలేదు. కొన్నిచోట్ల భవనాలు నిర్మించి వదిలేశారు. ఇటీవలే డయాగ్నస్టిక్‌ యంత్రాల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియ పూర్తయ్యి కేంద్రాల ప్రారంభానికి కనీసం ఐదారు నెలలు పట్టే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో విడుదలైనా, రాష్ట్ర వాటా నిధుల కేటాయింపులో ప్రభుత్వ నిర్లక్ష్యమే ఆలస్యానికి కారణమని ఎన్‌హెచ్‌ఎం అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జూన్‌లో హైదరాబాద్‌ నారాయణగూడలోని ఐపీఎమ్‌లో ప్రారంభమైన టీ డయాగ్నస్టిక్‌లో మాత్రమే ప్రస్తుతం సేవలు అందుతున్నాయి. అన్ని చోట్లా ఈ కేంద్రాలు అందుబాబులోకి వచ్చి ఉంటే ప్రజలు నిలువు దోపిడీకి గురయ్యేవారు కాదు. ఈ కేంద్రాల్లో 52 రకాల పరీక్షలు ఉచితంగా చేయాలని నిర్దేశించారు. వీటిలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌, షుగర్‌, ఎక్స్‌రే, స్కానింగ్‌ లాంటివి ఉన్నాయి. ప్రజలు వీటి కోసం బయట వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

రోజూ 80 వేల ఓపీ

ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో రోజు 80 వేల ఓపీ నమోదవుతోంది. వీరిలో ఎక్కువగా డెంగీ, వైరల్‌ ఫీవర్‌తో వచ్చేవారే ఉంటున్నారు.

చేతులు కాలాక..

డెంగీ, వైరల్‌ జ్వరాలు విజృంభించి ప్రజల జేబులు గుల్ల అయ్యాక వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తీరిగ్గా సోమవారం నాడు టీ డయాగ్నస్టిక్‌ కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. వాటి ఏర్పాటును వేగవంతం చేయాలని జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. నెలలో ప్రారంభిస్తామని చెప్పినట్లు సమాచారం.

Courtesy AndhraJyothy..