– పథకం అమలు పైనే అనుమానాలు
– వలస కార్మికుల ఆకలి తీర్చడం సందేహమే

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలోని ఎందరో వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తినడానికి తిండి అందక, తలదాచుకోవడానికి నివాసం, కనీసం నీరు కూడా లేక తాము ఉన్న చోటనే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 22న కేంద్రం విధించిన జనతా కర్ఫ్యూ నుంచి ప్రధాన మీడియా, సామాజిక మాధ్యమాల్లో వలస కార్మికులు, వారి దీన పరిస్థితులను తెలియజేసే అనేక వార్తలు, వీడియోలు, చిత్రాలు ప్రసారమయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంత దుర్భర పరిస్థితులు దేశంలో కనబడ్డాయి. వేలాది కిలోమీటర్లు నడిచి సొంత ఇంటికి చేరుకోవాలనే తపనతో ఎందరో వలసకార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కంటతడి పెట్టించాయి. ఇలాంటి తరుణంలో వలస కార్మికుల కోసం ప్రజా పంపిణీ వ్యవస్థలో ”వన్‌ నేషన్‌- వన్‌ రేషన్‌” పథకాన్ని అమలు చేయబోతున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. అయితే ఈ పథకం అమలులో అనేక సమస్యలున్నాయి.

రేషన్‌ ఔట్‌లెట్ల ద్వారా సబ్సీడీ ఆహార ధాన్యాలను పీడీఎస్‌ అందిస్తుంది. జాతీయ ఆహార భద్రత చట్టం-2013 ప్రకారం.. పీడీఎస్‌ ద్వారా రేషన్‌ పొందడం కోసం జనాభాలో మూడింటా రెండు వంతుల మందికి రేషన్‌ కార్డులు ఇవ్వాలని తప్పనిసరి చేసింది. ఇందుకు కేంద్రం 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నది. అయితే జనాభా పెరుగుదల కారణంగా కేంద్రం దాదాపు దేశ జనాభాలో 60శాతం మందిని(67శాతం కాదు) మాత్రమే కవర్‌ చేయగలుగుతున్నది. (అంటే దాదాపు 130 కోట్ల మందికి పైగా భారతీయుల్లో సుమారు 81 కోట్ల మంది).

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద ఒక వ్యక్తికి ఐదు కిలోల చొప్పున లేదా కుటుంబానికి 35 కిలోల చొప్పున రేషన్‌ కార్డు ద్వారా సబ్సీడీ రేషన్‌ పొందుతారు. కానీ, కొన్ని రాష్ట్రాలు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏతో సంబంధం లేకుండా సొంత రేషన్‌ కార్డులను జారీ చేశాయి. దీంతో ఆ ప్రజలు తమ ప్రాంతం లేదా గ్రామంలో ఒక పీడీఎస్‌ అవుట్‌లేట్‌కు కేటాయించబడతారు. ఇలా ప్రతి అవుట్‌లేట్‌ నిర్దేశిత సంఖ్యలో రేషన్‌ కార్డులను ఇస్తుంది. వీటి ఆధారంగా ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) నుంచి రేషన్‌ సప్లరులను పొందుతుంది. వన్‌ నేషన్‌- వన్‌ రేషన్‌ కార్డు ద్వారా ఒక వ్యక్తి దేశంలో ఎక్కడ ఉన్నా.. దగ్గరలోని పీడీఎస్‌ అవుట్‌లెట్‌నుంచి రేషన్‌ పొందొచ్చు. రేషన్‌ కార్డు ”పోర్టబుల్‌”సౌకర్యాన్ని కలిగి ఉన్న ఈ పథకం ముఖ్యంగా వలసకార్మికులకు ఎంతగానో ఉపకరిస్తుందని అంతా భావించారు. అయితే ఇది సాంకేతికంగా సాధ్యమైనా అమలుతీరుపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
నాలుగు సందేహాలు

మొదటిది: రేషన్‌ కార్డులు కలిగి ఉన్నవారికి వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ ఉపయుక్తంగా ఉంటుంది. మరి ఆ రేషన్‌ కార్డులు లేనివారి పరిస్థితి ఏంటి? ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎనిమిది కోట్ల మంది వలసకార్మికులకు ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ కింద చేసిన ప్రకటనను బట్టి వారిలో చాలా మందికి రేషన్‌కార్డులు లేవన్న విషయం అవగతమైంది.

రెండోది: పట్టణ ప్రాంతాలకు చెందిన వలసకార్మికులు తమ కుటుంబాలను విడిచి నగరాలకు వలస వెళ్తారు. ఇలాంటి సందర్భాల్లో కార్మికులు తమ రేషన్‌ కార్డును వారి కుటుంబం కోసం ఇంటి వద్దే ఉంచుతారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పీడీఎస్‌ రేషన్‌ కార్డు ఫ్యామిలీ కార్డుగా ఉన్నది. వ్యక్తిగత కార్డు అమలు లేదు. దీంతో ఇలా వలసవెళ్లిన కార్మికులు రేషన్‌ పొందలేరు. ఇది వారికి ఇబ్బందికరంగా మారనున్నది.

మూడోది: పీడీఎస్‌లో ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానం. ఉదాహరణకు తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ పీడీఎస్‌ కవరేజ్‌కు మించి రేషన్‌ను అందిస్తున్నాయి. ఇందుకు ఆయా రాష్ట్రాలు తమ వనరులనే వినియోగిస్తున్నాయి. తమిళనాడులో రైస్‌ ఉచితం. కానీ, కేంద్రం ధర రూ.3గా ఉన్నది. మరి ఇలాంటి సందర్భంలో ఒక బీహారీ కార్మికుడు తమిళనాడుకు వెళ్తే అతను బియ్యం, పప్పు, నూనే వంటి వస్తువులు పొందగలడా?. తెలంగాణ, ఏపీ, జార్ఖండ్‌లలో బియ్యం వినియోగించే వ్యక్తి రాజస్థాన్‌కు(ఇక్కడ రేషన్‌ ద్వారా కేవలం గోధుమలు మాత్రమే ఇస్తారు) వెళ్తే అక్కడ రేషన్‌ దుకాణం ద్వారా బియ్యాన్ని పొందగలడా?
నాలుగోది: లాజిస్టిక్స్‌ సప్లరుకు సంబంధించింది. ఆయా రాష్ట్రాల్లో పీడీఎస్‌ అవుట్‌లెట్లకు నిర్దేశిత మొత్తంలో సరుకులు చేరుతాయి. అయితే వన్‌నేషన్‌- వన్‌ రేషన్‌ కార్డు ద్వారా రేషన్‌ దుకాణాల ద్వారా వస్తువులు పొందేవారి సంఖ్య ప్రతినెలా మారే అవకాశం ఉంది. కాబట్టి, లాజిస్టిక్‌ సప్లరును కూడా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Courtesy Nava Telangana