ఒరే పాపం రా..! ఒక్క నిముషం ఆలశ్యం పేరుతో మూడు వందల అరవై రోజులు చదివిన చదువును మసి చేస్తారా? అదే ఒక్క నిముషం ఆ రాసిన పేపర్ సరిగా దిద్దితే ఏడంతస్తు ల మీదనుండో,రైలు పట్టాలో ఉరితాడో అవసరమో కలిగేది కాదు కదా ? విషం తాగిన నిజామాబాద్ జిల్లా వెన్నల, కామారెడ్డి జిల్లాలో ఉరిపెట్టుకున్న అనామిక, రుచిత,నీరజ, లాశ్య, నవ్య,భాను కిరణ్,ఆశిష్,ఒక కేంద్ర మంత్రి మేనల్లుడు తో సహా ఒక్కరా ఇద్దరా పదిహేడు మంది అమాయక పిల్లలు మీ నిర్లక్ష్యం మూలంగా పోయారే.
ఒక్కొక్కరి బ్రతుకు మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలకు బలవంత ముగింపు పలికారు కదరా ?
మూసీ మురుగు కాలవ పక్కన, నాలుగు చినిగిన గోనె పట్టీల కింద, ఎండకు ఎండి వానకు తడిసిన బాల్యం నుండి, ఆముదపు దీపం కింద చదివి పొద్దున్నే ముక్కుల్లోంచి నల్లని కారిన మసి కడిగి ఎక్కడో గొట్టాం గాడి కాలీజీలోనో పరీక్ష సెంటర్ పడితే… తిన్నబువ్వ కడుపులో కల దిరిగి మెలిదిరిగి మూడు బస్సులు మారి సెంటర్ దగ్గరకు వస్తే నిర్లక్ష్యపు మూల్యాంకనం చేసి నా నెత్తిన నిప్పులు పోస్తిరి కదరా తీఫ్ మై సన్స్.
అరె సాలె ఇచ్చిన హామీ దశాబ్దాలుగా తీర్చని నాయకులున్న చోట,సమయానికి బస్సు ,రైలు నడవని చోట, నల్లా వదలని చోట,పదింటికి ఆఫీసు అయితే పన్నెండు గంటలకు వచ్చే ఉద్యోగులున్న దరిద్రపు లోకంలో పగలంతా కప్పులు కడగి,బాసిన్లు తోమి,రాత్రంతా మెలుకువతో యాడాది అంతా చదివి ఇంటర్ పాసై చిన్న కొలువన్నా వస్తదన్న ఆశలో పరీక్షకు వస్తే ఒక్క నిముషం పెట్టి నన్ను ఆగం జేస్తిరి కదరా. ఆ ఒక్క నిముషం రాసిన పేపర్ల మీద చూపలేక పోయారు కదరా
నగరంలో కొలువు చేస్తే మరింత HRA వస్తదని పంతుల్ల దగ్గర డబ్బులు తీసుకొని బదిలీల కోసం పైరవీలు చేసే నాయక పంతుళ్ళు ఉన్నచోట, కోట్లాది రూపాయలకు ఎంసెట్ పరీక్ష ముందే అమ్ముకున్న యూనియన్ నాయకులు, అధికారులూ ఉన్నచోట, గల్లీ కోక కార్పోరేట్ కళాశాల తిష్టవేసిన చోట, ముచ్చటగా మూడు సార్లు ఎంసెట్ పెట్టి ,దాని బాధ్యులు ఎవరో ఈనాటికీ తేల్చని చోట, రాసిన పరీక్ష పత్రాలు ముల్యంకనం చేసి ఫలితాలు ఇచ్చే ఏజెన్సీ నిర్లక్ష్యమో పంతుల్ల పని తనమో ఎంత మంది పిల్లల ఉసురు పోసుకున్నారు రా ?
ఆశలు సమాధి చేస్తూ ప్రభుత్వ కళాశాల ల నడ్డివిరిచిన కర్కోటపు పాలకు లున్న చోట ముఖ్యంగా చైతన్య నారాయణ ఉన్న చోట ప్రాణానికి విలువేముంటుంది ?
అవి తాగేసిన సిగరెట్ పీకలు కాదురా పసి ప్రాణాలు. మీ దినాలు జెయ్య.
తెలుగులో తనకు తొంబై తొమ్మిది మార్కులు వచ్చినా సున్నా మార్కులు వేసి ఫెయిల్ చేసి నందుకు నా నిరసన.