గడువు పెంచకపోవడంతో ఇబ్బందులు
 గతంలో ఫిబ్రవరి దాకా అవకాశం

హైదరాబాద్‌: ఈ ఏడాది రాష్ట్రంలో లక్ష మందికి పైగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరం కానున్నారు. ఆర్టీసీ సమ్మె, హయత్‌ నగర్‌ ఎమ్మార్వో హత్య తదనంతర పరిణామాల వల్ల సకాలం లో రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకోకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఆ విద్యార్థులకు ఏం చేయాలనేది పాలుపోవడం లేదు. ప్రతీ ఏటా రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తు గడువును ఫిబ్రవరి దాకా పొడిగించే ప్రభుత్వం ఈ సంవత్సరం అలా చేయలేదు. డిసెంబరు 31వరకే దరఖాస్తులను నిలిపివేయడంతో విద్యార్థుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోని వాళ్లలో కొత్తగా కాలేజీల్లో చేరినవారే ఎక్కువగా ఉన్నా రు. ఈ తరుణంలో విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని కాలేజీలు కోరుతున్నా యి. 2018-19 విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 13.75 లక్షల మంది రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, 2019-20లో ఈ సంఖ్య కేవలం 12.65 లక్షలు మాత్రమే.

సకాలంలో దరఖాస్తు చేసుకోకపోవడానికి అనేక కారణాలున్నాయని విద్యార్థులు చెప్తున్నారు. హయత్‌నగర్‌ ఎమ్మార్వో హత్య, రెవెన్యూ ఉద్యోగుల నిరసనల కారణంగా అనేక మంది విద్యార్థులు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను సకాలంలో అందుకోలేకపోయారు. దీంతో రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదు. వీటితో పాటు డిసెంబరు 25న 52 జూనియర్‌ కాలేజీల షిప్టింగ్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీచేయడం వల్ల ఆ కాలేజీల విద్యార్థులు రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకోలేకపోయారు.

(Courtesy Andhrajyothi)