– సర్కారు ఉద్యోగాలు ఇప్పట్లో లేనట్టే
– ఖాళీలున్నా భర్తీ చేసేందుకు వెనకడుగు
– నిరుద్యోగ భృతి ఊసేలేదు
– ప్రభుత్వ తీరుపై యువత ఆగ్రహం
– కరోనాతో ప్రయివేటు ఉద్యోగాలూ అంతంతే

‘తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉజ్వల ఘట్టమిది. ఏ లక్ష్యం, గమ్యాన్ని ఆశించి ప్రజలు రాష్ట్రం కోసం పోరాడారో ఆ కల సంపూర్ణంగా, సాదృశ్యంగా సాకారమైన చరిత్రాత్మక అంశం. ఇది ఒక అపురూపమైన ప్రాజెక్టు. వందలాది పంపుసెట్లున్నాయి. తొమ్మిది లిఫ్టులు దాటుకొని పదో లిఫ్టు ద్వారా నీళ్లు ఈ రోజు కొండపోచమ్మ జలాశయంలోకి ప్రవహించాయి’.అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గతనెల 29న కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవంలో చెప్పారు. ‘రానున్న రెండేండ్లలో ప్రభుత్వ శాఖల్లో 1.07 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. నిరుద్యోగుల ఆశలు నెరవేరుస్తాం. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.’అని సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా 2015, మార్చి 15న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వ శాఖల్లో 1.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలోనే 2017, అక్టోబర్‌ 29న మరోసారి సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు.

నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యం కోసం తెలంగాణ ఆవిర్భవించింది. నీళ్ల విషయంలో మిషన్‌ కాకతీయ, భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో ప్రజలకు ఫలితాలు అందుతున్నాయి. కోటి ఎకరాల మాగాణ దిశగా అడుగులు వేస్తున్నది. ఇక నిధుల విషయంలో ధనిక రాష్ట్రం నుంచి ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారింది. మిగులు బడ్జెట్‌ నుంచి లోటు బడ్జెట్‌కు దిగజారింది. ఉద్యోగాల కోసమే విద్యార్థులు, యువకులు తెలంగాణ ఉద్యమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. ముందుపీఠిన ఉండి పోరాడారు. ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఆవిర్భవించి ఆరేండ్లు దాటినా నియామకాల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది.

ప్రభుత్వం ప్రకటించిన ఖాళీలనూ భర్తీ చేయలేని పరిస్థితి నెలకొంది. నియామకాల విషయంలో నిరుద్యోగుల కల సాకారం కాలేదన్న ఆవేదన వ్యక్తమవుతున్నది. ఇక ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాజకీయ పార్టీల నేతలు, యువజన సంఘాల నాయకులు చెప్తున్నారు. 2018, డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో నోటిఫికేషన్లు వెలువడలేదు. ఉద్యోగాల భర్తీ పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నదని విమర్శిస్తున్నారు. మూడు నెలలుగా కరోనా వైరస్‌ ప్రభావంతో పూర్తిగా స్థంభించింది. ఈ నేపథ్యంలో సర్కారు కొలువులు కలే?అని తెలుస్తున్నది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో లేనట్టేనని అర్థమవుతున్నది. దీంతో ప్రభుత్వ తీరుపై నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నది.

టీఎస్‌పీఎస్సీ ద్వారా 36,736 కొలువులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఆరేండ్ల కాలంలో 36,736 కొలువుల భర్తీకి 105 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 26,727 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా 10,009 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది. 2019లో మూడు నోటిఫికేషన్ల ద్వారా 41 పోస్టులను ప్రకటించింది. ఈ ఏడాది మార్చి, 7న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై సీవరేజ్‌ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ)లో 93 పోస్టుల భర్తీకి నోటీఫికేషన్‌ జారీ చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇంకోవైపు ప్రభుత్వానికి రాబడి తగ్గుతున్నది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. వరుసగా మూడు నెలలపాటు సగం జీతమే చెల్లిస్తున్నది. ఆర్థిక భారం ఉండడంతో ఏపీలో ఐఆర్‌ ఇస్తున్నా ఇక్కడ ప్రకటించలేదు. పీఆర్సీ గురించి పట్టించుకోవడం లేదు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన నెలకు రూ.3,016 ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఊసేలేదు. ఒకవైపు సర్కారు కొలువుల్లేక, ఇంకోవైపు ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగాల్లేక, నిరుద్యోగ భృతి రాక యువత ఆందోళన చెందుతున్నది. దీంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. నిరుద్యోగ భృతికి అర్హులెందరో ఇంకా తేల్చలేదు. ఎంప్లారుమెంట్‌ ఎక్స్చేంజీల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. టీఎస్‌పీఎస్సీ వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌)లో 29 లక్షల మంది వరకు పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఎంత మంది నిరుద్యోగులు అర్హులు, ఏ ప్రాతిపదికన నిరుద్యోగ భృతి అమలవుతుంది అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇలా అన్ని విధాలుగా నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు.

Courtesy Nava Telangana