– ఏటేటా పెరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల అంచనా
– కొత్త ఆయకట్టు లక్ష్యం 54 లక్షల ఎకరాలు
– కావలసిన నిధులు..రూ. 96,375 కోట్లు
– ఐదేండ్లలో రూ. 90 వేల కోట్లు వ్యయం

రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కావటానికి రూ. 96,375 కోట్లు కావాలని నీటిపారుదల శాఖ తాజాగా అంచనా వేసింది. 54 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించటమే లక్ష్యంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నది. గతంలో మంజూరై నిర్మాణంలో ఉన్న ప్రాజెకుల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నవి. ఇవి కాకుండా రీడిజైన్‌ పేరుతో చేపట్టిన పెద్ద ప్రాజెక్టుల అంచనా వ్యయం భారీగా ఉండటంతో వీటి కాలపరిమితి నానాటికీ పెరుగుతూ వస్తున్నది. సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్రంలోని పాత, కొత్త ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 2,11,535 కోట్లు కాగా 2019 మార్చి వరకూ 1,16,375 కోట్లు ఖర్చు పెట్టారు. 2019-20 బడ్జెట్‌లో భారీ సాగునీటి ప్రాజెక్టులకు కేవలం రూ. 4,345 కోట్లు కేటాయించగా బ్యాంకులు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి తెచ్చిన రుణాలతో ఇప్పటి వరకూ రూ. 20,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయటానికి మరో రూ. 96,375 కోట్లు అవసరమని అంచనా వేశారు. పనులు సకాలంలో పూర్తి కాకపోతే అంచనా వ్యయం మళ్లీ పెరిగే అవకాశం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 80,500 కోట్లు కాగా 2019 మార్చి వరకు రూ. 44,610 కోట్లు ఖర్చుపెట్టగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,080 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం కార్పొరేషన్‌ పేరుతో తెచ్చిన రుణాలతో మరో 9,000 కోట్లు ఖర్చుపెట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 49,595 కోట్లు కాగా గత సంవత్సరం మార్చి వరకు 4,872 కోట్లు ఖర్చు పెట్టారు. 2019-20 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ. 500 కోట్లు కేటాయించగా మరో రూ. 3,000 కోట్లు రుణాల రూపంలో తెచ్చిన నిధుల్లో ఖర్చు చేశారు. మూడవ ప్రాధాన్యతా క్రమంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు పనులు ఇటీవల వేగవంతం చేసినప్పటికీ ఖర్చు ఇప్పటి వరకూ రూ. 3,500 కోట్లకు మించలేదు. ఏఎమ్మార్‌, డిండి, దేవాదుల, వరద కాలువ, తుపాకుల గూడెం, శ్రీరామ్‌సాగర్‌ రెండవ దశ ప్రాజెక్టుల వ్యయం భారీగా పెరిగి పోగా కేటాయింపులు నామమాత్రంగా జరుగుతున్నాయి. మార్చిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో సాగునీటి రంగా నికి రూ. 25,000 కోట్లు కేటాయించాలని అధికా రులు కోరారు. ఈ మేరకు నిధులు కేటాయిస్తేనే బ్యాంకు రుణాలతో కలిపి సకాలంలో ప్రాజెక్టుల పనులను పూర్తి చేయవచ్చని వారంటున్నారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత 12.78 లక్షల ఎకరాలకు…
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ ఐదేండ్ల కాలంలో ఫలితాలు నామ మాత్రంగానే వచ్చాయి. 1956 కి పూర్వం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 16.03 లక్షల ఎకరాలు సాగులోకి రాగా 2014 వరకూ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా 36.13 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. దీనిలో చిన్న తరహా సేద్యపు నీటి వనరుల కింద 12 లక్షల ఎకరాలు ఉండటం విశేషం. 2004 నుంచి 2014 వరకూ కేవలం 5.71 లక్షల ఎకరాలకు సాగునీరందిం చగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదనంగా మరో 12.78 లక్షల ఎకరాలకు సాగునీరందించినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి.

Courtesy Nava Telangana