– వేర్‌హౌస్‌లు, కోల్డ్‌స్టోరేజీలు రైతులు కడతారా?
– వ్యవసాయ ఉత్పత్తుల రంగంలో కార్పొరేట్లకు మార్గం సుగమం
– నిబంధనలు సరళతరం చేస్తూ ఇప్పటికే పలు ఆర్డినెన్స్‌లు : రాజకీయ విశ్లేషకులు
– బడాబాబులకు భారీ రుణాలు ఇవ్వడానికే …

వేర్‌హౌసులు(ధాన్యాన్ని నిల్వచేసే కేంద్రాలు), కోల్డ్‌ స్టోరేజీలు కట్టుకుంటామని రైతులు రుణాలు అడుగుతున్నారా? పండించిన పంటకు న్యాయమైన ధర కల్పించమని అడుగుతున్నారా? లక్షకోట్లతో రైతులకు నిధి ఏర్పాటుచేశామని మోడీ సర్కార్‌ ఘనంగా ప్రకటించింది. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్దానం ఎంత నిజమో…ఇప్పుడు రైతుల కోసమే ‘లక్షకోట్ల నిధి’ ఏర్పాటు అన్నది కూడా అంతే నిజం. వ్యవసాయ ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశిస్తున్న ప్రయివేటు వ్యక్తులకు, కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులైన ట్రేడర్స్‌కు ఈ లక్షకోట్ల నిధి ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పథకం వల్ల సాధారణ రైతుకు సత్వరం జరిగే ఉపశమనం ఏంటో అర్థం కావటం లేదని వారు విమర్శిస్తున్నారు.

న్యూఢిల్లీ: ‘లక్ష కోట్ల’ రూపాయలతో రైతు నిధి…అని ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై వ్యవసాయ రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. వ్యవసాయ రుణాలపై ప్రతిఏటా పాలకులు పెద్ద పెద్ద అంకెలు చెబుతున్నారని, అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వారు గుర్తుచేస్తున్నారు. ఆర్బీఐ విడుదలచేసిన గణాంకాల ప్రకారం, మోడీ సర్కార్‌ వ్యవసాయరంగానికి ఇస్తున్న రుణాలు ఏటా తగ్గుతున్నాయి తప్ప పెరగటం లేదు. జూన్‌ 2014లో మొత్తం బ్యాంకు రుణాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 12.8శాతం దక్కగా, మే 2020నాటిక 12.7శాతం రుణాలు అందాయి. గత ఆరేండ్లుగా ఎక్కడా కూడా వ్యవసాయ రుణాలు పెరిగినట్టు ఆర్బీఐ గణాంకాల్లో లేదు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నామని ఎన్నికల వాగ్దానం చేసిన మోడీ సర్కార్‌ దానిని అందుకోవటం కోసం కనీస ప్రయత్నం కూడా చేయలేదని రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫసల్‌బీమా పథకంలో బీమా కంపెనీలకు లబ్ది జరిగింది తప్ప, రైతులకు ఒనగూడిందేమీలేదు. ఇప్పుడు రూ.లక్షకోట్లతో…’వ్యవసాయ మౌలిక వసతుల నిధి’ (ఏఐఎఫ్‌) ఏర్పాటుచేసి ఇచ్చే రుణాలన్నీ ప్రయివేటు వ్యక్తులకు, కార్పొరేట్‌ కంపెనీలు నియమించుకున్న ట్రేడర్స్‌కు వెళతాయనే అనుమానాలున్నాయి. బడా కార్పొరేట్లకు పన్ను మినహాయింపులు ఇచ్చారన్న అపవాదును తొలగించుకోవటం కోసం లక్షకోట్ల నిధి పథకాన్ని ప్రకటించారని రాజకీయంగా విమర్శలు ఉన్నాయి.

లక్ష కోట్ల..పథకం

రాబోయే 10ఏండ్లలో లక్షకోట్ల రూపాయల్ని బ్యాంకుల ద్వారా కేంద్రం రుణాలు మంజూరుచేయనున్నదని ప్రధాని మోడీ తెలిపారు. రైతు సంఘాలకు, ఈ రంగంలో ఔత్సాహిక పారిశ్రామివేత్తలకు పెద్ద మొత్తంలో రుణాలు అందజేస్తామనీ, కోల్డ్‌ స్టోరేజీలు, వేర్‌హౌసుల(ధాన్యాన్ని నిల్వచేయడం కోసం) నిర్మాణం, ఈ-మార్కెటింగ్‌ వ్యవస్థల ఏర్పాటుకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. దీనినంతటినీ కూడా వ్యవసాయ మౌలిక వసతుల కల్పనా నిధి (ఏఐఎఫ్‌)గా కేంద్రం పేర్కొంటున్నది.

ప్రయివేటుకు దారి..

వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, వాణిజ్యం, ధరల నిర్ణయానికి సంబంధించి మార్పులు చేస్తూ మోడీ సర్కార్‌ ఇటీవల ఒక ఆర్డినెన్స్‌ జారీచేసింది. తద్వారా ఈ రంగంలోకి పెద్ద ఎత్తున ప్రయివేటు, కార్పొరేట్‌ కంపెనీలకు ఆహ్వానం పలికినట్టయింది. నిబంధనలు సరళతరం చేస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చారని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు వీరికోసమే రూ.లక్ష కోట్లతో ‘మౌలిక వసతుల కల్పనా నిధి’ పథకాన్ని తీసుకొచ్చారని వ్యవసాయరంగ నిపుణులు భావిస్తున్నారు.

జీడీపీలో 0.3శాతం

ప్రధానిగా మోడీ పాలన ప్రారంభమయ్యాక కేంద్ర వ్యవసాయ శాఖ చేసిన వ్యయం దేశ జీడీపీలో కేవలం 0.3శాతం మాత్రమే ఉందని నిపుణులు చెబుతున్నారు. 2014-15 నుంచి 2018-19 వరకూ ఐదేండ్లపాటు కేంద్ర వ్యవసాయ శాఖ చేసిన వ్యయం దేశ జీడీపీలో 0.3శాతం ఉంది. 2019-20, 2020-21 కేంద్ర బడ్జెట్‌ ప్రకారం చూస్తే జీడీపీలో వ్యవసాయ శాఖ వ్యయం 1శాతం కనపడుతున్నది. అయితే వ్యవసాయ శాఖ వ్యయంలో అత్యధికంగా నగదు బదిలీ (ఏటా రూ.6వేలు), పీఎం ఫసల్‌ బీమా, బ్యాంకు వడ్డీ మినహాయింపు పథకాలకు(82శాతం) కేటాయించారు.

ముఖ్యంగా పీఎం ఫసల్‌ బీమా యోజన పథకంపై పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. 2016-19 మధ్యకాలంలో బీమా ప్రీమియం కింద కంపెనీలు రూ.75,772కోట్లు వసూలు చేశాయి. ఇందులో రూ.13వేల కోట్లు రైతుల నుంచి వసూలు చేశారు. మిగతా 63కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాయి. పంట నష్టపరిహారం కింద బీమా కంపెనీలు క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ చేసిన మొత్తం రూ.64వేల కోట్లు. ఈ పథకం వల్ల బీమా కంపెనీలకు దక్కిన లాభం రూ.11వేల కోట్లుపైనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

Courtesy Nava telangana