దేశంలో 1.16 లక్షల శిశు మరణాలు
ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలుపైనే…

న్యూఢిల్లీ : ప్రాణాధారమైన వాయువూ కలుషితమవుతున్నది. పెరిగిపోతున్న వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తాజా అధ్యయనం వెల్లడించింది. కలుషితమైన గాలితో నవజాతశిశువుల ఊపిరి ఆగిపోతున్నది. అధిక పరమాణు పదార్థాలు కండ్లు తెరిచి నెల రోజులు కూడా కాకముందే దేశంలో 1.16 లక్షల మంది పసికందుల ఊపిరి తీసిందని నూతన అధ్యయనం వెల్లడించింది. ఈ సంఖ్యతో కలిపి ప్రపంచవ్యాప్తంగా పుట్టిపుట్టగానే నూరేళ్ళు నిండిన చిన్నారుల సంఖ్య దాదాపు 5 లక్షలుగా పేర్కొంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 67 లక్షల మంది చనిపోయినట్టు పేర్కొంది. స్వచ్ఛంద పరిశోధనా సంస్థ ‘హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌ (హెచ్‌ఈఐ) ‘స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌-2020’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఈ అధ్యయనం నిర్వహించింది. భారతదేశానికి సంబంధించి దేశంలోని అన్ని ఆరోగ్య ప్రమాదాలతో పోలిస్తే… వాయు కాలుష్యం ఇప్పుడు మరణాలకు అతి పెద్ద ప్రమాదకరంగా ఉన్నదని తెలిపింది.

భారత్‌లో నవజాతశిశువుల మరణాల్లో సగం మందికిపైగా మృతికి గృహ, బహిరంగ ప్రదేశాల్లోని పార్టికల్‌ మ్యాటర్‌ (పీఎం) కారణమని తెలిపింది. ఇతరులు బొగ్గు, బొగ్గు, కట్టెలు, పశువుల పేడ లాంటి ఘన ఇంధనాలను వంట కోసం ఉపయోగించడం ద్వారా వెలువడే కాలుష్యంవల్ల చనిపోయారని ఈ అధ్యయనం వెల్లడించింది. గాలి కాలుష్యంతో గర్భధారణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నదనీ, అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లో నవజాత శిశువుల ఆరోగ్యం చాలా కీలకమని నివేదిక తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా తక్కువ బరువుతో పుట్టడం, ముందస్తు జననాలు, పిల్లల ఎదుగుదల లాంటి సమస్యలు కూడా వస్తున్నాయని పేర్కొంది. దీర్ఘకాలంపాటు బహిరంగ, గహ వాయు కాలుష్యానికి గురి కావడంవల్ల 2019లో మొత్తం 1.67 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తాజా అధ్యయనం తెలిపింది. వారంతా బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండెపోటు, డయాబెటిస్‌, లంగ్‌ క్యాన్సర్‌, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధుల బారినపడి చనిపోయారని పేర్కొన్నది.

కాలుష్యానికీ.. కరోనాకూ లింకు
వాయు కాలుష్యం కారణంగా కరోనా వైరస్‌ బాధితులు మరణించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని, గుండె, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులతో బాధపడే వారిలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని తాజా అధ్యయనం తెలిపింది. వాయు కాలుష్యం, కరోనా ఇన్‌ఫెక్షన్‌కు మధ్య సంబంధం పూర్తిగా స్పష్టం కానప్పటికీ.. వాయు కాలుష్యానికి, గుండె, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు పెరుగడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అధ్యయనం స్పష్టంచేసింది.

Courtesy Nava Telangana