• తెలంగాణలో మరో 15 మందికి పాజిటివ్‌
  • అత్యధికంగా పశ్చిమలో 12 మందికి పాజిటివ్‌
  • ప్రకాశం జిల్లాలో 8 మందికి కరోనా నిర్ధారణ
  • గుంటూరులో ఐదుగురు, విశాఖలో నలుగురు
  • అనంతలో 2, ‘తూర్పు’, కృష్ణాజిల్లాల్లో ఒక్కొక్కరు
  • బాధితుల్లో అత్యధికులు ఢిల్లీ వెళ్లొచ్చినవారే
  • పశ్చిమలో 9 కేసుల ఫలితం కోసం ఎదురుచూపు
  • రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 56

 అమరావతి : రాష్ట్రంలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. మంగళవారం ఒక్కరోజే 33 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి వరకూ వీటిసంఖ్య 23 మాత్రమే కాగా వారిలో ఇద్దరు డిశ్చార్జ్‌ కూడా అయ్యారు. ఇప్పుడు కొత్తగా నమోదైన కేసులతో ఏపీలో కరోనా సోకినవారి సంఖ్య 56కు చేరింది. పాజిటివ్‌ వచ్చినవారిలో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12మంది ఉండగా, ప్రకాశం జిల్లాకు చెందినవారు 8మంది, గుంటూరు జిల్లాలో ఐదుగురు, విశాఖ జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. పశ్చిమ జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేదు. ఒకేసారి 12 మందికి పాజిటివ్‌  రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.  ఏలూరులో 8, భీమవరంలో ఇద్దరు, ఆకివీడు, గుండుగొలనుకు చెందిన ఒక్కొక్కరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరో తొమ్మిది మంది రిపోర్టులు బుధవారం అందనున్నాయి.

బాధితులందరూ ఢిల్లీ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారేనని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో 132మంది నమూనాలను పరీక్షలకు పంపించగా 8మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో ఏడుగురు ఢిల్లీ సమావేశాలకు వెళ్లొచ్చినవారు. ఒకరు ఢిల్లీ వెళ్లి వచ్చిన వృద్ధుడి కుమారుడిగా గుర్తించారు. గుంటూరు జిల్లాలో తాజాగా మరో ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణఅయింది. వీరిలో ఇద్దరు గుంటూరు, మరో ఇద్దరు మాచర్ల, ఇంకొకరు కారంపూడికి చెందినవారు. బాధితుల్లో ఒక మహిళకు ఢిల్లీ యాత్రకు వెళ్లి వచ్చిన భర్త ద్వారా వైరస్‌ సోకింది. విశాఖలో మరో నలుగురికి కరోనా నిర్ధారణ అయింది.  ఇక కర్ణాటకలోని గౌరీబిదునూరుకు చెందిన 15మంది, అనంతపురం జిల్లా హిందూపురం ప్రాంతానికి చెందినవారి బంధువులు మరో 30మంది కలసి 15న మక్కా వెళ్లి 24న హిందూపురం వచ్చారు. వీరిలో గౌరీబిదునూరుకు చెందిన వృద్ధురాలు కరోనా లక్షణాలతో అదేరోజు రాత్రి మృతిచెందింది. దీంతో హిందూపురానికి చెందిన వారందరినీ 26న హోం ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఓ మహిళ, పదేళ్ల బాలుడికి పాజిటివ్‌గా తేలింది. కాగా, ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వాడ వీధికి చెందిన వృద్ధుడి (65)కి పాజిటివ్‌ వచ్చింది. కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన వృద్ధురాలి(65)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఢిల్లీ సమావేశాలకు హాజరై వచ్చిన వ్యక్తి ద్వారా ఆమెకు వైరస్‌ సోకింది.

తీవ్రతను దాస్తున్నారా?
కరోనా తీవ్రతను అధికారులు దాస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ వెళ్లి వచ్చినవారు, వారితో కలిసి తిరిగిన వారిలో కొందరు మృత్యువాత పడుతున్నా, ఇతర అనారోగ్య కారణాలతో మృతి చెందారని చెబుతున్నారు. విజయవాడలో 3రోజుల క్రితం ఒక వ్యక్తి మరణించగా, తర్వాత 24గంటలకు అతడి భార్య కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌ అని తేలింది. మరోసారి నిర్ధారించుకునేందుకు తిరుపతి ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. అక్కడా పాజిటివ్‌ వస్తే ఆమె భర్త కచ్చితంగా కరోనాతోనే మృతిచెంది ఉంటారు. విజయవాడలోనే మరో కుటుంబంలో దంపతులు మృతిచెందగా వారి కుమారుడు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అతడికి కూడా పాజిటివ్‌ వస్తే పరిస్థితి ఏమిటిన్నది ప్రశ్నార్థంగా మారింది. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయని సమాచారం. కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలు పకడ్బందీగా నిర్వహించాల్సి ఉండగా, కొన్నింటిని సాధారణ మరణాలుగా తేల్చి మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు. ఇదిచాలా ప్రమాదకరమనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Courtesy Andhrajyothi