• ఉత్సవాలకు మిగిలింది ఇక ఒక్కరోజే
 • ఇప్పటికీ అసంపూర్తిగానే పనులు
 • పూర్తికాని మరుగు దొడ్లు, వాటర్‌ ట్యాంకుల నిర్మాణం
 • గిరిజన సంక్షేమం, పీఆర్‌ పనులు అంతంతే..
 • ‘పోలీస్‌’కు 11 కోట్లు.. ఇప్పటికీ మొదలుకాని వైనం
 • ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ పనుల్లోనూ అవకతవకలు
 • కాంట్రాక్టర్లంతా గులాబీ బినామీలే!

భూపాలపల్లి : మేడారం మహా జాతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ.4 కోట్లు కేటాయించింది. వీటితో వీఐపీ పార్కింగ్‌ స్థలాన్ని చదును చేయడం, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రోడ్ల అభివృద్ధి, ఆశ్రమ పాఠశాల వద్ద అధికారులకు సౌకర్యాలు కల్పించాలి. కానీ, ఊరట్టం నుంచి కొండాయికి వెళ్లే రోడ్డు కానీ ఇతర ఏజెన్సీ రోడ్లకు కానీ ఎక్కడా పిడికెడు మట్టి పోసిన దాఖలాలు లేవు. వీఐపీ పార్కింగ్‌ ప్లేస్‌లో పనులు అసంపూర్తిగా చేపట్టి వదిలేశారు. కీలకమైన పనులు చేసే ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖకు రూ.19 కోట్లు కేటాయించారు. మరుగుదొడ్లు అన్నీ నిర్మించేశామని అధికారులు లెక్కలు చెబుతున్నారు. కానీ, ఊరట్టం, నార్లాపూర్‌, వనం రోడ్లలో ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి.

చాలాచోట్ల మరుగుదొడ్లకు డోర్లు లేకపోవడం, ఉన్నచోట శుభ్రత లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. జాతర మొదలు కాకముందే మరుగుదొడ్లు ఊడిపోతున్నాయి. మేడారం మహా జాతర సమీపిస్తోంది. బుధవారం నుంచి జాతర ప్రారంభం కానుంది. కానీ, అసంపూర్తి పనులు, చేసినవాటిలోనూ అక్రమాలు వెక్కిరిస్తున్నాయి. అంచనాలను భారీగా పెంచేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ ఏ శాఖ పనులైనా అరకొరగానే అయ్యాయి. మరుగు దొడ్లు, వాటర్‌ ట్యాంకుల నిర్మాణం, షెడ్ల నిర్మాణం కూడా పూర్తి చేయకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పేలా లేవు. జాతర సమీపించే వరకు సాగదీసి.. తర్వాత మొత్తం బిల్లులు నొక్కేయడం అనే వ్యూహం దీనివెనుక ఉంది. కాంట్రాక్టర్లంతా ‘గులాబీ’ బినామీలు కావడంతో ఆడింది ఆట అవుతోంది.

జాతరలో వసతులకు ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. కొన్ని పనులకు టెండర్లు నిర్వహించగా.. మరికొన్ని నామినేషన్‌పై అప్పగించారు. డిసెంబరు 15లోగా పూర్తి చేయాలని అప్పటి ములుగు కలెక్టర్‌ నారాయణరెడ్డి కాంట్రాక్టర్లకు ఆదేశిస్తే.. ఆ గడువు పూర్తికాకముందే డిసెంబరు 31 వరకు డెడ్‌లైన్‌ విధిస్తూ మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రకటన జారీ చేశారు. అయినా పూర్తికాకపోవడంతో సంక్రాంతిలోపు పూర్తి చేస్తామని మంత్రులు ప్రకటించారు. ఆ గడువును జనవరి 25కు; జనవరి 30కి పొడిగించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, సత్యవతి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, గిరిజన శాఖ కార్యదర్శి మహే్‌షదత్‌ ఎక్కా తదితరులంతా కాంట్రాక్టర్లను హెచ్చరించినా.. ఇప్పటికీ పనులు సగం సగమే.

జాతరలో పనుల తీరు ఇదీ!

 • ఊరట్టం, జంపన్నవాగు, మేడారం వద్ద 800 కేఎల్‌పీ సామర్థ్యంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ చేపట్టిన ట్యాంకు నిర్మాణం పూర్తి కాలేదు. దీనికి కేటాయించిన నిధులన్నీ వృథా కానున్నాయి.
 • భక్తుల స్నానాల కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ 538 బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్స్‌ (బీవోటీ) ఏర్పాటు చేసింది. వనం రోడ్డు, ఊరట్టం, జంపన్నవాగు, నార్లాపూర్‌ ప్రాంతాల్లో అవి అప్పుడే ఊడిపోతున్నాయి.
 • జంపన్న వాగులోని 44 బావుల్లో ఇన్‌ఫిల్టరేషన్‌ కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ రూ.88 లక్షలు కేటాయించింది. ఒక్కొక్క బావిలో పూడిక తీసేందుకు రూ.2 లక్షలు కేటాయించింది. కానీ, రూ.2 లక్షలతో కొత్త బావినే తవ్వవచ్చు. కాంట్రాక్టర్లు కూడా పైపైన ఇసుక తీసేసి చేతులు దులుపుకొన్నారు.
 • ఇరిగేషన్‌ శాఖలోనూ పనులు అసంపూర్తిగా మిగిలాయి. జంపన్నవాగు వద్ద 354 బీవోటీలు బిగింపు, ఇసుక చదును, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు 132 గదుల ఏర్పాటుకు రూ.4 కోట్లు కేటాయించారు. ఆ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
 • జంపన్న వాగులో ఇసుక చదునుకే రూ.50 లక్షలు కేటాయించారు. సగమే చేసి నీటిని వదిలారు. ఇప్పుడు ఇక వాగును చదును చేసినట్టే!!
 • నార్లాపూర్‌ నుంచి భూపాలపల్లి రోడ్డుకు ప్యాచ్‌ వర్క్‌లు, సైడ్‌బర్మ్‌లు 20 రోజుల కిందటే వేసినా ఎక్కడివక్కడ ఊసిపోతున్నాయి. రోడ్లకు ఇరువైపులా సూచికలు, హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్ల ఊసేలేదు.
 • జంపన్నవాగు, రెడ్డిగూడెం, గద్దెల సమీపంలో మూడు పర్మినెంట్‌ షెడ్ల నిర్మాణం, వాగులో గిరిజన సంక్షేమ శా ఖ చేపట్టిన 5 బావుల ఇన్‌ఫిల్టరేషన్‌; సోలార్‌ లైట్ల ఏర్పాటు పూర్తికాలేదు.
 • డ్రెయినేజీలు, కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం, వాటర్‌ పైపులైన్‌ వ్యవస్థ, టెంట్లు, భక్తులకు షెడ్లు తదితర పనులకు దేవాదాయ శాఖకు రూ.3 కోట్లు కేటాయించగా సగం మొదలే కాలేదు.
 • విద్యుత్తు శాఖకు రూ.4 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 247 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, 1,724 స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. నెల క్రితమే పనులు మొదలైనా ఇంకా సాగుతూనే ఉన్నాయి.
 • మందుల కొనుగోళ్లకే రూ.70 లక్షలు వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించారట. ఇప్పటికే లక్షలమంది వస్తున్నా కనీస వైద్య సౌకర్యాలూ కరువు.
 • పోలీస్‌ శాఖకు రూ.11 కోట్లు కేటాయించారు. పనులు ప్రారంభం కాలేదు. సీసీ కెమెరాల టెండర్లలో తక్కువ ధరకు కోట్‌ చేసిన వారికి కాకుండా అనుకూలురకు ఇచ్చారనే ఆరోపణలున్నాయి.
గులాబీలే.. బినామీలు
జాతర పనుల కాంట్రాక్టర్లలో ఎక్కువమంది గులాబీ బినామీలే. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల అనుచరులే కాంట్రాక్టర్లుగా పనులు దక్కించుకున్నారు. వీరిలో దశాబ్ద కాలంగా మేడారంలో పని చేస్తున్న కాంట్రాక్టర్లతో పాటు టీఆర్‌ఎస్‌ కీలక నేతల అనుచరులు ఉన్నారు. ఎప్పట్లాగే, పనులను మమ అనిపించి పెద్ద మొత్తంలో బిల్లులను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే అధికారులపై అధికార పార్టీ కీలక నేతలు పర్సంటేజీల కోసం ఒత్తిళ్లు తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పనుల్లో ఆలస్యానికి ప్రధాన కారణం నేతల ఒత్తిళ్లు, కాంట్రాక్టర్ల పట్టింపులేనితనమేనని తెలుస్తోంది. తక్కువ ధరకు చేసే పనికి ఎక్కువ ధరకు ఎస్టిమేషన్‌ వేసి, కమీషన్లు దండుకుంటున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. జాతర అభివృద్ధి పనులపై విజిలెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ శాఖలతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బిల్లులు చెల్లించాలని భక్తులు కోరుతున్నారు.