దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 1.09 కోట్ల చెట్ల నరికివేతకు అనుమతి
రాష్ట్రంలో నేలకొరిగిన 6.65 లక్షల వృక్షాలు

వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకోసం అవసరమైన భూములను బదలాయించి చెట్లను నరకడానికి అనుమతిస్తున్న ప్రభుత్వాలు ప్రత్యామ్నాయంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు తగినంత చొరవచూపడం లేదు. విధానపరమైన సమస్యలు, నిధుల లేమి కూడా అవరోధాలుగా మారాయి. గత అయిదేళ్లలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు బదలాయించిన అటవీభూముల్లో ఏకంగా 1.09 కోట్ల చెట్లను నరికేందుకు అటవీ, పర్యావరణశాఖ అనుమతులు ఇచ్చింది. ఆ శాఖ కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో జులై 26న ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోనూ ఈ సంఖ్య గణనీయంగానే ఉంది.

పరిహారం నిధులు వస్తేనే ప్రత్యామ్నాయ అటవీ అభివృద్ధి
కోల్పోయిన అటవీభూములకు కేంద్రం రాష్ట్రాల నుంచి పరిహారం వసూలుచేస్తోంది. ప్రత్యామ్నాయంగా అడవిని పెంచుతామంటూ ఈ పరిహారం నిధుల్ని ‘కంపా’ (కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్లానింగ్‌ అథారిటీ)లో జమచేసింది. కేంద్రం నిబంధనల కారణంగా రాష్ట్రాలు జమచేసిన నిధుల్లోంచి ఏటా 10 శాతమే రాష్ట్రాలకు వస్తున్నాయి. తెలంగాణకు- 2016-17లో రూ.117 కోట్లు, 17-18లో రూ.127 కోట్లు, 18-19లో 237.3 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర నిధులు ‘కంపా’లో రూ.3,500 కోట్లు ఉన్నాయి. వీటిలో 90 శాతం నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలని కోరుతున్నామని, అలా ఇస్తేనే ప్రత్యామ్నాయ అటవీ అభివృద్ధి వేగంగా జరుగుతుందని రాష్ట్ర అటవీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

trees, one crore , india, chopped, endangered, telangana, projects, development

కొట్టేయొద్దు.. మరోచోట నాటాలి
అడవుల్లో చెట్లు జీవవైవిధ్య నిలయాలు. జంతువులకు ఆహారాన్ని, పక్షులకు ఆవాసాన్నిస్తాయి. అటవీప్రాంతాల్లో 20-30 ఏళ్లే కాదు.. వందేళ్ల వయసున్న చెట్లూ ఉన్నాయి. ప్రాజెక్టు ఏదైనా ఉన్నచెట్లను నరకకుండా కాపాడాలి. తప్పనిసరి పరిస్థితి అయితే ఆ చెట్లను కూల్చకుండా మరోచోట నాటాలి. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఖర్చు ఎక్కువని నరికేస్తుంటారు. ఈ విధానం మారాలి. వేగంగా పెరిగే చెట్లే కాకుండా జంతువులకు ఆహారం, పక్షులకు ఆవాసం ఇచ్చే చింత, మామిడి, వేప, మర్రి వంటి మొక్కలను నాటాలి. బలమైన గాలులు వచ్చినా ఇవి పడిపోవు. ‘కంపా’ నుంచి రాష్ట్రాలకు ఇచ్చే నిధులను పెంచాలి.

ప్రొఫెసర్‌ హంపయ్య, జీవవైవిధ్య మండలి మాజీ ఛైర్మన్‌

(Courtacy Eenadu)