ఓట్ల కొనుగోలుకు సరికొత్త ఎత్తుగడలు..డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్న అభ్యర్థులు
వ్యక్తులు, కుటుంబాల వారీగా పంపకాలు
ఆర్మూర్‌లో ఇంటికి కిలో చొప్పున చికెన్‌
గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌లో కుంకుమ భరిణెలు
పెద్దపల్లిలో ఓ వర్గం వారికి 2.40 లక్షలు
బండ్లగూడ జాగీర్‌లో ఆరు ఓట్లుంటే బైక్‌!
హైదరాబాద్‌ : మునిసిపల్‌ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం తెర పడింది. పోలింగ్‌కు ఇక మంగళవారం ఒక్కరోజే మిగిలి ఉంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. దీంతో నిబంధనల మేరకు సోమవారం సాయంత్రం ప్రచారం ముగించిన వివిధ పార్టీల అభ్యర్థులు.. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్ల వారీగా, కుటుంబాల వారీగా డబ్బు పంపకాలు చేస్తున్నారు. మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. సామూహిక విందులతో పాటు బిర్యానీ ప్యాకెట్లను ఇళ్లకు చేరవేస్తున్నారు. మరికొందరి ఓటర్ల విషయంలో వారి బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్నారు. కొందరికి మద్యం, మరికొందరికి వస్తువులు, సామగ్రి వంటివి పంపిణీ చేస్తున్నారు. పెద్దపల్లి మునిసిపాలిటీ 2వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వస్రతం హనుమంతు తరపున ఆయన బంధువు ఒకరు ఓటర్లను ప్రలోభపెట్టిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక వర్గం ఓట్ల కోసం రూ.2.40 లక్షలు ఇచ్చి.. వారి దేవుడిపై ప్రమాణం చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారి మదన్‌మోహన్‌రెడ్డి.. పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కొన్ని మునిసిపాలిటీల్లో ప్రలోభాలివీ..

  • నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఓ అభ్యర్థి ప్రతి ఇంటికీ కిలో చికెన్‌ పంపిణీ చేశారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మునిసిపాలిటీలో ఓ అభ్యర్థి సోమవారం రాత్రి ఒక్కో ఓటుకు రూ.1000 వరకు పంపిణీ చేశారు.
  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మునిసిపాలిటీల్లో మద్యంతోపాటు చికెన్‌, మటన్‌ ప్యాకెట్లను ఓటర్ల ఇళ్లకే పంపిస్తున్నారు. అదనంగా ఓటుకు రూ.1000 నుంచి రూ.2 వేలు పంచేందుకు సిద్ధమవుతున్నారు.
  • సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలోని గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌లో ఓటుకు రూ.2 వేలు, మెజారిటీ వార్డుల్లో వెండి కుంకుమ భరిణెలను అందిస్తున్నారు. హుస్నాబాద్‌లో ఒక వార్డులో ఓటుకు రూ.4 వేలు పంపిణీ చేసినట్లు సమాచారం. మెదక్‌లో ఓ అభ్యర్థి మహిళా ఓటరుకు కనుము (జాకెట్‌ గుడ్డ), కుంకుమ భరిణె అందజేశారు.
  • హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లిలో ఓటర్లతో సాముహిక విందు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఒక్కో గ్రూప్‌నకు రూ.20 వేల వరకు ఇస్తామని హామీ ఇవ్వడంతోపాటు ఓటర్లతో ప్రతిజ్ఞలు చేయించుకుంటున్నారు. జగిత్యాలలోని ఖిల్లాగడ్డలో ఓ పార్టీ అభ్యర్థి డబ్బులు పంచుతుండగా స్వతంత్ర అభ్యర్థి అడ్డుకోవడంతో గొడవ జరిగింది.
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మునిసిపాలిటీల్లో పేదలు ఎక్కువగా ఉన్న కాలనీల్లో.. ఓటుకు రూ.2 వేలతో పాటు 25 కిలోల బియ్యం కూడా పంపిణీ చేస్తున్నారు. 50మంది ఓటర్ల బాధ్యతను ఒకరికి అప్పగిస్తున్నారు.
  • హైదరాబాద్‌ శివారులోని బండ్లగూడ జాగీర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఓ అభ్యర్థి.. ఇంట్లో ఆరు ఓట్లుంటే ఒక ద్విచక్ర వాహనం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆదిభట్లలో ఓటుకు రూ.25 వేలు ఇచ్చేందుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. శంకర్‌పల్లిలో.. ఒక కుటుంబంలో ఆరు ఓట్ల కన్నా ఎక్కువ ఉంటే తులం బంగారం ఇచ్చేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మద్యం స్వాధీనం
మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు.. సోమవారం ఘట్‌కేసర్‌లో 375 మద్యం బాటిళ్లతో పాటు 24 బ్రీజర్లు, 13 బీరు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా నిజాంసాగర్‌ మండలం మగ్దుంపూర్‌ తండాలోని ఓ ఇంట్లో 25 మద్యం కార్టన్లను, కొత్తగూడెం మునిసిపాలిటీలోని 34వ వార్డులో కుసుమ శ్రావణ్‌ అనే వ్యక్తి ఇంట్లో 166మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

(Courtesy Andhrajyothi)