దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల ప్రయోజనాలకు మూల స్థంభాలుగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది చివరికల్లా భారత పెట్రోలియం కార్పొరేషన్‌, ఎయిర్‌ ఇండియాను అమ్మేస్తామని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పటికే దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీస్తాయి. దేశ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రయివేటు సంస్థల లాభాలకు బలవుతాయి. ఇది దేశ ద్రోహ చర్య.
నరేంద్రమోడీ రెండోసారి అధికారం చేపట్టిన అయిదునెలల కాలంలోనే అనేక ప్రభుత్వరంగ సంస్థలపై వేటు వేశారు. ఐఆర్‌సీటీసీలో 12.5శాతం వాటాలను అమ్మేశారు. రెెండు ప్రయివేటు ట్రైన్‌లకు అనుమతిచ్చారు. మరో యాభైరైల్వే మార్గాలలో ప్రయివేటు ట్రైన్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ‘రైల్‌ టెల్‌’లో 10శాతం వాటాలను అమ్మేయటానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ‘షిప్పింగ్‌ కార్పొరేషన్‌’లో 63శాతం, ‘కాంకర్‌’లో 30శాతం, ‘నిప్కో’లో 100శాతం ఇలా 43 ప్రభుత్వరంగ సంస్థలను బడా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించారు. ఇటీవలే లక్నో, అహ్మదాబాద్‌, తిరువనంతపురం, జైపూర్‌, గౌహతీ, మంగుళూర్‌ వంటి ఆరు ఎయిర్‌ పోర్టులను ‘ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం’ పేర అదానీ గ్రూప్‌కి ధారాదత్తం చేశారు. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయనే పేర ఎయిర్‌ ఇండియాలోని ఏకంగా 75శాతం ప్రభుత్వ వాటాలను యుద్ధ ప్రాతిపదికన అమ్మేయటానికి పూనుకున్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితరగా ఎయిర్‌ ఇండియాతో అప్పులు చేయించి కొత్త విమానాలు కొనిపించింది. దీంతో రూ.58 వేల కోట్ల అప్పుల్లో మునిగి పోయింది. వేల కోట్ల రూపాయల లాభాలార్జిస్తున్న భారత పెట్రోలియం కార్పొరేషన్‌ను కూడా అమ్మకానికి పెట్టారు. ఇవన్నీ హిందూత్వ, మతతత్వ ముసుగులో విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారు.

భారత పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఆయిల్‌ కంపెనీ. దీని ప్రస్తుత ఆస్తుల విలువ సుమారు రూ.2లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. 38.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగి ఉంది. మరో రూ.48 వేల కోట్లు విలువ కలిగిన 6 మిలియన్‌ టన్నుల విస్తరణ ప్రాజెక్టులు దేశంలో జరుగుతున్నాయి. గత ఏడాది రూ.3.39 లక్షల కోట్ల టర్నోవర్‌ సాధించింది. ముంబయి, కోచి, నుమలిగర్‌ (అసోం), బినాలలో చమురు శుద్ధి కంపెనీలున్నాయి. 77చోట్ల భారీ చమురు నిల్వ డిపోలున్నాయి. 55 ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్లు, 2,241 కిలోమీటర్ల పొడవుగల చమురు పైపు లైను, 56చోట్ల విమానాలకు ఇంధన సరఫరా స్టేషన్లు, నాలుగు లూబ్రికెంట్‌ ప్లాంట్లు, మేజర్‌ పోర్టులలో ఆయిల్‌ లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ సదుపాయాలు కలిగి ఉన్నాయి. వీటితో పాటు దేశ విదేశాల్లో 11 అనుబంధ పరిశ్రమలు, 22 జాయింట్‌ వెంచర్‌ కంపెనీలు, మరి కొన్ని కంపెనీల్లో వాటాలు కలిగి ఉన్నాయి. అంతేకాక దేశంలోని అనేక మెట్రో పాలిటన్‌ నగరాల్లో వేల కోట్ల రూపాయలు విలువ చేసే విలువైన భూములున్నాయి.

దేశ ఆయిల్‌ మార్కెట్‌లో ప్రస్తుతం బీపీసీఎల్‌ 24శాతం వాటాతో దేశవ్యాప్తంగా 15,078 రిటైల్‌ అవుట్‌లెట్లు, 6,004 ఎల్‌పీజీ పంపిణీ ఏజెన్సీలతో అతిపెద్ద ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీగా కొనసాగుతున్నది. భారీగా లాభాలు ఆర్జిస్తున్నది. నరేంద్ర మోడీ మొదటిసారి అధికారం చేపట్టిన దగ్గర నుంచి అంటే 2014 మార్చి నుంచి 2019 మార్చి వరకు అయిదేండ్లలో రూ.50,576 కోట్లు లాభాలు ఆర్జించింది. 2018-19లోనే రూ.14,948 కోట్ల లాభాలు గడించింది. గత ఏడాది లోనే పన్నుల రూపంలో రూ.96వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది. గత 5ఏండ్లలో డివిడెండ్ల రూపంలో రూ.17,124 కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది. ప్రస్తుతం రూ.34,400 కోట్ల రిజర్వు నిధులు కలిగి ఉంది.
దేశంలో మరొక పెద్ద ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీ హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌). ఇది కూడా 18 మిలియన్‌ టన్నుల సామర్ధ్యంతో రూ.3లక్షల కోట్ల టర్నోవర్‌తో, 15,127 ఆయిల్‌ రిటైల్‌ అవుట్‌లెట్లతో బ్రహ్మాండమైన లాభాలు ఆర్జిస్తున్నది. గత ఏడాది రూ.11,442కోట్ల లాభాలు పొందింది. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ రెండు ప్రభుత్వ కంపెనీల్లో సుమారు 23వేల మంది పర్మినెంట్‌, 51వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు.
70వ దశకం ప్రారంభంలో దేశంలోని ప్రయివేటు ఆయిల్‌ కంపెనీలైన కాల్‌టెక్స్‌, ఎస్సో, బర్మాషెల్‌ వంటి విదేశీ కంపెనీలను జాతీయం చేశారు. ఆ తరువాత ప్రభుత్వమే చమురు కంపెనీలను నెలకొల్పి ఆయిల్‌ రంగంలో ప్రభుత్వ ఏకస్వామ్యాన్ని నెలకొల్పి స్వయం సంవృద్ధిని సాధించింది. ఫలితంగా దేశ ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామికీ కరణకు, ప్రజలకు ఎంతో మేలు జరిగింది. 1991 సరళీకరణ విధానాల తరువాత ఈ రంగంలోకి ప్రవేశించేలా, ప్రయివేటు కార్పొరేట్‌ రంగానికి రాజమార్గం వేశారు. ప్రధానంగా రిలయన్స్‌ సంస్థకు భారీగా చమురు నిక్షేపాలను, పంపిణీ, మార్కెట్‌ను కట్టబెట్టారు. బీజేపీ అధికారం లోకి వచ్చిన తరువాత రిలయన్స్‌ సంస్థ హద్దూ అదుపూ లేకుండా ఈ రంగాన్ని తమ గుప్పెట్లోకి తీసుకొచ్చుకోవటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది.
కాంగ్రెస్‌, బీజేపీ క్రోనీ పెట్టుబడిదారీ చర్యల వల్ల గత ఇరవైఏండ్ల కాలం లోనే రిలయన్స్‌ కంపెనీ 62 మిలియన్‌ టన్నుల సామర్ధ్యానికి ఎగబాకింది. నేడు బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌లను కూడా దీనికి పూర్తిగా ధారాదత్తం చేస్తే, మొత్తం దేశం లోని ఆయిల్‌రంగానికి అంటే 120మిలియన్‌ టన్నుల సామర్ధ్యానికి రిలయన్స్‌ అధిపతి అవుతుంది. ఈ చర్యలు నేడు వేగవంతమయ్యాయి. 2017-18లోనే హెచ్‌పీసీఎల్‌లోని తన 51.11శాతం వాటాలను కేంద్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే ఓఎన్‌జీసీకి అమ్మేసి రూ.36,915 కోట్లను ప్రభుత్వ ఖజానాకు జమ వేసుకున్నది. ఓఎన్‌జీసీతో రూ.25 వేల కోట్లు బలవంతాన అప్పు చేయించి ఈ షేర్లు కొనిపించింది. లాభాల్లో ఉన్న ఓఎన్‌జీసీ ఇప్పుడు నష్టాల పాలైంది. నష్టాల పేరు చెప్పి నేడు ఓఎన్‌జీసీని కూడా అమ్మేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాది అమెరికాకు చెందిన బడా కంపెనీ ‘ఎక్సాన్‌ మొబిల్‌’కు ముడి చమురు అన్వేషణ, ఉత్పత్తిలో భాగస్వామ్యం కల్పించారు.
ఇప్పుడు మార్చిలోపే బీపీసీఎల్‌ని అమ్మేయాలని మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీపీసీఎల్‌లో వందశాతం వాటాలు కేంద్ర ప్రభుత్వానివే. 53.29శాతం వాటాలు అమ్మి తద్వారా సుమారు 65వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకోబోతున్నారు.
మొత్తం మన దేశ ఆయిల్‌, గ్యాస్‌ రంగాన్ని రిలయన్స్‌, అదానీ గ్రూపులకు కట్టబెట్టాలన్న కుట్రలో భాగమే ఈ చర్యలు. ఈ కంపెనీలు ఆయిల్‌, గ్యాస్‌ రంగంలో బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ తరువాత నేడు కీలకంగా ఉన్నాయి. అలాగే ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్‌, కెనడా, సౌదీ అరేబియా దేశాలకు చెందిన బహుళజాతి ఆయిల్‌ కంపెనీలతో మిలాఖత్‌ ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రస్తుతం దేశ ఆయిల్‌ మార్కెట్‌లో బీపీసీఎల్‌, ఐఓసీ, ఓఎంసీఎస్‌, హెచ్‌పీసీఎల్‌ కంపెనీల వాటా 75శాతం ఉంది. ఇదంతా ప్రయివేటు పరమైతే భారతదేశ ప్రజల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఎందుకంటే ‘ఆయిల్‌, గ్యాస్‌’ రంగాల్లో ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యం ఉండటం వల్ల వాటి ధరల నియంత్రణ కొనసాగుతున్నది. ప్రజలకు, కంపెనీలకు సబ్సిడీ రూపంలో వివిధ రూపాల్లో వీటిని సరఫరా చేస్తున్నాయి. వేలాది మందికి ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించడమే కాకుండా, వీరి వేతనాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ సృష్టికి దోహదపడుతున్నాయి. వేలకోట్ల రూపాయలతో సామాజిక, సంక్షేమ కార్యకలాపాలు చేపడుతున్నాయి. అన్నింటికీ మించి ‘ఆయిల్‌, గ్యాస్‌’ రంగం వ్యూహాత్మకమైనది. దేశ భద్రతకు అత్యంత ముఖ్యమైనది. ఇంత ప్రాధాన్యత కలిగిన రంగం మొత్తం ప్రయివేటు కార్పొరేట్ల చేతుల్లోకి వెళితే దేశ రక్షణకు, 120కోట్ల ప్రజల ప్రయోజనాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం చోటు చేసుకుంటుంది. దేశం ‘ఆయిల్‌, గ్యాస్‌’ రంగాల్లో పరాధీన పాలౌతుంది.

– డాక్టర్‌ బి. గంగారావు
సెల్‌ : 9490098792