• రాష్ట్రాధినేత పిలిచారు
 • అధికారులు రాలేమన్నారు
 • క్రియాశీలమైన గవర్నర్‌ తమిళిసై
 • కరోనాపై ట్విటర్లో నెటిజన్ల గోడు
 • ఆస్పత్రులు, చికిత్సల తీరుపై ఆందోళన
 • ఇక మీరే ఆదుకోవాలంటూ వినతులు
 • వాటికి స్పందించిన రాష్ట్ర గవర్నర్‌
 • కరోనాపై సమీక్షకు రావాలని సీఎస్‌,
 • స్పెషల్‌ సీఎ్‌సలకు ఆదేశం
 • ముందే ఖరారైన కార్యక్రమాలు
 • ఉన్నాయంటూ ఇద్దరూ దూరం
 • ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే ధిక్కారం?
 • ప్రచ్ఛన్న యుద్ధమేనంటున్న విశ్లేషకులు
 • నేడు ప్రైవేటు ఆస్పత్రులతో గవర్నర్‌ భేటీ

హైదరాబాద్‌ : గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందా? గవర్నర్‌ క్రియాశీలంగా మారారని ప్రభుత్వం భావిస్తోందా!? కరోనా విషయంలో చొరవ చూపడమే ఇందుకు కారణమా? పాలన వ్యవహారాల్లో గవర్నర్‌ ప్రత్యేక చొరవ చూపటానికి బీజేపీ ఢిల్లీ పెద్దలు కారణమని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అనుమానిస్తున్నారా? ఈ ప్రశ్నలకు ఔను’ అనే అంటున్నాయి రాజకీయ, ప్రభుత్వ వర్గాలు. ఇందుకు కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఉదాహరిస్తున్నాయి. స్వతహాగా డాక్టర్‌ అయిన తమిళిసై ప్రభుత్వంలో ఎవరూ చేయని సాహసాన్ని చేశారు. డాక్టర్లకు భరోసా ఇచ్చే పేరిట నిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించారు. టెస్టులు పెంచాలంటూ సర్కారుకు సూచించారు. సీఎం కేసీఆర్‌ కూడా ఏ ఆస్పత్రినీ సందర్శించలేదని తప్పుబడుతూనే సామాజిక మాధ్యమాల వేదికగా గవర్నర్‌ నిమ్స్‌కు వెళ్లడంపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ట్విటర్లోనూ తమిళిసై క్రియాశీలమయ్యారు. ఐపీఎ్‌సల పోస్టింగులు, బదిలీలు, పదోన్నతులు చేపట్టడం లేదని, చాలాచోట ఇన్‌చార్జులు ఉన్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాన్ని ట్విటర్లో షేర్‌ చేశారు. కేసులు తక్కువగా ఉన్నప్పుడు లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు కట్టడి చర్యలపై అంతగా దృష్టి పెట్టకపోవటంపై ఇంటా బయటా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకాలంలో వైద్య సేవలు అందకపోవడం, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సకు అధిక రుసుం వసూలు చేస్తుండటంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. పలువురు నెటిజన్లు ఆది, సోమవారాల్లో ఈ సమస్యలను ట్విటర్‌ ద్వారా గవర్నర్‌ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో పరిస్థితి దయనీయంగా ఉందని, ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, ఇక, ఇప్పుడు మీరే ఆదుకోవాలంటూ విన్నవించారు. ఈ నేపథ్యంలోనే, కరోనా పరిస్థితిపై చర్చించటానికి ఉన్నతాధికారులను పిలిచినట్లు సోమవారం మధ్యాహ్నం ట్విటర్‌ ద్వారా గవర్నర్‌ వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశానికి రావాల్సిందిగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి రాజ్‌భవన్‌ కబురు పెట్టినట్లు తెలిసింది. కానీ, వీరిద్దరూ వెళ్లలేదు. ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయని, తాము రాలేమని రాజ్‌భవన్‌కు తేల్చిచెప్పారని సమాచారం.

ధిక్కారం వెనుక..
గవర్నర్‌ ఆదేశాలను ధిక్కరించే సాహసం ఉన్నతాధికారులు చేయబోరని ప్రభుత్వ వ్యవహారాలపై పట్టున్న సీనియర్లు చెబుతున్నారు. ‘‘సీఎస్‌, స్పెషల్‌ సీఎస్‌ అంటే ముఖ్యమంత్రి కనుసన్నల్లో పనిచేసే ఉన్నతాధికారులు. సీఎంకి తెలియకుండా, తెలియజేయకుండా గవర్నర్‌ ఆదేశాలను ధిక్కరించే సాహసం చేయరు’’ అని రిటైర్డ్‌ అధికారి ఒకరు చెప్పారు. గవర్నర్‌ పిలిచినా వెళ్లకపోవటం ఆ పదవిని అగౌరవపర్చటమేనని అభిప్రాయపడ్డారు. ఒకవేళ గవర్నర్‌ పిలిచిన సమయానికి వెళ్లలేని పరిస్థితి ఉంటే, ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఒక అధికారిని రాజ్‌భవన్‌కు పంపి తెలియజేయటం సంప్రదాయం. సోమేశ్‌ కుమార్‌, శాంతి కుమారి దీనిని పాటించలేదని తెలుస్తోంది..

ఎందుకీ పరిస్థితి?
గవర్నర్‌ ఆదేశాలను ఉన్నతాధికారులు పాటించకపోవటం రాజకీయ, అధికార వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ మధ్య సత్సంబంధాలు లేవని అనడానికి ఈ పరిణామం అవకాశం కల్పిస్తోందనే వ్యాఖ్యలు ఆ వర్గాల నుంచి వస్తున్నాయి. వాస్తవానికి, ఏడాది కిందట గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై ప్రారంభంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించారు. కేసీఆర్‌ సారథ్యంలోని సర్కారును పలు సందర్భాల్లో మెచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో కరోనా నివారణ చర్యలు, పరీక్షలు, ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్సల తీరుపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు సర్కారును ఇరుకున పెట్టే విధంగా ఉంటున్నాయి. సభలు, సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె చేస్తున్న ప్రకటనలు ప్రభుత్వ పనితీరుపై పరోక్షంగా అసంతృప్తిని బయటపెడుతున్నాయి. వివిధ అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేయటానికీ గవర్నర్‌ వెనకాడటం లేదు. ఈ నేపథ్యంలోనే, గవర్నర్‌ తీరుపై సీఎం కేసీఆర్‌, ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు ఒకింత కినుక వహించినట్లు తెలుస్తోంది. పాలన వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యం ఏమిటనే ప్రశ్న అధికార టీఆర్‌ఎస్‌ ముఖ్యుల అంతర్గత సంభాషణల్లో వ్యక్తమవుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ గొంతుకను గవర్నర్‌ ద్వారా వినిపిస్తోందని వారు చెబుతున్నారు. ఒకవైపు, రాష్ట్రంలోని బీజేపీ రాజకీయంగా దూకుడు పెంచటం, మరోవైపు గవర్నర్‌ స్వరంలో అనూహ్య మార్పును ఈ సందర్భంగా ఉదాహరిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గవర్నర్‌, ముఖ్యమంత్రి మధ్య ఉప్పు, నిప్పు వాతావరణాన్ని రాజేస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఉన్నతాధికారులు గవర్నర్‌ ఆదేశాలను ధిక్కరించటం అందులో భాగంగానే చూడాల్సి ఉంటుందనే చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది.

సీఎం కేసీఆర్‌ను కలిసిన సీఎస్‌, డీజీపీ
వారం రోజులుగా సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌ్‌సలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సోమవారం సాయంత్రం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి కలిశారు. వారిద్దరూ రెండు గంటలపాటు సీఎంతో భేటీ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రభుత్వ ఆదాయ, వ్యయాలు, పంటల సాగు, బియ్యం పంపిణీ, ప్రత్యేకించి, కరోనా వ్యాప్తి పరిణామాలను సీఎస్‌ ఆయనకు నివేదించినట్లు తెలిసింది. ఇటీవల హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు, బదులుగా తీసుకోవాల్సిన చర్యలు కూడా వారి చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనాపై చర్చించటానికి గవర్నర్‌ పిలిచిన అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.

మీరే కాపాడాలి
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు గవర్నర్‌  తమిళిసై శరణుజొచ్చారు. ప్రైవేటు ఆస్పత్రుల విషయంలో జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలని, కరోనా విషయంలో సాయం చేయాలని ట్విటర్‌ ద్వారా వేడుకున్నారు. దాంతో, ు‘కేసుల పెరుగుదలపై భయాందోళనలు అక్కర్లేదు. కరోనా వచ్చిన వారంతా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరమే లేదు. డాక్టర్లను ఫోన్‌లలో సంప్రదిస్తూ.. ఇంట్లోనే వైద్యం పొందవచ్చు. ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలను చెక్‌ చేసుకోవాలి. ఇబ్బందిగా ఉంటేనే ఆస్పత్రిలో చేరాలి’’ అని సూచించారు.

ట్విటర్లో ప్రశ్నలు..  గవర్నర్‌ జవాబులు
ప్రీతమ్‌ దేశ్‌పాండే: హైదరాబాద్‌లో అత్యంత దయనీయ పరిస్థితులున్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రులు మధ్యతరగతి ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటున్నాయి. ఏ ఆస్పత్రిలో కూడా బెడ్లు లేవు. నగరంలో 20 రోజులైనా లాక్‌డౌన్‌ విధించాలి.

గవర్నర్‌: నమోదు చేసుకున్నా.

పాలిటిక్స్‌ ల్యాబ్‌: తెలంగాణ ప్రథమ పౌరురాలిగా కొవిడ్‌ను మీరు సీరియ్‌సగా తీసుకోవాలి.

గవర్నర్‌: నిజమే.

ఇండియన్‌: ఆస్పత్రుల్లో బెడ్లు లేవు. బెడ్‌ల ఖాళీలు ప్రదర్శించేలా చూడాలి. మీరే చొరవ తీసుకోవాలి.

గవర్నర్‌: నేను చర్చిస్తా. ప్రైవేట్‌ ఆస్పత్రులతో మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశమవుతున్నా. ఐసొలేషన్‌ సౌకర్యాలతోపాటు ప్రజల వినతులపైనా చర్చిస్తా. బెడ్లు, బిల్లింగ్‌, టెస్టులు వంటి సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కరోనాను విజయవంతంగా నిర్మూలించాలి.

స్వాతి: దేవుడా..! చాలా విజ్ఞప్తులున్నాయి. కఠినమైన నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి.

గవర్నర్‌: 3 నెలల నుంచి నేను పనిలో ఉన్నా. నిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించా. పరిస్థితులపై ఆరా తీశా.

రీతూ: మేడమ్‌.. మూడు ుటీ’ల అర్థం ఏమిటి? ప్రభుత్వం టెస్టులు చేయడం లేదు. ట్రాక్‌ (కనిపెట్టడం) కూడా లేదు. హైదరాబాద్‌ అంతటా కరోనా వ్యాప్తి చెందింది. కానీ, గాంధీ ఆస్పత్రిలోనే వైద్యం చేస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. గవర్నర్‌: అవును. పరీక్షలు చేయడం.. గుర్తించడం.. వైద్యం చేయడంతోపాటు అవగాహన కల్పించడం, శానిటైజర్లు, మాస్కులు, భౌతిక దూరం పాటించడం, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకునేలా చేయడం, భయభ్రాంతులకు గురికాకుండా చూడటం.. ఇవే ప్రధానం.

సుబ్బు: థర్మల్‌ రీడర్లు, ఆక్సీమీటర్లు ఇంట్లో ఉండాలా…?

గవర్నర్‌: సాధారణ థర్మామీటర్‌ చాలు. ఆక్సీ మీటర్‌ అక్కర్లేదు. లక్షణాల్లేకుండా పాజిటివ్‌గా నిర్ధారణ అయినా.. స్వల్ప లక్షణాలతో కరోనా వచ్చినా ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. 60 ఏళ్లు నిండినవారు.. బీపీ, షుగర్‌ ఉన్న వాళ్లకు కరోనా సోకితేనే ఆక్సీమీటర్‌ అవసరం.